logo

మా త్యాగానికి విలువ లేదు

మీపై నమ్మకంతో మూలపేట పోర్టు నిర్మాణానికి ఎంతో సహకరించాం. అయినా మా త్యాగానికి విలువ లేదు’ అని మూలపేట పోర్టు నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 03 Jun 2023 05:07 IST

మూలపేట గ్రామస్థుల ఆవేదన

సబ్‌ కలెక్టరుకు సమస్యలు వివరిస్తున్న మూలపేట గ్రామస్థులు

టెక్కలి, న్యూస్‌టుడే: మీపై నమ్మకంతో మూలపేట పోర్టు నిర్మాణానికి ఎంతో సహకరించాం. అయినా మా త్యాగానికి విలువ లేదు’ అని మూలపేట పోర్టు నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కలి కార్యాలయంలో సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డితో నిర్వాసితులు శుక్రవారం సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామ సర్పంచి బీరు భీమారావు, బాధిత రైతులు వివరించారు.
‘భూసేకరణ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నో హామీలు ఇచ్చారు. గ్రామంలో ఎవరికి ఎంత పరిహారం అందిందో, ఎంతమందికి పీడీఎఫ్‌లు చెల్లించారో ఆ సమాచారం మాకు తెలియడం లేదు. జీడి మొక్కలు, మా సాగులో ఉన్న సీఆర్‌జడ్‌, పోరంబోకు భూములకు పరిహారం అందిస్తామని గతంలో చెప్పారు. నేటికీ కార్యరూపం దాల్చడం లేదు. అధికారిగా మిమ్మల్ని మేమంతా నమ్మాం. మీ కన్నా ముందు పనిచేసిన అధికారులు వచ్చి ఉంటే ఇప్పటివరకు భూములు ఇచ్చేవాళ్లమే కాదు.’ అని పేర్కొన్నారు.  దీనిపై సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తన పరిధిలోని అంశాలన్నీ ఓపికగా ప్రాధాన్యంతో పరిష్కరిస్తున్నానన్నారు. తన పరిధిలో లేనివి కలెక్టరుకు వివరించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. లేనిపోని అపోహలకు తాను సమాధానాలు చెప్పలేనంటూ ఓ దశలో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు కోరిన వివరాలను గ్రామంలో అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని