logo

ఎన్టీఆర్‌ జీవితచరిత్రను పాఠ్యాంశం చేస్తాం

నేటితరం విద్యార్థులకు తెలిసే విధంగా యుగపురుషుడు, దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడతామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Updated : 26 May 2023 14:05 IST

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

మాట్లాడుతున్న అయ్యన్న, వేదికపై అనిత, పీలా, భరత్‌, చలపతిరావు, బుద్ధ, రామారావు తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: నేటితరం విద్యార్థులకు తెలిసే విధంగా యుగపురుషుడు, దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడతామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి జిల్లాస్థాయి ఉత్సవాలు గురువారం అనకాపల్లిలో నిర్వహించారు. ఇందులో అయ్యన్న మాట్లాడుతూ రాబోయేది తెదేపా ప్రభుత్వమేనని, ప్రభుత్వం వచ్చిన వెంటనే పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చేర్చుతామని చెప్పారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే, మంత్రి అయిన ఘనత తనకు ఉందని... దీనికి కారణం ఎన్‌టీ రామారావేనని ఆయనతో కలిసి పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గతంలో కేంద్రమంత్రి, ముఖ్యమంత్రిని సైతం అరెస్టు చేసిన విషయం గుర్తు చేశారు. కానీ ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయనీయకుండా సీబీఐను అడ్డుకుంటోంది ఎవరో మోదీ, అమిత్‌షాలు సమాధానం చెప్పాలన్నారు. అవినాష్‌రెడ్డి అరెస్టు యత్నాలను వైకాపా రౌడీలతో అడ్డుకోవడం, వారికి పోలీసులు సహకరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చెయ్యనియ్యకుండా పోలీసు అధికారులు చేసిన ప్రయత్నంతో రాష్ట్ర పోలీసుల పరువు పోయిందన్నారు. ఇందుకు కారకులైన ఎస్పీ, డీజీపీలను తక్షణం సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన తనపై 14 కేసులు పెట్టారని, అందులో రేప్‌ కేసు కూడా ఉందన్నారు. తన పాస్‌పోర్టును నిలుపుదల చేశారని చెప్పారు. తెదేపా మహానాడుకు ఆర్‌టీసీ బస్సులు ఇవ్వడం లేదన్నారు. వైకాపా నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా పది లక్షలకు తక్కువ లేకుండా జనం వస్తారని పేర్కొన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వి.అనిత మాట్లాడుతూ కార్యకర్తలను నేతలుగా చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ మునసబుగా ఉన్న తనను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ను చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీలు వేపాడ[ చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ నేతలు శ్రీభరత్‌, పి.వి.జి.కుమార్‌, బత్తుల తాతయ్యబాబు, ప్రగడ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, బొలిశెట్టి శ్రీనివాసరావు, డాక్టరు నారాయణరావు, మాదంశెట్టి నీలిబాబు, సబ్బవరపు గణేష్‌, కాయల మురళి, మళ్ల సురేంద్ర, జోగినాయుడు, కొణతాల రత్నకుమారి పాల్గొన్నారు.

పాల్గొన్న కార్యకర్తలు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని