logo

జీవనాధారం కోల్పోతున్నాం.. న్యాయం చేయండి

జోడూరు, పట్టుపురం, మర్రిపాడు పంచాయతీల పరిధిలో సర్వేనంబరు-13లో దబ్బగూడ సమీపంలో ఉన్న చింతలకొండను గ్రానైట్‌ క్వారీకి కేటాయించడంతో జీవనాధారం కోల్పోతామని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 03 Jun 2023 05:07 IST

గ్రానైట్‌ నిర్వహణకు ప్రజాభిప్రాయ సేకరణ

మాట్లాడుతున్న శశిభూషణ్‌గౌడో

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: జోడూరు, పట్టుపురం, మర్రిపాడు పంచాయతీల పరిధిలో సర్వేనంబరు-13లో దబ్బగూడ సమీపంలో ఉన్న చింతలకొండను గ్రానైట్‌ క్వారీకి కేటాయించడంతో జీవనాధారం కోల్పోతామని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజపురం గ్రామంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పది హెక్టార్లలో కలర్‌ గ్రానైట్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంపై అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. దీనికి టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్‌కుమార్‌, టెక్కలి భూగర్భగనుల శాఖ ఏడీ ఫణిభూషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా రాజపురం గ్రామానికి చెందిన శశిభూషన్‌గౌడో మాట్లాడుతూ చుట్టపక్కల గ్రామాల ప్రజలకు చింతలకొండ ఆధారమని వర్షాధార ప్రాంతం కావడంతో కొండపైనుంచి వచ్చే నీటితోనే వ్యవసాయం చేస్తున్నామని, క్వారీల నిర్వహణతో పచ్చని వాతావరణం కోల్పోతామని ఆవేదన వ్యక్తంచేశారు. కొండపై ఉండే ప్రకృతి దేవతలను పూజించడం ఆచారమని, దానికి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని కైలాస్‌రావు తెలిపారు. దబ్బగూడ తాగునీటి సమస్యను పరిష్కరించాలని, పోడు వ్యవసాయానికి నష్టం లేకుండా చూడలని కామేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రములో తెలిపిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చారు.  


హామీలు అమలు చేయకుంటే చర్యలు

ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా క్వారీ నిర్వహిస్తే చర్యలు తప్పవని టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. క్వారీ నుంచి వచ్చే ఆదాయం ఇరు పంచాయతీలకు అందేలా చర్యలు తీసుకుంటామని తాగు, సాగునీటి వనరులు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి కల్పించడంలో క్వారీ యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సమస్యలుంటే సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సరోజని, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పట్టుపురం, జోడూరు పంచాయతీ సర్పంచులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని