logo

పెట్టుబడులకు సంస్థల పోటీ

రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరగబోతోంది. వచ్చే ఏడాది జవనరిలో చెన్నై కేంద్రంగా నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 03 Jun 2023 06:28 IST

 జనవరిలో ప్రపంచ సదస్సు
 సీఎం విదేశీ పర్యటనతో లబ్ధి
 మరిన్ని దేశాలవైపు చూపు

రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరగబోతోంది. వచ్చే ఏడాది జవనరిలో చెన్నై కేంద్రంగా నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ తదితరుల బృందం విదేశీ పర్యటనతో వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు తెచ్చేందుకు విస్తృతస్థాయిలో చర్చించింది. ఇప్పుడు మరిన్ని దేశాల్ని ఆహ్వానించేందుకు సన్నద్ధమవుతోంది.  ఏడాది తర్వాత రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు కొత్తగా రావడం, ఇప్పుడున్నవి చాలావరకు విస్తరించడం వంటి పనులకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఈనాడు, చెన్నై

మిళనాడు పారిశ్రామిక సత్తా పెరుగుతూ పోతోంది. తాజాగా ఓ టీవీ ఛానెల్‌ కార్యక్రమంలో నీతిఆయోగ్‌ మాజీ సీˆఈవో అమితాబ్‌ కంత్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థను చేరేందుకు మరెంతో కాలం పట్టదని స్పష్టమైన సంకేతాలు పంపారు. కేవలం రెండు ఏళ్లలో ఈ రాష్ట్రాలు కలిసి ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థను అవలీలగా అధిగమించేలా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారతదేశం 5 ట్రిలియర్‌ డాలర్ల ఎకానమీ సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోందని చెబుతూనే.. అందులో తమిళనాడు పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్రంలోని తయారీ సామర్థ్యం, అవసరానికి తగ్గట్లు ఇక్కడ సిద్ధమవుతున్న నైపుణ్య కార్మికులు రాష్ట్రానికి అత్యంత బలమని వెల్లడించారు. పెట్టుబడులు తెచ్చే కీలకరంగాల్ని ఎంచుకుని వాటికి తగ్గట్లు మానవ వనరుల్ని సమకూర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా ఉందని వెల్లడించారు. దీంతో కంపెనీలకు నైపుణ్య కార్మికుల బాధే ఉండటం లేదని, ఇది గమనించాల్సిన విషయంగా పేర్కొన్నారు.

ఏర్పాట్లు మొదలయ్యాయి..

సింగపూర్‌లో సీఎం

వచ్చే ఏడాది జనవరి 10, 11వ తేదీల్లో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును పెద్దఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఏర్పాట్లకు సంబంధించిన టెండరు ప్రక్రియల్ని పూర్తిచేశారు. ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారనేది ఇంకా స్పష్టత రానప్పటికీ.. ఆహ్వానాల ప్రక్రియను ముఖ్యమంత్రి పర్యటనతో మొదలుపెట్టారు. భవిష్యత్తులో సీఎం, మంత్రులు మరిన్ని దేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పెట్టుబడుల సదస్సు కోసం భారీ ప్రచార వ్యూహాల్ని అమలు చేసేలా ముందుకెళ్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు.

అంచనాల కన్నా ఎక్కువ..

సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ 9 రోజుల పర్యటనను ముగించుకుని చెన్నై తిరిగొచ్చారు. రెండు దేశాల్లోనే ఏకంగా రూ.3,233కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరినట్లుగా వెల్లడించారు. ముందు అనుకున్న అంచనా ప్రకారం సుమారు రూ.3 వేల కోట్ల వరకు పెట్టుబడులు రావొచ్చని అనుకున్నారు. కానీ చర్చల అనంతరం మరిన్ని  పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు వివరించారు. తన పర్యటనలో ప్రముఖ సంస్థలకు చెందిన ఎంతోమంది ప్రతినిధుల్ని స్టాలిన్‌ కలిశారు. పలు సదస్సుల్ని నిర్వహించారు. తయారీ నేపథ్య పరిశ్రమలకు పెట్టుబడులు తెచ్చేలా ప్రధానంగా చర్చలు సాగాయి. ఆ తర్వాత.. నైపుణ్యాల బదలాయింపు, సాంకేతిక సాయం, ఎగుమతుల్లో తోడ్పాటు తదితర అంశాల్లో పలు సంస్థలు తమిళనాడుతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు ఫిన్‌టెక్‌, ప్రత్యామ్నాయేతర ఇంధనవనరులు, స్టార్టప్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి.

పరిశోధనలకు పెద్దపీట

జపాన్‌లోని ఓ పరిశ్రమను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి  

ఇప్పటికే పారిశ్రామికరంగంలో దేశంలోనే టాప్‌ రాష్ట్రాల సరసన తమిళనాడు ఉంది. ఈసారి ఆ స్థానాన్ని మరింత మెరుగుపరచుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకించి పారిశ్రామిక పరిశోధనలు, ఆవిష్కరణలు, ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే పెట్టుబడిదారుల సదస్సులో ఈ అంశాలపైనే ఎక్కువగా చర్చలు ఉండొచ్చని చెబుతున్నారు. ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ఎంత త్వరగా చేరాలనేదానిపై కూడా చర్చలు సాగనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర అంచనాల ప్రకారం తమిళనాడు 2030లో ఆ ఆర్థిక వ్యవస్థను సాధిస్తుందని నివేదికల్లో ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సంస్థల పరిధిని విస్తరించేలా, వారికి అవసరమైన వనరులు సమకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా సింగపూర్‌, జపాన్‌ పర్యటనల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పటికే జపాన్‌కు చెందిన పలు కీలక పరిశ్రమలు చెన్నై, కాంచీపురం, శ్రీపెరుంబుదూరు, ఒరగడం ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో తమ పరిశ్రమల్ని విస్తరించేలా పలురకాల చర్చలు జరిగాయి. ఇందులో భాగంగానే చెన్నై నుంచి టోక్యోకు నేరుగా విమానాలు నడపాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తాజాగా పౌర విమానయాన మంత్రికి లేఖ రాశారు. ఇప్పటికే జపాన్‌కు చెందిన 600కు పైగా సంస్థలు తమిళనాడులో ఉన్నాయి. మరోవైపు భారీ పెట్టుబడులు వచ్చేలా రాష్ట్రంలో మరిన్ని స్థలాల్ని సేకరించి సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రత్యేకించి విద్యుత్తు వాహనాల తయారీకి భారీగా పెట్టుబడులు తేవాలని చూస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం రూ.30 వేల కోట్లు వస్తాయనే అంచనాతో ఉన్నారు. మరోవైపు చెన్నై కేంద్రంగా మరిన్ని దేశాలతో అనుబంధంగా పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 7వ తేదీన యూఎస్‌ఏ అనుబంధ సంస్థలతో ప్రత్యేక చర్చలకు వేదికల్ని ఏర్పాటుచేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని