logo

రెట్టింపు సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యం

‘జగన్‌ అయిదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు సాగునీరివ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. ఉద్యోగులను భయాందోళనలకు గురి చేసి వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి అడుగడుగునా అవమానించారు.

Published : 08 May 2024 05:28 IST

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఏటా రెండు పంటలకు సాగునీరందిస్తాం
‘ఈనాడు’తో తెదేపా ఎంపీ అభ్యర్థి
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, గుజరాతీపేట

కింజరాపు రామ్మోహన్‌నాయుడు

‘జగన్‌ అయిదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు సాగునీరివ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. ఉద్యోగులను భయాందోళనలకు గురి చేసి వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి అడుగడుగునా అవమానించారు. మత్స్యకారులను ఆదుకోలేదు. జిల్లాలో ప్రధాన సమస్యలను గాలికొదిలేశారు. అసంపూర్తిగా ఉన్న వంతెనలు, రహదారుల నిర్మాణం చేపట్టలేదు. నాసిరకం మద్యం అమ్మకాలు చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి పేదల పక్షాన నిలిచే ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. సూపర్‌-6 పథకాలు ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి’ అని తెదేపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పునరుద్ఘాటించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.

మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు సాయం..

మత్స్యకారులకు బోట్లు, వలలు, పరికరాలు అందిస్తాం. ఏటా సముద్ర వేట విరామ సమయంలో రూ.20 వేలు అందజేసి ఆదుకుంటాం. శీతల గిడ్డంగులు నిర్మిస్తాం. కోస్టల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తాం. వలసలను నియంత్రించి స్థానికంగా అధునాతన పద్ధతుల్లో వేటకు సహకరిస్తాం. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాం.

సైనికులకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌..

జిల్లాలో మాజీ సైనికులు ఎక్కువగా ఉన్నారు. దేశంలో ఎక్కువ మంది సిక్కోలులోనే ఉండటం గమనార్హం. వీరి కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో తయారు చేశాం. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆయా కుటుంబాల సంక్షేమం చూసుకుంటాం. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఆదుకుంటాం. ఉద్యోగానంతరం స్థానికంగా ఉపాధి లభించేలా చేయూత అందిస్తాం.

పర్యాటకాభివృద్ధికి పెద్దపీట..

జిల్లాలో సువిశాల తీరం ఉంది. పెద్దసంఖ్యలో ఆకట్టుకునే బీచ్‌లు ఉన్నాయి. వీటి అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి పర్యాటకంగా తీర్చిదిద్దుతాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్‌ సర్క్యూట్‌ అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకొస్తాం. కొండ ప్రాంతాల్లో ప్రకృతి అందాలు తిలకించేలా వాటిని ప్రగతి బాట పట్టిస్తాం. కూటమి ప్రభుత్వం రాగానే నిలిచిపోయిన  పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం.

ఎంపీ ల్యాడ్స్‌ నిధులివ్వకుండా అడ్డుకున్నారు.. 

గత పదేళ్లలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా పాలకులు కొన్ని చోట్ల నేను ఇచ్చిన నిధులను సైతం ఉపయోగించకుండా అడ్డుపడ్డారు. ఎంపీకి పేరొస్తుందనే దుర్మార్గమైన యోచనతో ప్రగతికి కళ్లెం వేశారు.

నెలకు రూ.4 వేల పింఛను..

పింఛను విధానాన్ని తీసుకొచ్చిందే తెదేపా ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే సామాజిక భద్రత పింఛను నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తాం. పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్నవారికి  రూ.15 వేలు ఇస్తాం. కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛను అందిస్తాం. పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలాలు ఇస్తాం. ఇప్పటి వరకు పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం తరఫున ఇళ్లు నిర్మించి ఇస్తాం.

పెట్రో ధరలు నియంత్రిస్తాం..

వైకాపా పాలనలో నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరగడానికి జగన్‌ అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాలే కారణం. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ధరలను స్థిరీకరిస్తాం. ఏటా ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌర ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి వంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తాం. అప్పుడు వినియోగదారులపై ఛార్జీల భారం తగ్గుతుంది. ప్రతి ఇంటిపై సౌర పలకలు ఏర్పాటు చేస్తే బిల్లు నామమాత్రంగా వస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను నియంత్రిస్తాం. చెత్త పన్ను రద్దు చేస్తాం.

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం..

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేల పింఛను ఇస్తాం. బీసీ ఉప ప్రణాళిక ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. రూ.ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తాం. మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తాం. కాపు సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలిస్తాం.

ప్రతి మహిళకు నెలకు రూ.1,500..

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణ సాయం రూ.10 లక్షల వరకు పెంచుతాం. 19 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తాం. వారు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ చెల్లిస్తాం. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం పెంచుతాం. విద్యార్థినుల చదువుకు అవసరమైన రుణాలు ఇప్పిస్తాం.

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు..

భూ యాజమాన్య హక్కు చట్టంతో సామాన్యులు, రైతులు అన్యాయానికి గురవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. అన్నదాతలు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. రైతులకు రాయితీపై సోలార్‌ పంపుసెట్టు అందించి మిగులు విద్యుత్తును వారి నుంచి కొనుగోలు చేయిస్తాం. తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తాం. రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించి ఆర్థిక భారం తగ్గిస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. ఆక్వాలో అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్తు యూనిట్‌ రూ.1.50కే సరఫరా చేస్తాం.

ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌..

యువతలో నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి తగిన ఉపాధి కల్పిస్తాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు నిర్మాణంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. జిల్లాలో ప్రత్యేకంగా ఎంప్లాయిమెంట్‌ జోన్‌ ఏర్పాటు చేస్తాం. కొత్త పరిశ్రమలు రావడానికి అవసరమైన భూమి, రాయితీలు అందిస్తాం. జిల్లా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు ఎక్కువగా అందించాలనేది నా కల. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలా డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు యువతకు నెలకు రూ.మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెరిసేలా క్రీడాకారులకు తర్ఫీదు ఇస్తాం.

నదుల అనుసంధానం..

తెదేపా హయాంలో తలపెట్టిన నాగావళి- వంశధార అనుసంధాన పనులను వైకాపా ప్రభుత్వం నీరుగార్చింది. 5 శాతం పనులను సైతం పూర్తిచేయలేకపోయింది. వ్యవసాయ రంగాన్ని విస్మరించింది. వచ్చే మా ప్రభుత్వంలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులను అనుసంధానం చేసి ఏటా రెండు పంటలు పండించేలా సాగునీరందిస్తాం. అన్నదాత కష్టాలను తీర్చుతాం.

ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు..

కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు అందిస్తాం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడతాం. వారికి మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. తక్కువ జీతాలు పొందే పొరుగు సేవలు, ఒప్పంద, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూస్తాం. వాలంటీర్లకు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం అందిస్తాం.

రోడ్లు వేస్తాం.. వంతెనలు నిర్మిస్తాం..

వైకాపా పాలనలో జిల్లాలో రహదారులు, వంతెనల నిర్మాణాలను గాలికొదిలేశారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు విస్తరణ పూర్తి చేయలేకపోయారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టకుండా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. వాటితో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులతో పాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లన్నీ బాగు చేస్తాం. అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణాన్ని కొలిక్కి తీసుకొస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు