logo

మాటలకెన్నో అర్థాలు.. నోటినిండా అబద్ధాలు

నా బీసీలంటూ.. తరచూ వల్లించే జగన్‌ వారిని కోలుకోని దెబ్బ తీశారు. ‘బీసీలంటే వెన్నెముక వర్గాలని’ చెప్పి.. అయిదేళ్లలో వారిని మరింత వెనక్కి నెట్టేశారు. జిల్లా జనాభాలో 50 శాతానికి పైగా వెనకబడిన వర్గాల ప్రజలే ఉన్నారు.

Updated : 01 May 2024 04:45 IST

నాబీసీలంటూ.. నట్టేట ముంచిన జగన్‌
వైకాపా హయాంలో వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

మాట..
వైకాపా అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతుల్లో ఆర్థిక విప్లవం తీసుకొస్తాం. బడ్జెట్లో మూడొంతుల నిధులు బీసీల సంక్షేమానికి ఖర్చు చేస్తాం. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం లేదు. అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తాం.  

- 2019 ఫిబ్రవరి 17న ప్రతిపక్షనేతగా జగన్‌ చెప్పిన మాటలివి.


మోసం..

గత ఎన్నికల్లో బీసీˆల ఓట్లతో గెలిచిన జగన్‌ వారిని అన్ని విధాలుగా మోసం చేశారు. పదవుల నుంచి పథకాల వరకు అన్నింటా అన్యాయం జరిగిందని ఆయా వర్గాల ప్రజలు వాపోతున్నారు. ఎన్నో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క పైసా కూడా కేటాయించలేదు.

నా బీసీలంటూ.. తరచూ వల్లించే జగన్‌ వారిని కోలుకోని దెబ్బ తీశారు. ‘బీసీలంటే వెన్నెముక వర్గాలని’ చెప్పి.. అయిదేళ్లలో వారిని మరింత వెనక్కి నెట్టేశారు. జిల్లా జనాభాలో 50 శాతానికి పైగా వెనకబడిన వర్గాల ప్రజలే ఉన్నారు. ఉచిత ఇసుక రద్దు, అన్న క్యాంటీన్లను ఎత్తేయడం వల్ల ఎక్కువగా బీసీ వర్గాలే నష్టపోయాయి. కులవృత్తులకు సహకారం అందించకపోగా తెదేపా హయాంలో అమలు చేసిన 34 రకాల పథకాలను రద్దు చేశారు. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న జగన్‌ ఆ హామీని అటకెక్కించారు. 90 శాతం పనులు ఆయన అనుచరులకే దక్కాయి.

1. కొందరికే నవరత్నాలు: వైకాపా హయాంలో స్వయం ఉపాధి కల్పన ద్వారా శాశ్వతంగా పేదరికాన్ని దూరం చేసే చర్యలు చేపట్టలేదు. అన్ని పథకాల్లోని బీసీలకిచ్చే వాటాను పక్కకు తీసి జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం పథకాల ద్వారా పెద్దమొత్తంలో సాయం అందిస్తున్నట్లు గారడీ చేశారు. వీటితో పాటు అందరికీ అందించే పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, వడ్డీ రాయితీ, చేయూత పథకాలనూ బీసీల ఖాతాల్లోనే వేస్తున్నారు. నవరత్నాల్లో కొందరికి తొలి విడత బాగానే అందించినా తర్వాత నిబంధనల కొర్రీతో చాలా మందిని అనర్హులుగా మార్చారు. ఎన్నికలు రావడంతో ఆయా వర్గాల ప్రజలు ‘ఓటు’తో వైకాపాకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు.


2 . స్వయం ఉపాధి దూరం: చంద్రబాబు హయాంలో బీసీలకు స్వయం ఉపాధి కల్పనకు రూ.లక్ష మొదలు రూ.25 లక్షల వరకు 50 శాతం రాయితీతో రుణాలు అందించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కులాలు, ఉపకులాల వారీగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. వీటికి ఛైర్మన్లు, డైరెక్టర్లుగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలను నియమించుకున్నారు. నాయకులకు ఉపాధి చూపిన జగన్‌ నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు. అయిదేళ్లలో ఏ ఒక్క కార్పొరేషన్‌ ద్వారా కూడా స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వలేదు. దీంతో యువత ఉద్యోగాల కోసం వలస బాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా బడ్జెట్‌ నుంచి బీసీ ఉపప్రణాళిక కింద కేటాయించిన నిధులను వారి అభివృద్ధికి వినియోగించలేదు. అందరికీ వర్తించే పథకాలకు మళ్లించారు. బీసీల కులగణన చేస్తామని మ్యానిఫెస్టోలో మాటిచ్చిన జగన్‌.. నాలుగేళ్లు దాని సంగతే మరచిపోయారు. ఎన్నికల ముందు ప్రచారాస్త్రంగా వినియోగించుకోవాలనుకున్నారు. జిల్లావ్యాప్తంగా జనవరిలో కులగణన ప్రారంభించారు. కానీ ఇప్పటికీ సర్వే వివరాలు బయటపెట్టలేదు.


3. కులవృత్తులకు ‘ఆదరణ’ కరవు..: తెదేపా హయాంలో బీసీల కులవృత్తులను ప్రోత్సహించేందుకు ‘ఆదరణ’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 17 రకాల చేతివృత్తుల వారికి 215 రకాల ఆధునిక పనిముట్లు అందజేశారు. జిల్లాలో 41,629 మందికి రూ.75.17 కోట్ల విలువైన పరికరాలు అందజేశారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల విలువైన పరికరాలకు 90 శాతం రాయితీ కల్పించారు. వైకాపా హయాంలో ఈ పథకాన్ని కొనసాగించి ఉంటే దాదాపు జిల్లాలోని కులవృత్తుదారులందరికీ చేయూత లభించేది. తెదేపా ఇలా ప్రత్యేక పథకాన్ని అమలు చేయడంతోపాటు.. ఇతర పథకాలనూ అమలు చేసింది. జగన్‌ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపివేశారు. దీంతో దర్జీలు, రజకులు, పాల వ్యాపారులు, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, మత్స్యకారులు, భవననిర్మాణ కార్మికులు, కల్లుగీత కార్మికులు, చేనేత, కమ్మరి, కుమ్మరి, శిల్పి, మేదర, బ్రాస్‌ స్మిత్‌, ఎర్త్‌ వర్క్‌, స్వర్ణకారులకు ఆసరా అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని