logo

పాలన పూర్తి.. పనులు అసంపూర్తి..!

జిల్లా పరిపాలనకు కలెక్టర్‌ కార్యాలయం గుండె వంటిది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు గడిచినా నగరంలోని కలెక్టరేట్‌ భవనాల నిర్మాణం పూర్తికాలేదు. నిధులు సకాలంలో విడుదల చేయక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది.

Published : 01 May 2024 06:36 IST

ఏళ్లు గడిచినా అందుబాటులోకి రాని కలెక్టరేట్‌ భవనాలు
రూ.8 కోట్ల మేర బకాయిలు
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌ (శ్రీకాకుళం) 

జిల్లా పరిపాలనకు కలెక్టర్‌ కార్యాలయం గుండె వంటిది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు గడిచినా నగరంలోని కలెక్టరేట్‌ భవనాల నిర్మాణం పూర్తికాలేదు. నిధులు సకాలంలో విడుదల చేయక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు పనులు వేగవంతం చేయాలని గుత్తేదారుకి చెప్పడం వరకే పరిమితమయ్యారు. దీంతో వైకాపా ఐదేళ్ల పాలన పూర్తయినా.. నిర్మాణాలు మాత్రం అసంపూర్తిగా మిగిలిపోయాయని పలువురు పెదవి విరుస్తున్నారు.

నూతన కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణానికి 2016లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. 23 ఎకరాల విస్తీర్ణంలో రూ.116.5 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం అనుమతించింది. 2017లో పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. అప్పటి ఒప్పందం ప్రకారం 2019 ఫిబ్రవరి ఐదో తేదీ లోపు నిర్మాణం పూర్తి కావాలి. ఎన్నికలు రావడం, పాలకులు మారడం..సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. 2017 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు తెదేపా ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పనులు జోరుగా సాగాయి. ప్రస్తుత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయక పోవడంతో ఆశించిన మేర ముందుకు సాగడం లేదు.

కలెక్టర్‌ నూతన కార్యాలయం లోపల భాగంలో పూర్తికాని పనులు

మంత్రులు చూశారు..వెళ్లారు

వైకాపా పాలనలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్‌ కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఏడాదిన్నలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత కలెక్టర్లు, అధికారులు చూసినా ఫలితం లేకపోయింది. 2023 ఆగస్టులో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, సభాపతి తమ్మినేని సీతారాం తదితరులు పరిశీలించారు. దసరా నాటికి కలెక్టరేట్ను అప్పగించాలని గుత్తేదారుకు సూచించారు. అప్పటికి పూర్తిచేసి ఇవ్వలేమని గుత్తేదారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక శాఖ మంత్రి వచ్చి వెళ్లిన నెలన్నర వరకు నిధులు విడుదల కాలేదు. ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తి చేసి అప్పగించాలని గత కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించినప్పటికీ సాధ్యం కాలేదు. మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి.

ఇదీ పరిస్థితి

వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు పనులు చేయించుకుని రూపాయి విడుదల చేయలేదు. అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ నిర్మాణాలను పరిశీలించి పనులు చేయాలని ఆదేశించి వెళ్లిపోయారు. తరవాత వచ్చిన కమిషనర్‌ సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు. రెండేళ్లలో రూ.30 కోట్ల మేర పనులు చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత నిధులు విడుదల చేశారు. సకాలంలో సొమ్ము రాకపోవడంతో గుత్తేదారు నష్టపోయారు. ‘ప్రభుత్వం నుంచి రూ. ఎనిమిది కోట్లు మేర బిల్లులు రావాల్సి ఉంది. నిధులు విడుదల కాగానే పనులు మరింత వేగవంతం చేస్తాం. ఇంకా పది శాతం పనులు చేయాలి’ అని గుత్తేదారు తెలిపారు.

కలెక్టరేట్‌ నిర్మాణ అంచనా వ్యయం: రూ.116.5 కోట్లు
స్థలం: 23.95 ఎకరాలు
అంతస్తులు: 4
బ్లాకులు: 16
లిఫ్టులు: 5 
కొలువుతీరనున్న శాఖలు: 82
సమావేశ మందిరాలు: 8

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని