logo

బరితెగింపు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి.

Published : 29 Mar 2024 05:02 IST

జాతీయ రహదారిపై శ్రీకాకుళం నగర సమీపంలో పెద్దపాడు వద్ద సీతంపేటకు చెందిన బియ్యం బండి ఇలా ముఖ్యమంత్రి ఫొటోకు ముసుగు లేకుండా తిరుగుతూ కనిపించింది.  -న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. మరోపక్క వాలంటీర్లు, వివిధ శాఖల సిబ్బంది యథేచ్ఛగా అధికార పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. కోడ్‌ తమకేం అడ్డు అన్నట్లుగా బరితెగించి నాయకులతో కలిసి తిరుగుతున్నారు.

న్యూస్‌టుడే, బృందం

వాలంటీర్లపై వేటు..

వైకాపా టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి సంతబొమ్మాళి గ్రామ వాలంటీర్లు కల్లూరి పాపారావు, వాదాల దుర్గారావు, అట్టాడ కామేశ్వరరావు, బొమ్మాళి ఉమాశంకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు  సీ-విజిల్‌ యాప్‌కు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌కమర్‌  వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిని తొలగించినట్లు ఎంపీడీవో ఉమాసుందరి తెలిపారు. వైకాపా తరఫున ప్రచారంలో పాల్గొన్న బోరుభద్రకు చెందిన వాలంటీర్లు బి.శ్రీలత, అశ్వినీలను తీసివేసినట్లు ఎంపీడీవో చెప్పారు.  

దువ్వాడ శ్రీనివాస్‌తో ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీరు కామేశ్వరరావు

న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు

సారవకోట, న్యూస్‌టుడే: పెద్దలంబ పంచాయతీ మూగుపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చౌదరి లక్ష్మీనారాయణకు డీఈవో కె.వెంకటేశ్వరరావు గురువారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయుడు ఆయన వాట్సాప్‌ గ్రూపులో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిరిజన ఐక్యవేదిక బలపరచిన వ్యక్తికి ఓటు వేయాలని, రాజకీయ ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన డీఈవో 24 గంటల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఉపాధ్యాయుడికి నోటీసు పంపించారు. నోటీసు అందుకున్న ఉపాధ్యాయుడు లిఖిత పూర్వక వివరణ ఇవ్వడంతో డీఈవోకు అందించినట్లు ఎంఈవో తెలిపారు.


దిగని అధికార మత్తు

న్యూస్‌టుడే, సారవకోట: వైకాపా నరసన్నపేట నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ ప్రచారంలో మద్యం దుకాణ ఉద్యోగులు పాల్గొన్నారు. సారవకోటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి, ఇదే మండలం అవలింగి దుకాణంలో పనిచేస్తున్న ఆర్‌.సంతోష్‌ పాల్గొన్నారు. స్థానిక తెదేపా నాయకులు గుర్తించి ఎంపీడీవో రాంబాబుకు  ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని