logo

ఇంటర్మీడియట్‌ చదివినా... ఓటు హక్కు?!

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ముసాయిదా ఓటరు జాబితాలపై ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి.

Published : 07 Dec 2022 03:05 IST

పట్టభద్రుల ఓటరు జాబితాపై యంత్రాంగం విచారణ

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ముసాయిదా ఓటరు జాబితాలపై ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో అర్హత లేకున్నా ఓటర్ల పేర్లు నమోదు చేశారని, విశాఖ జిల్లాలో పేర్ల నమోదులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆరోపించింది. 2,600 మందికిపైగా అనర్హుల పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చారని అధికారులకు ఫిర్యాదు చేశారు.

తా ము సేకరించిన సమాచారం ప్రకారం పోలింగ్‌ కేంద్రాల సంఖ్యల ప్రకారం ఫిర్యాదు చేశారు. వీరితో పాటు మరికొందరు జాబితాలో తప్పిదాలపై వివరించారు. పోలింగ్‌ కేంద్రం 204లో డిప్లమో హోల్డర్లు, 5వ తరగతి పాసైన వారికి ఓటు హక్కు కల్పించారన్న ఆరోపణలు వచ్చాయి. పోలింగ్‌ కేం‌్రద్రాలు 292, 247, 248, 227, 256 తదితరాల్లోనూ పలు తప్పిదాలు జరిగాయని చెబుతున్నారు. వీటిపై యంత్రాంగం ఆరా తీస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో ప్రధాన రాజకీయ పక్షాలు కీలకంగా తీసుకున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆరంభం నాటికే వైకాపా, తెదేపా తమ అభ్యర్థులను ప్రకటించాయి. వామపక్ష పార్టీల మద్దతుతో వారి అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు స్వతంత్రంగా పలువురు పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాధవ్‌ భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం ఉన్నా అధికారకంగా ఆ పార్టీ ప్రకటించలేదు. దీంతో అర్హులైనపట్టభద్రులను ఓటర్లగా చేర్చేందుకు పలువురు పోటీ పడ్డారు. ఆన్‌లైన్‌లోనూ భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం ఆరు జిల్లాలున్నాయి. 2,67,728 దరఖాస్తులు పేర్లు నమోదుకు వచ్చాయి. వీటిలో ఆన్‌లైన్‌ ద్వారా 1,77,153, ఆఫ్‌లైన్‌ ద్వారా 90,575 వచ్చాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు అనర్హులుగా గుర్తించిన 23,825 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. వీటిపై ఈ నెల 9లోపు అభ్యంతరాలతో పాటు వ్యక్తిగత దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. 30న తుది జాబితా ప్రకటిస్తారు. ఇప్పటి వరకు అభ్యంతరాలు పెద్దగా రాలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తాము గుర్తించిన అంశాలతో ఫిర్యాదు చేసింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేసిన సమయంలో పలు తప్పిదాలకు అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా అప్‌లోడ్‌ చేయలేదు. కొంతమంది ఫొటోలు జత చేయలేదు. దీంతో జాబితాల్లో కొందరి ఫొటోలు లేకుండానే ముద్రణ జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో విద్యార్హత ద్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. అన్నీ సరిగా ఉన్నాయనుకుంటే ఆమోదించారు. ఆన్‌లైన్‌లో ఫొటో జత చేయకుంటే వారి ఫొటోలను ఇళ్లకు వెళ్లి సేకరించి మళ్లీ నమోదు చేసే ఐచ్ఛికం అందుబాటులో లేదని చెబుతున్నారు.

ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సునిశిత పరిశీలన చేపట్టారు. క్షేత్ర స్థాయిలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పోలింగ్‌ కేంద్రాల వారీ వచ్చిన అభ్యంతరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అభ్యంతరం వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ముసాయిదా జాబిలో ఏమైనా డూప్లికేట్‌ పేర్లు ఉన్నా తొలగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని