logo

యూరియా.. ఏదయా!

ప్రభుత్వం ఈ ఏడాది వరిసాగు వద్దనడంతో మొక్కజొన్న ఎక్కువగా వేశారు. అక్కడక్కడా వరి కూడా ఉంది. ఈ పంటలకు అవసరమైన యూరియా కోసం ‘రైతు భరోసా’ కేంద్రాల వద్ద కర్షకులు నిరీక్షిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నల్లబజారులో అధిక

Published : 27 Jan 2022 05:50 IST

రైతు భరోసా కేంద్రాల్లో  దొరకని ఎరువు


గుర్ల మండలం పాలవలస ఆర్బీకే వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు

న్యూస్‌టుడే-గరివిడి, గుర్ల, విజయనగరం వ్యవసాయ విభాగం: ప్రభుత్వం ఈ ఏడాది వరిసాగు వద్దనడంతో మొక్కజొన్న ఎక్కువగా వేశారు. అక్కడక్కడా వరి కూడా ఉంది. ఈ పంటలకు అవసరమైన యూరియా కోసం ‘రైతు భరోసా’ కేంద్రాల వద్ద కర్షకులు నిరీక్షిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నల్లబజారులో అధిక ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 
రైతు భరోసా కేంద్రాల ద్వారా బస్తా యూరియాను రూ.266.50 అందించాలి. ప్రస్తుతం లేకపోవడంతో రైతు తమ భూమికి సంబంధించిన 1బీ పత్రం తెచ్చుకుంటే ఎకరా అయినా పది ఎకరాలున్నా ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. దాని కోసం ఆర్బీకేల వద్ద క్యూలు కడుతున్నారు. రాజకీయ పలుకుబడి, నేతల సిఫార్సులున్న ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో వ్యాపారులు బస్తాను రూ.350 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారు. 

బస్తా ఎరువు రూ.400  
వరి వేశాను. ఆర్బీకేకు వెళ్లినా యూరియా దొరకలేదు. బయట మార్కెట్లో బస్తా ఎరువు రూ.400 పెట్టి కొన్నా. ఎమ్మార్పీ కంటే రూ.134 అధికంగా ఇవ్వాల్సి వచ్చింది.  - దాసరి బంగారునాయుడు, రైతు, ఊటపల్లి, మెరకముడిదాం మండలం
అదనంగా తీసుకున్నారు
మొక్కజొన్న వేశా. యూరియా కోసం రైతు భరోసా కేంద్రానికి వెళ్తే 1బీ పత్రంలో ఎంత భూమి ఉన్నా ఒక బస్తా ఇస్తామన్నారు. ఎమ్మార్పీ రూ.266.50 ఉంటే రూ.300 తీసుకున్నారు. అదనంగా ఎందుకని అడిగితే రవాణా, కూలీల ఖర్చన్నారు. 
- ఎన్‌.రామ్మోహన్, వెదుళ్లవలస, గరివిడి మండలం
ఈ నెలాఖరుకు రానుంది
మొక్కజొన్న విస్తారంగా వేసిన చీపురుపల్లి, సాలూరు తదితర ప్రాంతాల్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంది. ఈ నెలలో 4 వేల టన్నులు రావాల్సి ఉన్నా సంక్రాంతి నేపథ్యంలో పూర్తిగా చేరుకోలేదు. ఈ నెలాఖరుకు 3 వేల టన్నుల ఎరువు రానుంది. దీంతో రైతుల అవసరాలు పూర్తిగా తీరుతాయి. -వి.టి.రామారావు, జేడీఏ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని