logo

భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుంది!

‘భారత ఉప ఖండంలో  అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్‌ తప్పనిసరిగా ఫేవరేట్‌ జట్టే. ఈ సారి ప్రపంచ కప్పు గెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Published : 29 Aug 2023 05:59 IST

మన క్రికెటర్లకు ఫిట్‌నెస్సే ప్రధాన సవాలు
‘ఈనాడు’తో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ
ఈనాడు, విశాఖపట్నం

మాట్లాడుతున్న రోజర్‌బిన్నీ.. పక్కన మదన్‌లాల్‌

‘భారత ఉప ఖండంలో  అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్‌ తప్పనిసరిగా ఫేవరేట్‌ జట్టే. ఈ సారి ప్రపంచ కప్పు గెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి భారతీయుడి ఆశ అదే’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ అన్నారు.  త్వరలో ప్రారంభమయ్యే పోటీలకు ఇప్పటికే భారత్‌ జట్టు సిద్ధంగా ఉందన్నారు. పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ మైదానంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) 70 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈనాడు-ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రత్యేక తోడ్పాటు: భారత క్రికెట్‌ జట్టు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ఫిట్‌నెస్‌. దాన్ని అధిగమించేలా క్రీడాకారులను సమాయత్తం చేస్తున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  బీసీసీఐ కూడా క్రికెటర్లకు ప్రత్యేక తోడ్పాటు అందిస్తోంది. టీ20, వన్డే, టెస్టు మ్యాచ్‌కు తగిన విధంగా క్రికెటర్లు ఫిట్‌నెస్‌ సాధించాలి. వారు ఏ ఫార్మేట్‌కు సరిపోతారో చూసుకోవాలి.

83 ప్రపంచ కప్‌ తీపిగుర్తు...

1983లో ప్రపంచకప్‌ సాధించడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. మదన్‌లాల్‌తో పాటు ఇతర జట్టు సభ్యులు చూపిన పోరాట పటిమతో దాన్ని సాధించాం. ముఖ్యంగా కపిల్‌దేవ్‌ వల్లే కప్‌ కొట్టగలిగాం. బాల్యం నుంచి కపిల్‌ తెలుసు. ఆ వరల్డ్‌కప్‌లో కపిల్‌ 175 స్కోర్‌ కొట్టకపోతే ముందుకువెళ్లే వాళ్లం కాదు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలడు. అందుకు 83 విజయమే నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో టీ¨20, వన్డేల్లో ప్రతి ఫార్మేట్‌కూ ప్రాధాన్యం ఉంది. టీ20 మ్యాచ్‌లు ప్రేక్షకులను అధిక సంఖ్యలో మైదానాలకు రప్పిస్తున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఐపీఎల్‌, ఏపీఎల్‌ వంటి మ్యాచ్‌లు భారత జట్టులో స్థానం సాధించేందుకు క్రికెటర్లకు ఒక మెట్టుగా నిలుస్తున్నాయి.

విశాఖలో స్నేహితులు

నేను 1975లో విశాఖలో రంజీ మ్యాచ్‌ ఆడేందుకు వచ్చా. అప్పుడు ఆంధ్రా జట్టుతో తలపడ్డాం. రైల్వేగ్రౌండ్‌లో మ్యాచ్‌ జరిగింది. మంచి మిత్రులు కొందరు ఇక్కడున్నారు. మౌలికవసతుల పరంగా చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి. క్రికెట్‌ మైదానాలు, క్రికెట్‌ పిచ్‌లు పెరిగాయి. అలాగే  ఉత్తమ క్రికెటర్లు ఏపీ నుంచి వచ్చారు. గతంలో కన్నా ఇప్పుడు క్రికెట్లో అనేక రకాలుగా అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం అనేక ఫార్మేట్లు వచ్చాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పోటీలు నిర్వహించుకుంటున్నారు. ఐపీఎల్‌, ఏపీఎల్‌ వంటివి జోరుగా కొనసాగుతున్నాయి.

మహిళా క్రికెటర్లకు  ప్రాధాన్యం

భారత క్రికెట్‌లో మహిళలు ఎంతగానో రాణిస్తున్నారు. వచ్చిన అవకాశాలను చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మెరికల్లాంటి క్రికెటర్లను తయారు చేయడంలో ఆయా రాష్ట్రాల్లో అకాడమీలతో పాటు ఎన్‌సీఏ వంటి అకాడమీలు ఉన్నాయి. అలాగే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎంపికలు నిర్వహించి నైపుణ్యాలు పెంచేలా చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు