logo

నిరంతర విద్యుత్తు సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక

జిల్లావ్యాప్తంగా నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. వేసవి కావడంతో కొన్ని సమయాల్లో అంతరాయం కలుగుతోంది.

Published : 03 Jun 2023 05:07 IST

ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ దైవప్రసాద్‌

జిల్లావ్యాప్తంగా నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. వేసవి కావడంతో కొన్ని సమయాల్లో అంతరాయం కలుగుతోంది. భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించేందుకు అడుగులు వేస్తున్నాం.’ అని తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) శ్రీకాకుళం సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఎల్‌.దైవప్రసాద్‌ అన్నారు. జిల్లాలో విద్యుత్తు పరంగా ఎదురవుతున్న సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.


కవర్డ్‌ కండక్టర్‌ ఏర్పాటు..

జిల్లాలో వివిధ రకాల విద్యుత్తు కనెక్షన్లు 8,67,798, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 31,241 ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఈదురు గాలుల సమయాల్లో చాలా చోట్ల తీగలపై చెట్లు పడటంతో తెగిపోతున్నాయి. సరఫరా నిలిచిపోతోంది. మళ్లీ పునరుద్ధరించేందుకు చాలా సమయం పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కవర్డ్‌ కండక్టర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీని ద్వారా తీగలు మరింత బలంగా ఉంటాయి. ఇప్పటికే శ్రీకాకుళం నగరంలో ప్రయోగాత్మకంగా వేశాం.


కోతలు అమలు చేయట్లేదు..

జిల్లాలో విద్యుత్తు కోతలు ఎక్కడా అమలు చేయడం లేదు. సాంకేతిక లోపాలు సరి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు సరఫరా నిలపాల్సి వస్తోంది. వినియోగదారులు దాన్నే కోతలుగా భావిస్తున్నారు. విద్యుత్తు తీగల మధ్య దూరంతో ఎండ వేడిమికి కొన్నిచోట్ల తీగలు తెగిపోతుంటాయి. అలాంటి సమయంతో పాటు స్తంభాలు మార్చేటప్పుడు కూడా సరఫరాకు అంతరాయం వాటిల్లుతుంది.


త్వరలో స్మార్ట్‌మీటర్లు..

మొదటిగా స్మార్ట్‌ విద్యుత్తు మీటర్లు వ్యవసాయ పంపుసెట్లకు అమర్చుతారు. ఆ మీటరులో సిమ్‌ కార్డు ఉంటుంది. దాని వల్ల రోజువారీ, నెలవారీ వినియోగంపై క్షేత్రస్థాయికి వెళ్లకుండానే సిబ్బంది సమాచారం వస్తుంది. పనిభారం కూడా తగ్గుతుంది. ప్రస్తుత విధానంలో సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి రీడింగ్‌ తీయడానికి 15 రోజుల సమయం పడుతోంది. స్మార్ట్‌మీటరుతో వినియోగదారులు, అధికారులకు ఆ నెలలో ఎంత విద్యుత్తు వాడారనేది ఒక్కరోజులోనే తెలిసిపోతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో ఏర్పాటు చేస్తాం.


లోవోల్టేజీ సమస్యకు పరిష్కారం..

ఉద్దానం మండలాలతో పాటు మెళియాపుట్టి, పొందూరు, తదితర ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య ఎక్కువగా ఉంది. అక్కడి నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఆయా ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు వేయాలని నిర్ణయించాం. త్వరలోనే ఆ పనులు చేసి సమస్య పరిష్కరిస్తాం.


స్థలం ఉంటేనే ఉపకేంద్రం నిర్మాణం...

శ్రీకాకుళం నగరంలో విద్యుత్తు ఉపకేంద్రం లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరఫరా ఆగిపోతే అంపోలు, చిలకపాలెం సబ్‌స్టేషన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఉప కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని కలెక్టర్‌కు గతంలో లేఖ రాశాం. స్థలం కేటాయించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.


కోటా దాటి వినియోగం..

ప్రజలు అవసరం మేరకే కరెంట్‌ వినియోగిస్తే మేలు. ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఏసీ, కూలర్‌, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతుంటారు. జూన్‌ 1న జిల్లాకు విద్యుత్తు కోటా 60 లక్షల 91 వేల యూనిట్లు కాగా...62 లక్షల 12 వేల యూనిట్లు వినియోగించారంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని