logo

కదిలొచ్చిన ఓటర్లు

ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.

Updated : 20 Apr 2024 00:47 IST

రాష్ట్రవ్యాప్తంగా 72.09 శాతం పోలింగ్‌ నమోదు
చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
పలుచోట్ల బహిష్కరించిన గ్రామాలు
కోయంబత్తూరులో ఓట్ల గల్లంతుపై భాజపా నిరసన

ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. పకడ్బందీ భద్రత నడుమ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సజావుగా పోలింగ్‌ సరళి కొనసాగింది.

ఈనాడు-చెన్నై: పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు ఉత్సాహంగా కదిలొచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో వారి చొరవ అధికారుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. చాలాచోట్ల ఓటర్లను అభినందించే కార్యక్రమాల్ని ఎన్నికల కమిషన్‌ నిర్వహించింది. ప్రత్యేకించి  కళ్లకుర్చి, ధర్మపురిల్లో బాగా ముందుకొచ్చారు. రాష్ట్రంలో ఎక్కడాలేనంతమంది ఇక్కడి పోలింగ్‌బూత్‌ల్లో పాల్గొని ఓటువేశారు. ఆయా కేంద్రాలు కళకళలాడాయి. ఈ స్థానానికి పోటీగా నామక్కల్‌, ఆరణి, తిరువణ్ణామలై, వేలూరు, అరక్కోణం, కరూరు, పెరంబలూరు, సేలం, చిదంబరం తదితర నియోజకవర్గాల్లో ఓటర్లు చాలా ముందుగానే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ ఏ పోలింగ్‌బూత్‌ చూసినా క్యూలైన్లు కనిపించాయి. కళ్లకురిచ్చి, దిండుక్కల్‌, నామక్కల్‌, కరూరు, సేలం, విళుపురం, ధర్మపురి, పెరంబలూరు, ఆరణి, తిరుప్పూరు, విరుదునగర్‌, ఈరోడ్‌, చిదంబరం, పొళ్లాచ్చి తదితర స్థానాల్లో తెల్లవారగానే క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో మందకొడిగా ఉండటంతో పాటు ఇతర నియోజకవర్గాలతో పోల్చితే ఓటు ఉత్సాహంలో వెనకబడ్డాయి. ప్రధానంగా మదురై, శ్రీపెరుంబుదూరుతో పాటు చెన్నైలోని 3 నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ సరళి ఆలస్యంగా నడిచింది. చెన్నైలోని నియోజకవర్గాలన్నీ పోలింగ్‌ శాతాల్లో రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి పోలింగ్‌ కేంద్రాలు పెద్దగా ఓటర్లు లేక వెలవెలబోయాయనే చెప్పాలి. సాయంత్రం 6గంటల తర్వాత క్యూలైన్లు ఉంటే టోకెన్లు ఇస్తారు. తిరునెల్వేలిలోని కొన్ని కేంద్రాల్లో క్యూలు లేకపోవడంతో టోకెన్ల ప్రస్తావనే రాలేదు.2019 పార్లమెంటు ఎన్నికల్లో 72.47శాతం పోలింగ్‌ నమోదైంది.


ఈవీఎంలు తారుమారు..

రెండు, అంతకంటే ఎక్కువ ఈవీఎంలు వాడుతున్నచోట్ల ఒకటోస్థానంలో ఉండాల్సిన ఈవీఎం రెండోచోట, మూడోచోటనో, రెండోస్థానంలో ఉండాల్సింది ఒకటోచోట, మూడోచూటో.. ఇలా మార్చి ఉంచారని ఎన్నికల అధికారులపై పలుచోట్ల ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా శివగంగై పార్లమెంటు స్థానంలో ఈవీఎంల వరస తప్పిందని ఎంపీ కార్తి పి.చిదంబరం ఆరోపించారు. ఫిర్యాదుచేసిన తర్వాత అధికారులు మార్చారని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల సాంకేతిక కారణాలతో పోలింగ్‌ ఆలస్యమైంది. నీలగిరిలో ముందురోజు రాత్రి వర్షం కురియడంతో పలుచోట్ల యంత్రాల్లో సమస్యలు తలెత్తాయి. పొళ్లాచ్చి, వాల్పరైలోనూ ఇదే తరహా సమస్య తలెత్తింది. తిరునెల్వేలి పార్లమెంటులో 3 పోలింగ్‌బూత్‌ల్లో గంట ఆలస్యమైంది. నాగపట్టిణం, తిరుచ్చి, చిదంబరం స్థానాల్లోని పలుచోట్ల ఈ తరహా ఇబ్బందులు ఎదురయ్యాయి.

కోవైలో ఉద్రిక్తత

ఓట్లు తొలగించారంటూ కోయంబత్తూరు, మయిలాడుదురైలోని పలు కేంద్రాల్లో నిరసనలు జరిగాయి. కోయంబత్తూరు లోక్‌సభలో ఏకంగా లక్ష ఓట్లు గల్లంతయ్యాయని భాజపా తీవ్రంగా ఆరోపణలు చేసింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె.అన్నామలై వ్యాఖ్యలు చేశారు. ఇదే సెగ్మెంటులోని గౌండన్‌పాళయం పోలింగ్‌కేంద్రంలో 830 ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కి డిమాండ్‌ చేశారు. పలుచోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో భద్రత పెంచారు.

తీవ్ర ఎండలతో ముగ్గురి మృతి

వేసవిలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఇబ్బందులు తప్పవని ఓటర్లు భావించారు. చాలా నియోజకవర్గాల్లో వేడి తట్టుకోలేక విలవిల్లాడిపోయారు. సేలం జిల్లాలో ఇద్దరు ఓటర్లు మృత్యువాతపడటం విషాదానికి గురిచేసింది. ఇదే సమస్య కోయంబత్తూరులోని పలు కేంద్రాల్లో ఎదురైంది. ఎన్నికల సంఘానికి భాజపా నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ జిల్లాలో కళ్లకురిచ్చి లోక్‌సభ పరిధికి వచ్చే సెంతరపట్టిలో చిన్నపొన్ను(77) ఓటు వినియోగించిన కొన్ని నిమిషాలకు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధాÄరించారు. సేలం లోక్‌సభ పరిధిలోని శూరమంగళంలో ఎన్‌.పళనిసామి (69) పోలింగ్‌బూత్‌లోకి వచ్చాక కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన కూడా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో ఓటువేసేందుకు వచ్చిన కనకరాజ్‌(72) మృతిచెందారు.

హిందీపై రచ్చ

చెన్నైలోని ఆదంబాక్కం పోలింగ్‌స్టేషన్‌లో వివాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన భార్యాభర్తల పేర్లు ఓటరు జాబితాలో హిందీలో ఉండటంతో ఓటు వేసేందుకు అక్కడి ఏజెంట్లు నిరాకరించారు. ఇంటినుంచి ఓటరుకార్డులు తేకపోవడంతో వారు అనర్హులని చెప్పడంతో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు చూశారు. అందులోనూ పేర్లు హిందీలో ఉండటంతో పైఅధికారులతో మాట్లాడారు. ఓటుకు వారు అర్హులేనని తేలడంతో లోనికి అనుమతించారు.

డిమాండ్లు తీర్చలేదని బహిష్కరణ

  • రాష్ట్రంలోని పలు పార్లమెంటు స్థానాల్లో అక్కడక్కడా పోలింగ్‌ బహిష్కరించిన దాఖలాలు కనిపించాయి. ఆ పరిధిలోని పోలింగ్‌కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోయాయి. మదురై జిల్లా అక్కిమంగళం పంచాయతీ పరిధిలోని సత్తయాడి కాలనీలో తెలుగువారిగా ఉన్న శోలింగ గిరిజనులు పోలింగ్‌ను బహిష్కరించారు. సుమారు 150మంది శుక్రవారం ధర్నాకు కూర్చున్నారు. తమ ప్రాంతాల్లో రోడ్ల వసతులు సరిగా లేవని, కుల ధృవీకరణపత్రాలూ ఇవ్వడంలేదని అసహనం వ్యక్తంచేశారు. పారిశుద్ధ్యచర్యలు ఏమాత్రం బాగోలేవని చెప్పారు.
  • తమ డిమాండ్లను పార్టీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ కడలూరు పార్లమెంటు పరిధిలోని 4 గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఆయా గ్రామాల్లో సుమారు 7వేల ఓటర్లున్నారు. తాగునీరు, రోడ్లు, రవాణా వసతులు లేక ఇబ్బందులుపడుతున్నట్లు వారు వెల్లడించారు.
  • చెన్నై శివారులోని ఎన్నూర్‌ పరిధి ప్రజలు పోలింగ్‌ బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ఉదయం ప్రకటించి వీధుల్లో నిరసనకు దిగారు. అమోనియా గ్యాస్‌ లీకేజీ, ఇతర పర్యావరణ సమస్యలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం, డిమాండ్లను నేతలు పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత వీరంతా చర్చించుకుని నిరసన వదిలి పోలింగ్‌కు వెళ్తున్నట్లు మధ్యాహ్నం ప్రకటించారు. సుమారు 1,250మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • కృష్ణగిరి పరిధిలోని కడవరహళ్లిలో గ్రామస్తులు ఓటేయడానికి వెళ్లలేదు. ఒక్క ఓటుకూడా ఉదయం పోలవలేదు. రోడ్డు, బస్సు సర్వీసుల లేమితో అసహనం వ్యక్తంచేశారు. విరుదునగర్‌లోని 6 గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు.
  • ధర్మపురి పార్లమెంటులోని జ్యోతిహళ్లి గ్రామంలో 1,427మంది ఓటర్లు ఓటు వేయలేదు. బెంగళూరు-సేలం రైల్వేమార్గం మీదుగా ఉండే తమ గ్రామంలో రైల్వేబ్రిడ్జి నిర్మించలేకపోవడం చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. ఫలితంగా వాహనాల్లో 10కి.మీ దూరాన వెళ్లి రోడ్డుకు చేరాల్సి వస్తోందని ఆవేదనతో చెప్పారు. సేలం జిల్లా చెంగలుతుప్పాడి గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయలేదని ఓటు వేయలేదు.
  • చెన్నై రెండో విమానాశ్రయం ప్రతిపాదించిన పరందూరు పరిధిలోని ఏకనాపురం ఓటు వేసేందుకు ఎవ్వరూ వెళ్లలేదు. తూత్తుకుడి లోక్‌సభ పరిధిలోని పొట్టలురాణి గ్రామస్థులు తమకు చేపల ప్రాసెసింగ్‌ తెస్తామన్న హామీ నెరవేర్చలేదని ఓటు వేయలేదు. నిరసనకు దిగిన ఓటర్లపై పోలీసులు దాడి చేయడంతో వివాదం తలెత్తింది. పుదుక్కోట్టైలోని వెంగైవాయల్‌లో గ్రామస్థులు నల్లమాస్కులు ధరించి నిరసనకు దిగారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులో మానవవ్యర్థాలు కలిపిన ఘటనపై ఈ గ్రామం అసహనంగా ఉంది.

సెల్‌ఫోన్లతో తలనొప్పి

చెన్నై నగరంలో చాలామంది ఓటర్లు తమ సెల్‌ఫోన్లతో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లడంతో అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చాలాచోట్ల ఓటర్లను నిలువరించడంతో ఇతరులకు ఇచ్చి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. పోలింగ్‌ కేంద్రాలలోపల ఫొటోలు తీసేందుకూ ఓటర్లను అడ్డుకున్నారు. ఫోన్లతో వచ్చినవారు పోలీసులకు తమ ఫోన్లను అప్పగించి ఓటు హక్కును వినియోగించాల్సి వచ్చింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని