logo

జగన్‌.. ఏంటీ కనికట్టు!!

వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలను శాటిలైట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో  పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఆ కాలనీల్లో నిర్మించిన ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి.

Published : 10 May 2024 04:29 IST

గొప్పగా హామీలు... ఏవీ ఇళ్లు?!
పునాదులు కొట్టుకుపోతున్నాయి
నాసిరకంగా పనులు
సొంతగూడు సమకూర్చని ప్రభుత్వంపై జనం కన్నెర్ర

ఈనాడు, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలను శాటిలైట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో  పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఆ కాలనీల్లో నిర్మించిన ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. గోడలు బీటలు వారి, పునాదులు కుంగి, పైకప్పులు దెబ్బతిని...ఇవేం నిర్మాణాలు అనే సందేహాలు రేపుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే పునాదులు కొట్టుకుపోయాయి. అక్కడక్కడ కొన్ని ఇళ్లకు నీలం రంగు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఆ ఇళ్లూ నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో ఎవరూ వాటిలో నివసించే ధైర్యం  చేయడం లేదు. చాలా వరకు ఇళ్లు అసంపూర్తిగానే ఉండిపోయాయి. మొండి గోడలు, పునాదుల స్థాయిలోనే దర్శనమిస్తున్నాయి.  తెదేపా ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లలో ఇళ్లు నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఇటీవల గాజువాక సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించేశామని చెప్పుకొచ్చారు. వాటిలో అధ్వాన నిర్మాణాల గురించి సీఎంకు తెలియదా అని జనం మండిపడుతున్నారు.
కొన్నాళ్లైనా ఉంటాయా..: జిల్లాలో ఒక సెంటు స్థలాల్లో  నిర్మిస్తున్న గృహాలు తీసికట్టుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మొండి గోడలు, అసంపూర్తి నిర్మాణాలే. వర్షాలకు కొట్టుకుపోయిన పునాదులు, విరిగిన ఇటుకలే కనిపిస్తున్నాయి. తడులు సక్రమంగా అందక నిర్మాణాలు పొడిబారాయి. దీంతో ఆ నిర్మాణాలన్నీ మూణ్నాళ్లముచ్చటగానే ఉన్నాయి. విశాఖలో ఆప్షన్‌-3 కింద గుత్తేదారులతో ఇళ్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా చూస్తే పూర్తయిన నిర్మాణాలు చాలా తక్కువ. పునాదుల దశలోనే వేల నిర్మాణాలు ఉండగా మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభించ లేదు. వందల సంఖ్యలోని నిర్మాణాలు మొండిగోడలకు పరిమితమయ్యాయి. తంగుడుబిల్లి, పైడివాడఅగ్రహారంలో లేఅవుట్లు అధ్వానంగా మారాయి. ఇక్కడ ఇళ్లు నిర్మించకపోవడంతో అడవులను తలపిస్తున్నాయి. పునాదుల్లోనే దట్టమైన పొదలు పెరిగాయి.  

పైడివాడఅగ్రహారం కాలనీలో నిర్మాణాల దుస్థితి

  • లేఅవుట్లలోని ఇళ్ల నిర్మాణాలు చాలా నాసిరకంగా ఉన్నాయి. వైకాపా నేతలకు చెందిన గుత్తేదారులే ఈ పనులు దక్కించుకోవడంతో డబ్బులు మిగుల్చుకోవాలని చూశారే తప్ప పనుల నాణ్యతను పట్టించుకోలేదు. గోడలు, పునాదులకు ఉపయోగించిన సిమెంటు ఇటుకలు చాలాచోట్ల పగుళ్లుదేరాయి. ఆనందపురం మండలం తంగుడుబిల్లి, గిడిజాల, సబ్బవరం మండలం పైడివాడఅగ్రహారం, ఇతర కాలనీల్లోని ఇళ్లకు అమర్చిన ద్వారాలు, కిటికీలు అధ్వానంగా ఉన్నాయి. వాటిని అమర్చడం కోసం కొన్ని చోట్ల గోడలు కొట్టి అలానే వదిలేశారు.
  • ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లన్నీ కొండ వాలు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ కురిసిన వర్షాలకు పునాదులు కొట్టుకుపోయాయి. వరదకు పునాదులు పైకి లేచి తేలుతున్నాయి. పైడివాడ అగ్రహారం, తంగుడుబిల్లి, సబ్బవరం, రామవరం, గండిగుండం చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఈ కాలనీల్లో వరద ప్రవాహం కోసం తవ్వుతున్న కాలువలను సక్రమంగా నిర్మించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు