logo

ఐఐటీఎంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం

‘రెనాల్ట్‌ నిస్సాన్‌ టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ సెంటర్‌ ఇండియా’ (ఆర్‌ఎన్‌టీబీసీఐ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం) ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ‘హ్యాక్‌ సిడెంట్్స’ పేరిట హ్యాకథాన్‌ జరిగిందని ఐఐటీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Published : 02 Jun 2023 00:59 IST

విజేతలకు ధ్రువపత్రం అందజేస్తున్న దృశ్యం

వడపళని, న్యూస్‌టుడే: ‘రెనాల్ట్‌ నిస్సాన్‌ టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ సెంటర్‌ ఇండియా’ (ఆర్‌ఎన్‌టీబీసీఐ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం) ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ‘హ్యాక్‌ సెడెంట్స్’ పేరిట హ్యాకథాన్‌ జరిగిందని ఐఐటీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నదే హ్యాకథాన్‌ ముఖ్య ఉద్దేశమని ఐఐటీ పేర్కొంది. కళాశాల విద్యార్థులు, వివిధ వృత్తుల్లో ఉన్న యువత, పలు రకాల నైపుణ్యాలపై ప్రవేశం ఉన్న వారు పాల్గొన్నట్లు తెలిపింది. ఐఐటీ సివిల్‌ ఇంజినీరింగులోని ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగు విభాగం, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ (సీఎఫ్‌ఐ), ఆర్‌ఎన్‌టీబీసీఐ సంస్థలు సీఎస్సార్‌ చొరవతో పని చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర రవాణా, హైవేస్‌ విభాగ డైరెక్టర్‌ గౌరవ్‌ గుప్తా మాట్లాడుతూ... రోడ్డు భద్రతకున్న ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. ఏడాదికి 1.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, నాలుగు లక్షల మందికిపైగా గాయపడుతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన తుది విడత కార్యక్రమం ఏప్రిల్‌ 22న ఐఐటీలో జరిగింది. ఎంపిక చేసిన ఎనిమిది జట్లు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వారు రూపొందించిన నమూనాలు ప్రదర్శించారు.  న్యాయనిర్ణేతలు హ్యాక్‌ సెడెంట్స్ విజేతల పేర్లను ప్రకటించారు. భిలాయికి చెందిన రున్‌గ్టా కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగు జట్టు ‘మెగామి’ మొదటి స్థానంలో, రెండో స్థానంలో ముల్లానాలోని మహర్షి మార్కండేశ్వర్‌ ఇంజినీరింగు కళాశాల జట్టు, ఐఐటీ మద్రాస్‌ జట్టు మూడో స్థానంలో నిలిచాయి. తుది దశకు చేరుకున్న జట్లను గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్ డీన్‌, ఆచార్యులు రఘునాథన్‌ రంగస్వామి ప్రశంసించారు. అవగాహన కోసం అన్ని రకాలుగా శ్రమించిన జట్టును చెన్నై ట్రాఫిక్‌ పోలీసు అడిషనల్‌ కమిషనర్‌ కపిల్‌ శరత్‌కర్‌ అభినందించారు.  సివిల్‌ ఇంజినీరింగు విభాగ ఆచార్యులు గీతాకృష్ణన్‌ రామదురై, ఆర్‌ఎన్‌టీబీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు హరద హిరోటకే తదితరులు ప్రసంగించారు. హిరోటకే, రాబర్ట్‌ బాస్చ్‌ కేంద్ర ఆచార్యులు బి.రవీంద్రన్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎంటీసీ బస్సును ప్రారభించారు.

పాల్గొన్న జట్లు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని