logo

జగనన్న పాలనలో తాగండి.. తూగండి..!

ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచ్చిన మద్య నిషేధం హామీని అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఆదాయం గడించేందుకే అధిక ప్రాధాన్యమిచ్చారు.

Updated : 15 Apr 2024 06:22 IST

అయిదేళ్లలో గణనీయంగా పెరిగిన ఆదాయం
బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు
న్యూస్‌టుడే, పాత శ్రీకాకుళం, బృందం

‘గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారుతోంది. అది కాపురాల్లో చిచ్చుపెడుతోంది. జగనన్న వస్తున్నాడని చెప్పండి. అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం. 2024 ఎన్నికల నాటికి 5 నక్షత్రాల హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తాం. ఆ తరువాతే ఓట్లు అడుగుతాం.’

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్‌ మాటలివీ..


ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచ్చిన మద్య నిషేధం హామీని అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఆదాయం గడించేందుకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో ఏదో చేస్తున్నామని మభ్య పెట్టి.. తెర వెనుక గొలుసు(బెల్టు) దుకాణాలను ప్రోత్సహించారు. ప్రస్తుతం జిల్లా  వ్యాప్తంగా ఊరూరా స్థానిక వైకాపా నాయకుల  అండదండలతో బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వేళాపాళా లేకుండా విక్రయాలు జరుపుతుండటంతో వారి వ్యాపారం 3 పెగ్గులు..
6 గ్లాసులుగా సుభిక్షంగా ఉంది.


తెదేపా హయాంలో.. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేసేవారు. అలా జిల్లాలో 235 షాపులు కొనసాగేవి.


వైకాపా ప్రభుత్వం వచ్చాక.. ప్రైవేటు మద్యం దుకాణాలను ఎత్తేశారు. వాటి స్థానంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ నిర్వహణలో తొలిదశలో 178 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత టూరిజం అవుట్లెట్ పేరుతో మరో 15 దుకాణాలకు అనుమతులు జారీ చేసింది. ఇలా మొత్తం 193 మద్యం షాపులు నడుస్తున్నాయి.


ఆ తర్వాత.. ప్రభుత్వ మద్యం దుకాణాలను మరిన్ని పెంచాలని అధికార పార్టీ నేతలు ఆలోచించారు. దశలవారీ నిషేధం అన్నాం.. కదా జనాలు తిరగబడతారేమో అని కాబోలు ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. వాటి బదులుగా.. ఏకంగా వేలాది సంఖ్యలో.. ఊరూరా బెల్టు దుకాణాలు తెరుచుకునేలా పరోక్షంగా సహకరించారు. ప్రస్తుత మద్యం దుకాణాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో సీసాలు బెల్టు దుకాణాలకు తరలిస్తూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఫలితంగా ఆశించిన ఆదాయం గడిస్తున్నారు.


ఒప్పంద ఉద్యోగుల నుంచి నెలవారీ వసూళ్లు!

శ్రీకాకుళం నగరం మారుతీ థియేటర్‌ వెనుక రహదారిపైనే తాగుతున్న మందుబాబులు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నియమించిన ఒప్పంద ఉద్యోగులు నుంచి ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కార్యాలయ అవసరాలు, ప్రొటోకాల్‌, ప్రజాప్రతినిధుల ఖర్చులు పేరిట ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.2-4 వేలు వరకు దండుకొంటున్నారని సమాచారం. కొద్దినెలల కిందట బదిలీల పేరిట ఒక్కో ఉద్యోగి నుంచి రూ.50- 70 వేల వరకు వెనకేసుకున్నారని ఆశాఖ ఉద్యోగులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.


నడిరోడ్డుపైనే తాగుడు..

ఈ చిత్రంలో చూశారా.. టెక్కలిలో నడిరోడ్డుపై యువకుడు ఎలా మద్యం తాగుతున్నాడో..? మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోనూ అధికార పార్టీ నేతల అండతో ఇష్టానుసారం బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటం.. ఒకప్పటిలా పర్మిట్‌ గదులు లేకపోవడంతో క్రీడామైదానాలు, ఖాళీ స్థలాల్లోనే మందుబాబులు తాగి స్థానికులకు అసౌకర్యం కలిగిస్తున్నారు.

న్యూస్‌టుడే, టెక్కలి


పాన్‌షాపులో గుట్టుగా..

గార మండలం శ్రీకూర్మం ప్రధాన రహదారిలోని పలు గొలుసు దుకాణాల్లో మద్యం వ్యాపారం గుట్టుగా జరుగుతోంది. స్థానిక బస్టాండ్‌ సమీపంలోని ఓ పాన్‌ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్నారు. ఆయన ఇంట్లో మద్యం నిల్వలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు వచ్చిపోతున్నారు తప్ప.. చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.    

న్యూస్‌టుడే, గార


24 గంటలూ దొరికేలా..

నరసన్నపేట గ్రామీణం: ఉర్లాం సాయివీధి గొలుసు దుకాణం వద్ద మందుబాబులు

ప్రభుత్వ మద్యం దుకాణాల సమయాన్ని ప్రారంభంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అని ప్రకటించారు. తర్వాత దాన్ని ఎనిమిది, తొమ్మిది గంటలు చేసి.. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగించేలా ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఆ దుకాణాలు మూసి వేసిన తర్వాత కూడా బెల్టు దుకాణాల్లో సరకు అందుబాటులో ఉంచుతున్నారు. వాటి ద్వారా 24 గంటల పాటు మద్యం దొరికేలా వెసులుబాటు కల్పించారు.


కల్తీ మద్యం సీసాలు గుర్తింపు

కోటబొమ్మాళిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో గతేడాది డిసెంబరు 14న విజిలెన్స్‌ అధికారులు పెద్ద ఎత్తున కల్తీ మద్యం సీసాలను గుర్తించారు. సుమారు 1,150(180 మి.లీ.) సీసాలను సీజ్‌ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో ఈ మద్యం దుకాణం సూపర్‌వైజర్‌ పరారీలో ఉన్నట్లు సీఐ ప్రకటించగా.. ప్రస్తుతం ఆయన విధుల్లో ఉండటం గమనార్హం.

న్యూస్‌టుడే, కోటబొమ్మాళి


నిరసన తెలిపినా పట్టదు..

నరసన్నపేట ఇందిరానగర్‌ కాలనీ కూడలి వద్ద మద్యం బెల్టు షాపును తొలగించాలని ఈ ఏడాది జనవరి 13న స్థానికులంతా ఆందోళన చేశారు. ఈ  షాపు నిర్వాహకుడు ఓ వైకాపా కార్యకర్త కావడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణానికి కేవలం పది అడుగుల దూరంలోనే అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నా పట్టించుకోవట్లేదు. మహిళలు, పిల్లలు ప్రధాన రహదారి నుంచి కాలనీకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, నరసన్నపేట


నా భర్త ప్రాణం తీశాయి..
- చింతాడ జ్యోతి, పచౌరీ కాలనీ, నరసన్నపేట

నా భర్త చింతాడ రాజు మద్యానికి బానిసై.. ఆరోగ్యం దెబ్బతినడంతో రెండు వారాల కిందట చనిపోయారు. ఆయన స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేసేవారు. నరసన్నపేటలో ప్రతి సందులోనూ బెల్టు దుకాణాలు పెరిగిపోయాయి. అవే నా భర్త ప్రాణం తీశాయి. అవే లేకుంటే మా కుటుంబం సంతోషంగా ఉండేది. ఆయన చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో బతుకు ఎలా నెట్టుకురావాలో అర్థం కావట్లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని