logo

ఇవి తాగేనీళ్లా..?

‘వర్షాకాలం.. వ్యాధుల ముప్పు పొంచి ఉండేసమయం.. స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ ఇదీ మన వైద్యఆరోగ్యశాఖ చేస్తున్న ప్రచారం.. కానీ తాగునీటి సరఫరా యంత్రాంగానికి మాత్రం అవేం పట్టలేదు.

Published : 09 Aug 2023 05:17 IST

కుళాయిల ద్వారా రంగుమారిన జలాలు సరఫరా
టెక్కలి మండలంలో రక్షిత నీటిపథకం నిర్వహణ తీరు
న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

‘వర్షాకాలం.. వ్యాధుల ముప్పు పొంచి ఉండేసమయం.. స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ ఇదీ మన వైద్యఆరోగ్యశాఖ చేస్తున్న ప్రచారం.. కానీ తాగునీటి సరఫరా యంత్రాంగానికి మాత్రం అవేం పట్టలేదు. ఇందుకు ఉదాహరణ టెక్కలి మండల దాహార్తి తీర్చే నీటి పథకం నిర్వహణ తీరే.. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం నుంచి కొద్దిరోజులుగా సరఫరా చేస్తున్న నీటిని చూస్తే అసలు దీన్ని ఎలా తాగగలం అన్న సందేహం కలుగుతోంది. పూర్తిగా రంగుమారిన బురదనీరే కుళాయిల ద్వారా సరఫరా కావడంతో జలమా.. గరళమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ప్రత్యామ్నాయం లేక ఈ నీటినే వినియోగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నీరుగారుతోన్న లక్ష్యం..

కొన్ని దశాబ్దాల కాలంగా నీటికష్టాలు అనుభవిస్తున్న టెక్కలి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2016లో అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ పక్కనే దీన్ని నిర్మించి అందులోని నీటిని శుద్ధిచేసి ప్రజలకు అందించాలన్నది పథకం ఉద్దేశం. దీనికోసం 0.1 టీఎంసీల సామర్థ్యం ఉన్న సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. ఏటా వర్షాకాలంలో వంశధార కాలువ నుంచి వచ్చే నీటిని నిల్వచేసి ఏడాది పొడవునా ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో కేవలం బురదనీరే ప్రజలకు పంపిణీ జరుగుతోంది. బిందెల్లో అడుగున బురద మేట వేస్తోందని, కాచి వడపోసినా నీరు బురదగానే కనిపిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో శుద్ధి కావట్లేదు..

రక్షిత నీటిపథకం నిర్వహణపై ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. పథకం చుట్టూ ఉన్న రక్షణ కంచె పలు చోట్ల ధ్వంసమైంది. పశువులు ట్యాంకు గట్టుపైకి చేరుతున్నాయి. నిండా పేరుకుపోయిన నాచులో పలుచోట్ల తాగి  పడేసిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. నీటిని శుద్ధిచేసే విభాగంలో రాళ్లు, కంకర, బొగ్గు, ఇతర పదార్థాలతో ఏర్పాటు చేసిన బెర్త్‌లను అప్పటి నుంచి మార్చకపోవడం వల్లే నీరు పూర్తిస్థాయిలో శుద్ధికావడం లేదని ఆరోపిస్తున్నారు.   క్లోరినేషన్‌, ఆలమ్‌ పదార్థాల వినియోగంపైనా విమర్శలున్నాయి.


ఎందుకూ పనికిరావడం లేదు

- కాపల సుజాత, టెక్కలి

కుళాయిల ద్వారా కొద్దిరోజులుగా సరఫరా జరుగుతున్న నీరు ఎందుకూ పనికిరావడం లేదు. చెరువుల్లో నీరైనా కాస్త స్వచ్ఛంగా కనిపిస్తోంది. నేరుగా కాలువలో నీటినే సరఫరా చేస్తున్నట్లు ఉంటుండటంతో తాగేందుకు, స్నానాలకు వినియోగించలేకపోతున్నాం. శుద్ధజలాన్ని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.


పరిశీలించి చర్యలు చేపడతాం

- మోహన్‌, జేఈ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, టెక్కలి

రక్షిత నీటిపథకం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులోకి ప్రస్తుతం వంశధార కాలువ నుంచి వస్తున్న నీటిని పంపింగ్‌ చేస్తుండటం వల్ల బురద నీరు వస్తోంది. క్లోరేనేషన్‌తో పాటు ఆలమ్‌ను కలుపుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. ఎక్కువ మొత్తంలో ఆలమ్‌కలిపి నీటిని శుద్ధిచేసే ప్రక్రియ చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని