logo

బాబోయ్‌.. ఇవేం రహదారులు!

అధ్వాన రహదారులతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరుస వర్షాలతో రోడ్డుపై గోతుల్లో నీరు చేసి ప్రయాణం సాహసంగా మారుతోంది. గొయ్యిలు, గతుకులమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Published : 29 Jul 2023 04:00 IST

న్యూస్‌టుడే, తెర్లాం, బొండపల్లి, గజపతినగరం, రాజాం, బొబ్బిలి గ్రామీణం, రామభద్రపురం

అధ్వాన రహదారులతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరుస వర్షాలతో రోడ్డుపై గోతుల్లో నీరు చేసి ప్రయాణం సాహసంగా మారుతోంది. గొయ్యిలు, గతుకులమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టించుకునే వారు కరవైపోయారని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి, గజపతినగరం, రాజాం నియోజకవర్గాల్లో  ఎక్కడికక్కడ గోతుల్లో నీరుచేరి, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.


తెర్లాం మండలం పాములవలస గ్రామం దాటిన తర్వాత సుందరాడ, ఉద్దవోలు వరకు ప్రధాన రహదారిపై గోతులు ఏర్పడి, ఎక్కడికక్కడే అధ్వానంగా దర్శనం ఇస్తున్నాయి. ఏ మాత్రం వర్షం కురిసినా గోతుల్లో నీరు చేరుతోందని.. గుంత ఎక్కడుందో తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు. మరోపక్క ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఉన్న ఈ రహదారుల్లో మలుపులు ఉండటం, అక్కడ తుప్పలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని.. వాటిని తొలగించాలని కోరుతున్నారు. రోడ్డు బాగుకు ప్రతిపాదనలు పంపించామని ఆర్‌అండ్‌బీ ఏఈ రాజు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


నిత్యం వేలమంది రాకపోకలు సాగించే రాజాం పట్టణంలోని ఆర్టీసీ కూడలి  ప్రాంగణం గోతులమయంగా మారింది. వర్షాలకు నీరు చేరుతోంది. ప్రయాణికులు బస్సుల కోసం పరుగులు తీస్తున్న క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనం ఎక్కేందుకు, దిగేందుకు వీలు కాని పరిస్థితి. ఆర్టీసీ క్లాంప్లెక్సు నిర్మాణానికి ఇటీవల నిధులు విడుదలయ్యాయి. పనులకు సంబంధించి  మంత్రుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా జరిగింది. వర్షాల వల్లే కాంప్లెక్సు నిర్మాణ పనులు ప్రారంభించలేదని పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.  గోతులు పూడ్చే బాధ్యత మున్సిపల్‌ అధికారులదేనని చెప్పారు.


బొండపల్లి మండలంలో దేవుపల్లి బజారు కేంద్రం రహదారి వానపడితే.. చెరువును తలపిస్తోంది. అధికారులు స్పందించి, తక్షణం రహదారులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్‌ శాఖ ప్రాజెక్టు ఏఈ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా.. త్వరలోనే మరమ్మతులు చేపడతామని తెలిపారు.


గజపతినగరం నుంచి పురిటిపెంట మీదుగా ఆండ్రకి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడైంది. ముచ్చర్ల గ్రామం నుంచి కెంగువకు వెళ్లే రహదారి చినుకు పడితే బురదమయంగా మారుతోంది. రహదారి మరమ్మతులు చేసేందుకు చర్యలు కానరావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని మండల ఇంజినీరింగు అధికారి అప్పలనాయుడు తెలిపారు.


అడుగడుగునా గొయ్యి

మెట్టవలస రహదారి

బొబ్బిలి మండలంలోని మెట్టవలసకు వెళ్లే రహదారి పాడైపోయి గోతులు ఏర్పడ్డాయి. వాటిలో వర్షం నీరు చేరడంతో వాహనాలు నడపడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేస్తామని ఏఈ రుగ్మాందనాయుడు ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

* రామభద్రపురం మండలంలోని ఎనుబొరువు గ్రామంలో రోడ్డు మధ్యలో గోతులు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు బాగుకు అధికారులు రూ.5 కోట్లు మంజూరు చేశారు. గుత్తేదారులు సగంలో పనులు నిలిపివేశారు. వర్షాలకు రోడ్డు ఇంకా పాడైంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఏఈ నాయుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు