logo

చోదక ఒక్కక్షణం..!

సంతబొమ్మాళి మండలం తలగాం-రాజగోపాలపురం రహదారి మధ్యలో ఈ ఏడాది జనవరి 7న ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనదారుడు, ఆటో చోదకుడు మృతిచెందారు. రోడ్డు ఇబ్బందికరంగా ఉండటంతో వాహనాలు తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

Published : 06 Feb 2023 06:27 IST

నిబంధనలు పాటించకే ప్రమాదాలు
రహదారిపై పోతున్న ప్రాణాలు

* సంతబొమ్మాళి మండలం తలగాం-రాజగోపాలపురం రహదారి మధ్యలో ఈ ఏడాది జనవరి 7న ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనదారుడు, ఆటో చోదకుడు మృతిచెందారు. రోడ్డు ఇబ్బందికరంగా ఉండటంతో వాహనాలు తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.


* ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేట పంచాయతీ మండాది గ్రామం వద్ద ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఇసుక లారీ ఢీకొనడంతో నలుగురు మహిళలు మృతిచెందారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.


* ఈ ఏడాది జనవరి 31వ తేదీన నరసన్నపేట మండలం దేవాది పైవంతెనపై ద్విచక్రవాహనం ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో గొర్లె వెంకట రమణ(16) మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మైనర్‌ ద్విచక్ర వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


* గతేడాది డిసెంబరులో పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రమేశ్‌ కుటుంబ సమేతంగా విశాఖపట్నం నుంచి వస్తుండగా నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద కల్వర్టును ఢీకొనటంతో తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. సరిపడినంత విశ్రాంతి లేకపోవడమే కారణం.


పలాస, న్యూస్‌టుడే: ఎంతగా హెచ్చరిస్తున్నా.. ఎన్ని నిబంధనలు విధిస్తున్నా.. రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట పడటంలేదు. చోదకులు వాటిని పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. చోదకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చి నిబంధనలు పాటించినప్పడే జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దగలమని నిపుణులు అంటున్నారు.


ఈ అంశాలు ప్రధానం..

* వాహనం రోడ్డుపైకి  తీసేప్పుడు చోదకుల మానసిక స్థితి బాగుండాలి. క్రమశిక్షణతో ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ అనుమతించిన వేగంతో వాహనం నడపాలి.

* వాహనం కండిషన్‌  ఎప్పటికప్పుడు చెక్‌ చేయిస్తూ ఉండాలి. రహదారికి అనుగుణంగా వాహనాన్ని నడిపించాలి.

* మద్యం తాగి వాహనం నడపరాదు. చోదకులు  తగినంత విశ్రాంతి తీసుకుంటుండాలి.

* 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వకూడదు.

ఈ అంశాలను పాటిస్తే 90 శాతానికిపైగా ప్రమాదాలకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా ఎన్ని హెచ్చరికలు ఏర్పాటుచేసినా ప్రయోజనం ఉండడదని వారంటున్నారు. ఇంకా నిపుణులు ఏం చెబుతున్నారంటే..


అప్రమత్తత అవసరం...
- ఆర్‌.శంకరరావు, ఎస్‌ఐ, రహదారి భద్రతా విభాగం

ప్రయాణికులు తమ వాహనంలోనే ఎక్కాలనే ఆతృతలో కొందరు వాహనదారులు ప్రమాదాలు చేస్తున్నారు. వెనుక వచ్చే వాహనాలను ఎంతదూరంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించకుండానే రోడ్డు మధ్యలోనే ఉన్నట్టుండి ఆపేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కొందరు రహదారులపై వాహనాలు ఆపి విశ్రాంతి తీసుకోవడం, బాగుచేసుకోవడం చేస్తుంటారు. ఇదీ ప్రమాదాలకు కారణమవుతోంది. ఆటోల్లో స్టీరియో, పాటలు నిషేధించాలి. వాహనాలను నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు.


నలువైపులా దృష్టిపెట్టాలి
- సీహెచ్‌ శ్రీదేవి, జిల్లా రవాణా అధికారిణి, శ్రీకాకుళం

క్రమశిక్షణ లేకుండా వాహనాలు నడపటం, అధిక వేగం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవటం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ మాట్లాడటం, మద్యం తాగడం వంటి చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. వాహనం నడిపే సమయంలో ముందు, వెనుక, రెండు పక్కలా ఇలా నాలుగువైపులా దృష్టి పెడుతుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని