logo

కాంగ్రెస్‌ నాయకుడి అనుమానాస్పద మృతి

కాంగ్రెస్‌ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్‌ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్‌ ధనసింగ్‌(60) స్థానిక దిసయన్‌విలైలో నివాసం ఉంటున్నారు.

Published : 05 May 2024 00:16 IST

సగం కాలిన స్థితిలో మృతదేహం లభ్యం

జయకుమార్‌ (పాతచిత్రం)

తిరునెల్వేలి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్‌ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్‌ ధనసింగ్‌(60) స్థానిక దిసయన్‌విలైలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటికెళ్లిన ఆయన తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోవడంతో కుమారుడు కరుత్తయ్య జఫ్రిన్‌ శుక్రవారం పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు దర్యాప్తు చేపట్టగా శనివారం కరైసుత్తుపుదూర్‌ సమీపంలోని జయకుమార్‌కు సొంతమైన పొలంలో సగం కాలిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్‌ 30న తనకు ప్రాణహాని ఉందని ఆయన తిరునెల్వేలి డీఎప్పీకి లేఖ రాసినట్లు తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అందులో పేర్కొన్నారు.  వారి వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిపారు. అనుమానంతో కొందరి పేర్లను అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రూబి మనోహరన్‌, పార్టీ సీనియర్‌ నేత కేవీ తంగబాలు పేర్లు కూడా అందులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరునెల్వేలి ఎస్పీ సిలంబరసన్‌ పేర్కొన్నారు.

నేతల సంతాపం...

జయకుమార్‌ కుటుంబీకులు చాలాకాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై ప్రకనటనలో తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జయకుమార్‌ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తిరునావుక్కరసర్‌ పేర్కొన్నారు. త్వరితగతిన నిందితులను అరెస్టు చేయాలన్నారు.

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదుకే దిక్కులేదు: అన్నామలై

సైదాపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌ ఫిర్యాదుకే డీఎంకే ప్రభుత్వంలో దిక్కులేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. కనిపించకుండా పోయిన జయకుమార్‌ మృతదేహంగా లభించటం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. అన్నామలై విడుదల చేసిన ప్రకటనలో.. ఏప్రిల్‌ 30న జిల్లా ఎస్పీ వద్ద ప్రాణానికి హాని ఉందని జయకుమార్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిసిందన్నారు. అందులో నాంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మనోహరన్‌, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు తంగబాలు పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారని, పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలియటం లేదన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదుకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దర్యాప్తు చేసి మృతికి కారణాలు కనుగొనాలని అన్నామలై డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని