logo

మురికి కూపం.. ప్రజలకు శాపం..!

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ పేరిట ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు.

Published : 27 Mar 2024 03:44 IST

పట్టణాల్లో అస్తవ్యస్తంగా కాలువలు
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే శ్రీకాకుళం నగరం, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస పట్టణం

ఇచ్ఛాపురం కండ్ర వీధి కాలువ అధ్వానంగా మారింది. దుర్వాసన భరించలేకపోతున్నామని.. దోమలు విజృంభిస్తుండటంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు.  

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ పేరిట ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీలు లేకపోవడం, దశాబ్దాల కిందట నిర్మించినవి కావడం.. ఆధునికీకరణకు నోచుకోక సమస్య మరింత తీవ్రమవుతోంది. కాలువల్లో చెత్త తొలగించకపోవడంతో మురుగు నీరు పారడం లేదు. ‘పన్నులు చెల్లిస్తున్నాం.. కనీస మౌలిక వసతులు కల్పించండి’ అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టడం లేదు.
పురపాలక సంఘాల్లో పదేళ్ల వర్షపాతం, జనావాసాలు, రానున్న రోజుల్లో పట్టణ విస్తరణ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మురుగు నీటి కాలువలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ప్రభుత్వం ఆమోదించాక నిర్మాణాలు ప్రారంభించాలి. ఆయా పనులను సమగ్ర ప్రణాళికను అనుసరించి చేపడితే పట్టణ ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల్లో ఈ తరహా ప్రణాళికలు లేవు. అధికారుల ఆలోచన మేరకు కాలువల నిర్మాణాలు చేపట్టడం.. నిర్వహణ లోపం కారణంగా మురుగు సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

ఇదీ పరిస్థితి

పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ప్రధాన రహదారులు మినహా కాలనీల్లోని వీధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. కొన్ని నెలలుగా కాలువల్లో పూడిక తొలగించక మురుగునీరు నిలిచి దోమలు, దుర్గంధంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, వాహనాల నిర్వహణ, ఇతర అవసరాలకు ఏడాదికి సుమారు రూ.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా మారిపోతున్నాయి.


దశాబ్దాల కిందట నిర్మించినవే..

చ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస పురపాలక సంఘాలు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలో చాలా వరకు డ్రైనేజీలు దశాబ్దాల కిందట నిర్మించినవే. శ్రీకాకుళం నగరంలోని శివారు ప్రాంతాలన్నీ ఒకప్పుడు గ్రామ పంచాయతీలే. నగర విస్తరణలో భాగంగా వాటిని విలీనం చేస్తూ వచ్చారు. ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి పన్నులు అమాంతం పెరిగినా నాణ్యమైన సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇప్పటికీ చాలా వీధుల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ నీరు పారుతూ దర్శనమిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని