logo

ప్రశ్నించే గొంతులపై ‘రాక్షస క్రీడ’..!

జగన్‌ పాలనలో అన్యాయంపై నోరెత్తకూడదు. నిరసన ప్రదర్శించినా, సమస్యను పరిష్కరించమని  అడిగినా నేరమే. ప్రభుత్వ వ్యతిరేకతను తెలిపేందుకు ఆందోళన చేసినా వారిపై కేసులు పెట్టించారు.

Published : 04 May 2024 05:56 IST

ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు

జగన్‌ పాలనలో అన్యాయంపై నోరెత్తకూడదు. నిరసన ప్రదర్శించినా, సమస్యను పరిష్కరించమని  అడిగినా నేరమే. ప్రభుత్వ వ్యతిరేకతను తెలిపేందుకు ఆందోళన చేసినా వారిపై కేసులు పెట్టించారు. వైకాపా అయిదేళ్లలో ఆడిన రాక్షస క్రీడ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఇంటికి మేలు జరిగితేనే ఓటు వేయండని చెబుతున్న అధికార పార్టీ నేతలు ఎంతో మందిని వేధించుకు తిన్న సందర్భాలు కోకొల్లలు. ఆధిపత్యం, అజమాయిషీ కోసం  నియంతృత్వ పోకడను అన్నిస్థాయిల్లోనూ అమలు చేస్తూ వచ్చారు. జిల్లాలో వైకాపా నేతలకు తోడుగా, అండగా పోలీసులు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డారు.

న్యూస్‌టుడే, టెక్కలి, బృందం

  • 2023లో జులై 1న తెదేపా పలాస పట్టణ పార్టీ అధ్యక్షుడు బడ్డ నాగరాజు ఇంటి ముందు కాలువపై వంతెన తొలగించేందుకు అర్ధరాత్రి యంత్రాలు మోహరించి అధికారులు హడావుడి చేశారు. ఆయనపైన, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట మాజీ సర్పంచి గూళ్ల చిన్నారావుపై రౌడీషీట్లు తెరిచారు.  
  • టెక్కలి మండలం చాకిపల్లికి చెందిన తెదేపా నేతలపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో అచ్చెన్నాయుడు పోలీసు స్టేషన్‌ ఎదుట రాత్రంతా బైఠాయించారు. అయినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయడమే కాక వారిపై తర్వాత కూడా మరికొన్ని బనాయించారు.
  • పలాస తెదేపా కౌన్సిలర్‌ గురిడి సూర్యనారాయణ ఇంటిని  తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. సదరు నేతను పరామర్శించేందుకు వస్తున్న నారా లోకేశ్‌ను శ్రీకాకుళం వద్ద అడ్డుకుని పోలీసులు వెనక్కి పంపించారు.
  • పంచాయతీ ఎన్నికల వేళ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు స్వగ్రామం నిమ్మాడలో గొడవను సృష్టించి దానికి అచ్చెన్నాయుడిని బాధ్యుడిగా చేస్తూ  ఆయనపై హత్యాయత్నం కేసు బనాయించి.. అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించిన ఆడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఎన్నికల్లో లబ్ధికోసం తెదేపా నేతలపై ఏవిధంగా కేసులు బనాయించి వారిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారో ఆయనే వివరించారు.
  • సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న కూడలిలో ఆధ్యాత్మిక దృక్పథంతో శివుని రూపాన్ని నెలకొల్పాలని దిమ్మె నిర్మించారు. దానిపై వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుట్రపన్నారు. కమిటీ సభ్యులు ఆలయ పునర్నిర్మాణంలో తొలగించిన పాత నంది విగ్రహాన్ని ఆ సమయంలో దిమ్మపై ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్రస్థాయి అంశంగా భూతద్దంలో చూపి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా చేసి దేశద్రోహానికి పాల్పడిన కేసులు నమోదు చేశారు. సీసీ కెమెరాల్లో నందిని తరలించినవారు స్పష్టంగా కనిపిస్తున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో అచ్చెన్నాయుడితో సహా నియోజకవర్గంలోని 23 మందిపై కేసులు పెట్టారు.  
  • సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాలపై అవాస్తవ పోస్టింగ్‌ పెట్టారని ఐటీడీపీ టెక్కలి నియోజకవర్గ కన్వీనరు అప్పిని వెంకటేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.  
  • ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ తెదేపా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
  • సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మైలపల్లి సాయికుమార్‌ను ఆయన వివాహ నిశ్చితార్థం రోజున అదును చూసి అరెస్టు చేశారు. వైకాపాకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతున్నారని కక్షగట్టినట్లు మరీ దారుణానికి ఒడిగట్టారు.
  • పలాస నియోజకవర్గంలో వినోద్‌ అనే తెదేపా కార్యకర్తపై వైకాపా నేత రాకేష్‌రెడ్డి, ఆయన అనుచరులు ఇంట్లో చొరబడి దాడిచేయడమేకాక తిరిగి ఒడిశా మద్యం కలిగి ఉన్నాడని అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు.
  • వజ్రపుకొత్తూరు మండలం మాజీ ఎంపీపీ వసంతస్వామికి చెందిన పొక్లెయిన్‌, ఇతర వాహనాలను వైకాపా వారే అద్దె కోసం పిలిచి అక్రమంగా కంకర తరలిస్తున్నారని కేసులు పెట్టి వాహనాలు సీజ్‌ చేయించారు.
  • తెదేపా టెక్కలి మండల అధ్యక్షుడు బగాది  శేషగిరిరావుపై 16కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ పార్టీ కోటబొమ్మాళి మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌పై పది కేసులు పెట్టారు. గత ఎన్నికల్లో సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో హత్యాయత్నం పేరుతో ఇరికించారు.  
  • ఎమ్మెల్యే అశోక్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు
  • పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన కోన వెంకటరావు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టడంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి మానసికంగా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా అధికార పార్టీ నేతలు ప్రేరేపించారు. దీంతో ఆయన 2022 మార్చి 8న ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

యంత్రాంగానిదీ వారి పాటే..

అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల మాటే నెగ్గేలా జిల్లాలో ప్రత్యేక రాజ్యాంగం అమలు చేశారు. చిన్నపాటి వ్యవహారాల్లో పోలీసులు, ఉన్నతాధికారులను ఉసిగొల్పి పైశాచిక ఆనందాన్ని పొందారు. వారిపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చి అనుకున్నది అయ్యేవరకూ ఊరుకోలేదు. ఆయా అంశాల్లో న్యాయం ఎవరిదని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం యంత్రాంగం వంతుగా మారింది..

ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేలా..

ప్రతిపక్ష పార్టీ నాయకులు రాజకీయంగా, ఆర్థికంగా చితికిపోయేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా అధికార పార్టీ నేతలు అయిదేళ్లూ వ్యవహరించారు. సత్యదూరం, నిరాధారమైన కేసుల్ని బనాయించి తెదేపా ముఖ్యనేతలను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కొవిడ్‌ సమయంలోనూ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు.  పలాస, టెక్కలి, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ పనిచేసినా వారిపై కక్ష కట్టి వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నాలు చేశారు. వైకాపా అరాచకాలకు అనేకమంది బయటకొచ్చేందుకు భయపడే పరిస్థితులు కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కువగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని