logo

హామీని తుంగలో తొక్కేశారు..!

ఉద్దానంలో తెల్ల బంగారంగా పిలిచే జీడి పిక్కలకు మద్దతు ధర దక్కక రైతులు కుదేలవుతున్నారు. వారిని ఆదుకుంటామని నమ్మబలికిన వైకాపా ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ అయిదేళ్లు గడిపేసింది.  ధరలు క్రమేపీ దిగజారిపోతుండటం..

Published : 08 May 2024 05:21 IST

జీడి రైతుకు దక్కని భరోసా
నెరవేరని మంత్రి అప్పలరాజు హామీ
న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

ఉద్దానంలో తెల్ల బంగారంగా పిలిచే జీడి పిక్కలకు మద్దతు ధర దక్కక రైతులు కుదేలవుతున్నారు. వారిని ఆదుకుంటామని నమ్మబలికిన వైకాపా ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ అయిదేళ్లు గడిపేసింది.  ధరలు క్రమేపీ దిగజారిపోతుండటం..

విదేశీ పిక్కల దిగుమతులను నియంత్రించకపోవడంతో సాగు చేస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. గిట్టుబాటు కల్పిస్తామని మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చినా ఫలితం దక్కలేదు. పెట్టుబడి సైతం దక్కడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్దానంలో ఏడు మండలాలు, మెళియాపుట్టి, సంతబొమ్మాళి, పోలాకి తదితర మండలాల్లో జీడి సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట 80 కిలోల పిక్కల బస్తా రూ.13 వేలకుపైగా ధర పలికేది. గత సీజన్‌లో ఒక్కసారిగా రూ.ఎనిమిది వేలకు పడిపోయింది. ఇటీవల రూ.9,500 పలికినా రైతుల వద్ద పిక్కలు లేవు. మరోవైపు టాంజానియా, ఘనా తదితర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. ఇక్కడి జీడిపప్పునకు మంచి గిరాకీ ఉంది. పలాస-కాశీబుగ్గ పట్టణాల నుంచి ఎక్కువగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాలకు సరకు ఎగుమతి  అవుతోంది. కానీ మద్దతు ధర లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోలేదు.

వజ్రపుకొత్తూరు: ఓ ఇంట్లో నిల్వ ఉంచిన పిక్కల బస్తాలు

హామీతో సరిపెట్టిన మంత్రి

2021లో రాష్ట్ర మంత్రి అప్పలరాజు, అప్పటి కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠÈ్కర్‌ సమక్షంలో వ్యాపారులు, రైతు సంఘ నాయకులతో చర్చించారు. అప్పటికి పిక్కల బస్తా ధర రూ.ఎనిమిది వేలు పలుకుతుండటంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. కనీసం రూ.10 వేలకైనా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.తొమ్మిది వేలకు కొనుగోలు చేయాలని.. ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వాలంటీర్లతో రైతుల నుంచి పిక్కల వివరాలు సేకరించారు. ఇప్పటీకీ ఆ హామీ నెరవేరలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద రైతు సంఘ నాయకులకు హామీ ఇచ్చినా అమలులోకి రాకపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి. మంత్రి హామీకే పరిమితమయ్యారని విమర్శిస్తున్నారు.


మదుపులు పెట్టలేకపోతున్నాం

నాకు సుమారు రెండు ఎకరాల్లో జీడి తోట ఉంది.  ఎలుగుబంట్లతో ముప్పు పొంచి ఉన్నా సాగు చేస్తున్నాం. ప్రస్తుతం కనీస ధరలు పలకకపోవడంతో మదుపులు పెట్టలేకపోతున్నాం. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక వ్యాధులు మరింత దెబ్బతీస్తున్నాయి. పంట భూములు లేఅవుట్లుగా మారిపోతున్నాయి. జీడి పప్పునకు గిరాకీ ఉన్నా పిక్కలకు ధర లేకపోవడం బాధాకరం.

తెప్పల సింహాచలం, రైతు, పెదవంక


ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయాం..

నాకు సుమారు మూడు ఎకరాల్లో జీడి తోట ఉంది. కుటుంబ జీవనానికి పంటే ఆధారం. తిత్లీ తపాను తరువాత మదుపులు ఎక్కువ అవుతున్నాయి. పెట్టుబడులు రావడం లేదు. ఆదాయం బాగా పడిపోయింది. గతేడాది మద్దతు ధర చెల్లిస్తారని ఆశ పడ్డాం. అంతకుముందు అదనపు డబ్బులు జమ చేస్తామని మాటిచ్చి మర్చిపోయారు. విదేశీ పిక్కలు బూచితో ఇక్కడి పిక్కలకు ధరలు రాకుండా అడ్డుపడుతున్నారు. ప్రభుత్వం పిక్కలు కొనుగోలు చేయకపోగా విదేశీ పిక్కల దిగుమతులను ఆపలేకపోయింది. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయాం.

టి.నాగేష్‌, జీడి రైతు, బైపల్లి


ఆదుకుంటామని చెప్పి మోసం

నాకు సుమారు ఐదు ఎకరాల్లో జీడి తోట ఉండేది. మంచి ఆదాయం వచ్చేది. తిత్లీ తుపాను బాగా దెబ్బతీసింది. తోటలు పునరుద్ధరించడానికి భారీగా పెట్టబడి పెట్టా. అప్పులు తీర్చలేక కొంత తోట విక్రయించా. మార్కెట్‌ యార్డులు, రైతు భరోసా కేంద్రాలు ఉద్దానం రైతులకు ఉపయోగపడటం లేదు. ఐదేళ్లలో ఒక్క బస్తా పిక్కలు కొనుగోలు చేయలేదు. ఎన్నికల ముందు, తరువాత అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు.

కోనేరు ఆదినారాయణ, జీడి రైతు, తర్లాగడూరు


కాలయాపన చేశారు..

జీడి పిక్కలకు కనీస మద్దతు ధర రూ.16 వేలతో పాటు మరిన్ని డిమాండ్ల సాధనకు పోరాడుతున్నాం. మంత్రి అప్పలరాజుకు, ఉద్దానంలో అన్ని సచివాలయాల అధికారులకు ప్రజా సంఘాలు, జీడి సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ గడిపేశారు. 

గొర్లె చలపతిరావు, ఉద్దానం రైతాంగ సమస్యల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి, వజ్రపుకొత్తూరు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు