12వేల ఇళ్లలో... 10కిపైగా ఓట్లు

ఓటరు జాబితాల్లో దొర్లిన తప్పిదాలను సరి చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. డూప్లికేట్‌, ఒకే డోర్‌ నెంబరులో 5కు మించి ఓట్లు ఉండడం, వలసలు వెళ్లిన వారి పేర్లు కొనసాగడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Updated : 22 Jun 2023 05:04 IST

జాబితాలో తప్పిదాలెన్నో
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

ఓటరు జాబితాల్లో దొర్లిన తప్పిదాలను సరి చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. డూప్లికేట్‌, ఒకే డోర్‌ నెంబరులో 5కు మించి ఓట్లు ఉండడం, వలసలు వెళ్లిన వారి పేర్లు కొనసాగడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో గత నెల 31న తుది ఓటరు జాబితాలను వెలువరించారు.  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18,79,671 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా జాబితాల్లో భారీగా తప్పిదాలు దొర్లాయని, అర్హతలున్నప్పటికీ అనేక మంది పేర్లు తొలగించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలో 10,959 ఓట్లను తొలగించారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సవివరంగా విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితాల స్వచ్ఛీకరణ చేపట్టాలని ఇటీవల సీఈఓ ఆదేశించారు. ఆ మేరకు పరిశీలన చేయగా 12వేల ఇళ్లలో పది మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు సమాచారం అందింది. ఆయా వివరాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీ రావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే ఆయా ఇళ్లను ఎన్నికల సిబ్బంది సందర్శించి అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు.

అందుకే ఇలా..

గత ఏడాది నుంచి పోలింగ్‌ కేంద్రాల అధికారులు (బీఎల్‌ఓ)గా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 1945 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకు ఓటరు జాబితాల సవరణ, డోర్‌ నెంబర్లు లేని ఇళ్లకు తాత్కాలిక డోరు నెంబర్ల కేటాయింపు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేదు.  ఫలితంగా ఒకే డోర్‌ నెంబరులో వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు ఈపీఆర్‌ (ఎలక్ట్రోరల్‌, పాపులేషన్‌ రేషియో)ను దృష్టిలో ఉంచుకొని పరిశీలన సాగాలి. ఏటా ఓటర్ల సంఖ్య ఒక శాతం మేర పెరుగుతుందని ఈసీ అంచనా. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎక్కువ ఓట్లు ఉంటే అక్కడ గంపగుత్తగా తొలగించారు. దీంతో కొన్ని చోట్ల అర్హుల ఓట్లు జాబితాల నుంచి తొలగిపోయాయి.

* 2022 వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానికంగా ఉండే సిబ్బంది బీఎల్‌ఓలుగా ఉండేవారు. వారికి స్థానిక ఓటర్లపై అవగాహన ఉండేది. ప్రస్తుతం బీఎల్‌ఓలుగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ఒక చోట నివాసం, మరో చోట ఉద్యోగం చేస్తున్నారు. దీంతో వీరికి స్థానికంగా ఉండే ఓటర్లపై పెద్దగా అవగాహన ఉండడం లేదు.

జులై 21 నుంచి ఇంటింటికెళ్లి పరిశీలన..

సీఈఓ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఓటరు జాబితాల తయారీ కోసం వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో జిల్లాలోని బీఎల్‌ఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా జులై 21వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లనున్నారు. ప్రతి బీఎల్‌ఓకు సంబంధిత పోలింగ్‌ కేంద్ర పరిధిలో ఉండే ఓటర్ల వివరాలతో కూడిన బుక్‌లెట్లను అధికారులు అందజేస్తున్నారు. వాటితో ఇళ్లకు వెళ్లి ఓటర్ల వివరాలపై ఆరా తీస్తారు. అనర్హులు, చనిపోయిన ఓటర్లు, మరో చిరునామాకు వెళ్లిన వారు ఉంటే ఆయా పేర్లు తొలగిస్తారు. ఇదే సమయంలో ఎవరికైనా అర్హత ఉండి ఓటు లేకుంటే ఫారం-6 (ఓటరు నమోదు) దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తారు. పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అక్టోబరు 1న ముసాయిదా ఓటరు జాబితాలు వెలువరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు