logo

అన్నదాతా సుఖీభవ..!

కొవిడ్‌ మూడో దశ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ఆసుపత్రులకు వచ్చిన రోగులు, వారి సహాయకులు ఆహారపరంగా ఎలాంటిఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో హరేకృష్ణ

Published : 24 Jan 2022 02:17 IST

మూడోదశలో ఆహారం పంపిణీ చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌

 - న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

బారులు తీరి.. ప్యాకెట్లు తీసుకుంటూ..

కొవిడ్‌ మూడో దశ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ఆసుపత్రులకు వచ్చిన రోగులు, వారి సహాయకులు ఆహారపరంగా ఎలాంటిఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో హరేకృష్ణ మూవ్‌మెంట్‌కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ మరోసారి ముందుకు వచ్చింది. ఆహారం అందించి ఆదుకుంటోంది. కరోనా మొదటి, రెండో దశల్లోనూ వీరు విస్తృతంగా ఆహారం అందించారు. ప్రస్తుత మూడో దశలో కూడా రోజుకు 6 వేల మందికి ఆహారం సరఫరా చేస్తున్నారు.

ఆహార ప్యాకెట్లు సిద్ధం చేస్తున్న సిబ్బంది

 రోగి సహాయకులకు... ఆరోగ్య కార్యకర్తలకు...

* అక్షయపాత్ర ఫౌండేషన్‌ కొవిడ్‌ మొదటి దశలో 5,67,345 భోజన ప్యాకెట్లు, రెండో దశలో 7,41,986 మందికి భోజన ప్యాకెట్లు ఉచితంగా సరఫరా చేసింది. ఇప్పుడు కూడా నగరంలోని ప్రధాన ఆసుపత్రుల వద్దకు వెళ్లి ప్రతీరోజూ మధ్యాహ్నం భోజన ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది.
* ప్రస్తుతం ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి, ప్రభుత్వ గొంతు, చెవి, ముక్కు ఆసుపత్రి, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి, ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి, భీమిలి, ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గాయత్రీ విద్యాపరిషత్‌ వైద్యశాల, ఎన్‌.ఆర్‌.ఐ. వైద్యశాల తదితర ఆసుపత్రులకు వచ్చిన రోగులకు, రోగి సహాయకులకు నిత్యం మధ్యాహ్న భోజన ప్యాకెట్లను అందజేస్తున్నారు. కేవలం రోగులు, రోగి సహాయకులే కాకుండా ఆయా ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, రక్షణ సిబ్బందికి కూడా ఆహారాన్ని అందిస్తున్నారు.
* కొవిడ్‌ సమయంలో సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు కూడా ఆహారం అందిస్తున్నారు. పాత పోస్టాఫీసు, కోటవీధి, రెల్లివీధి, కురుపంమార్కెట్‌, రెల్లివీధి, సింహాచలం, తాటిచెట్లపాలెం, ఎన్‌.ఎ.డి. కొత్తరోడ్డు కూడలి, గాజువాక వంటి ప్రాంతాల్లో టమాటా రైస్‌/బిర్యానీ/పులిహోర తదితర వాటితో పాటు బిస్కెట్లు ప్యాకెట్లు అందిస్తున్నారు.  
* కంచరపాలెం, గంభీరంలోని అక్షయపాత్ర వంటశాల నుంచి తయారుచేసిన ఆహారాన్ని భోజన ప్యాకెట్ల రూపంలో తయారుచేసి సంస్థ వాహనాల ద్వారా నగరంలోని 25 కేంద్రాల్లోని 6 వేల భోజన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. కష్టకాలంలో కడుపు నింపుతున్న ఈ సంస్థ సేవలను పలువురు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని