logo

ట్రబుల్‌ ఐటీ..!

అన్ని బ్యాచ్‌లను తీసుకొచ్చి పూర్తిస్థాయి మౌలిక వసతులతో స్థానికంగా తరగతులు నిర్వహిస్తామని ట్రిపుల్‌ ఐటీలో భవనాల ప్రారంభం సందర్భంగా 2020లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Updated : 09 May 2024 06:28 IST

అన్ని బ్యాచ్‌లకు తరగతులని చెప్పి మడమ తిప్పిన జగన్‌

అరకొర వసతులతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల: అన్ని బ్యాచ్‌లను తీసుకొచ్చి పూర్తిస్థాయి మౌలిక వసతులతో స్థానికంగా తరగతులు నిర్వహిస్తామని ట్రిపుల్‌ ఐటీలో భవనాల ప్రారంభం సందర్భంగా 2020లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఐదేళ్ల పాలనలో రెండు బ్యాచ్‌లనే నూజివీడు నుంచి తీసుకురాగలిగారు. మరో రెండు బ్యాచ్‌లకు సంబంధించి 2,200 మంది విద్యార్థులు అక్కడే విద్య అభ్యసిస్తున్నారు.

అమలులోకి రాని ప్రకటనలు

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేసిన 2016-17 విద్యా సంవత్సరంలో స్థానికంగా వసతులు లేక నూజివీడులో తరగతులు ప్రారంభించారు. రెండో ఏడాది ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురం పంచాయతీ పరిధిలో రాజీవ్‌ యువకిరణాలకు సంబంధించిన భవనాల్లో పీయూసీ-1 బ్యాచ్‌ను ప్రారంభించారు. ఆ తరువాత ఏడాది పీయూసీ-2 తరగతులను జిల్లాలోనే నిర్వహించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా నాలుగేళ్లలో ఆరు వేల మందికి సరిపడేలా వసతులు సమకూర్చి మిగిలిన నాలుగు బ్యాచ్‌లను ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో ట్రిపుల్‌ ఐటీని నిర్వహిస్తామని చేసిన ప్రకటన అమలులోకి రాలేదు.
2016-17 విద్యా సంవత్సరంలో ఇక్కడ చేరిన వారిలో రెండు బ్యాచ్‌ల విద్యార్థులు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో పీయూసీ-1, 2, ఇంజినీరింగ్‌-1, 2, నూజివీడులో ఇంజినీరింగ్‌-3, 4 బ్యాచ్‌లకు తరగతులు జరుగుతున్నాయి.

 నీటి ఎద్దడితో ఇబ్బందులు

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి స్థానికంగా నాలుగు బ్యాచ్‌ల్లో 4,400 మంది విద్యార్థులకు జిల్లాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పీయూసీ-1, 2 బ్యాచ్‌ల్లో బాలురకు చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. షేర్‌మహ్మద్‌పురం క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌-1, 2, పీయూసీ-1, 2 బ్యాచ్‌ల బాలికలకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎస్‌.ఎం.పురం క్యాంపస్‌లో 3,300 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి పూర్తిస్థాయిలో నీరు సరఫరా చేసే పరిస్థితి లేదు. గతేడాది వేసవిలో విద్యుత్తు అంతరాయంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. భూగర్భజలాలు అడుగంటడంతో రెండు బోర్లలో ఒకటి నిరుపయోగంగా మారింది. వేసవిలో ఉదయం, సాయంత్రం రెండేసి గంటలే నీరు సరఫరా చేస్తున్నారు. నిర్దేశించిన సమయంలో నీటి సరఫరాతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.        

పూర్తికాని పనులు

  • రూ. 66.7కోట్లతో న్యూ అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా నేటికి 50 శాతం కూడా పూర్తికాక అసంపూర్తిగా ఉండిపోయింది.
  •  ట్రిపుల్‌ ఐటీ తరగతులు ప్రారంభించి ఆరేళ్లు పూర్తవుతున్నా క్రీడల సాధనకు సరిపడ క్రీడా మైదానానికి నోచుకోలేదు. విద్యార్థులు అరకొర సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
  •  ప్రయోగశాలలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో విద్యార్థులను శ్రీ శివాని ఇంజినీరింగ్‌ కళాశాలకు తీసుకెళ్తున్నారు. ఇటీవల రూ.3.6 కోట్లతో ప్రయోగశాలలకు వర్క్‌ షెడ్‌ నిర్మించారు. అందులో రూ.4 కోట్ల విలువైన యంత్రాలు ఏర్పాటు చేశారు.

    ఒప్పంద సిబ్బందే ఎక్కువ

ట్రిపుల్‌ ఐటీలో సుమారు 150 మంది రెగ్యులర్‌ బోధనా సిబ్బంది ఉండాలి. ఇద్దరు ముగ్గురే రెగ్యులర్‌ బోధకులు ఉండగా మిగిలిన వారు ఒప్పంద, అతిథి అధ్యాపకులే. రెగ్యులర్‌ బోధకుల నియామకానికి ప్రకటన విడుదల చేసినా నియామకాలు జరగలేదు. గతంలో ఇంజినీరింగ్‌-1లో రెండో సెమిస్టర్‌ ఈసీఈ విద్యార్థులకు ఆబ్జెక్ట్‌ ఓరియంటేడ్‌ ప్రోగ్రామింగ్‌ పేపర్‌ మిడ్‌ ఎగ్జామ్‌ వాయిదా వేశారు. దీనికి కారణం సంబంధిత సబ్జెక్టు బోధకులు లేక సిలబస్‌ పూర్తకాక పోవడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు సబ్జెక్టులకు సంబంధిత అర్హత గల బోధకులు లేక సంబంధం లేని వారితో బోధిస్తున్నట్లు సమాచారం
వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నా ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది, ఇతర సౌకర్యాలు సమకూర్చలేదు. ఒక వైద్యాధికారిణి, కొందరు వైద్య సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని