logo

ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు.

Published : 29 Mar 2024 04:48 IST

కోడ్‌ అమలులో ఉన్నా పట్టించుకోని అక్రమార్కులు

ప్రధాన రహదారికి ఆనుకొని ఆర్‌అండ్‌బీ స్థలంలో ఏర్పాటు చేసిన బడ్డీ

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. తాజాగా పట్టణంలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి జంక్షన్‌ వద్ద శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలంపై కొందరి కన్ను పడింది. అదే తడవుగా అక్కడ బడ్డీలు ఏర్పాటు చేసేందుకు తెర లేపారు. వాస్తవంగా సర్వే నంబర్‌ 39లో ఎకరా 42 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల నిమిత్తం తెదేపా హయాంలో ఆర్‌అండ్‌బీకి ప్రభుత్వం అప్పగించింది. అప్పట్లో ఆ స్థలంలో కొంత భాగాన్ని రహదారుల విస్తరణకు వినియోగించారు. మిగిలిన దాంట్లో కొంత భాగాన్ని ఇప్పటికే ఆక్రమించి దుకాణాలు నిర్మించి అద్దెలకు ఇచ్చేశారు. ఉన్న కొద్దిపాటి స్థలంలో కూడా కొందరు రహదారికి ఇరువైపులా బడ్డీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార అండతో ప్రజాఅవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలాలను ఇలా దోచేస్తుండటంపై ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమదాలవలస నియోజకవర్గం ఎన్నికల అధికారిగా జేసీ నవీన్‌ వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారి పర్యవేక్షణలో ఉన్న పట్టణంలో ఇలా ప్రభుత్వ భూములు, చెరువు గర్భాలు, ప్రధాన కాలువలు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో దారుణమని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని అంతా కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం...

ప్రభుత్వ స్థలాలపై రెవెన్యూ అధికారులకు పూర్తి బాధ్యత ఉంటుంది. పురపాలక సంఘం పరిధిలో ఎలాంటి ఆక్రమణలు జరిగినా చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. గుర్తించిన అంశాలను రెవిన్యూ, మున్సిపల్‌ ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

రవి, మున్సిపల్‌ కమిషనర్‌, ఆమదాలవలస పురపాలక సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని