logo

బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ

జగన్‌ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు.

Published : 25 Apr 2024 04:59 IST

కోలగట్లకు ప్రతి పనికీ కప్పం కట్టాల్సిందే
వారిని ఓడిస్తేనే జిల్లాలో  అభివృద్ధి సాధ్యం
సింగవరం, విజయనగరం సభల్లో చంద్రబాబు, పవన్‌

ర్యాలీలో చంద్రబాబు, పవన్‌  అభివాదం

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌/మయూరి కూడలి, పట్టణం, గ్రామీణం, కంటోన్మెంట్‌, రింగ్‌రోడ్డు, అయ్యన్నపేట, డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ: జగన్‌ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. బుధవారం డెంకాడ మండలం సింగవరం, విజయనగరంలో జరిగిన ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ‘నీతి, నిజాయతీకి మారుపేరైన అశోక్‌గజపతిరాజును ఇబ్బందులకు గురిచేశారు. సింహాచలం ట్రస్టుబోర్డును నాశనం చేశారు. అశోక్‌ను వేధించిన వ్యక్తిని విడిచి పెట్టేదే లేదు. పూసపాటి రాజవంశీయులు సేవాభావం గల వ్యక్తులు. అలాంటి వారిని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అని పేర్కొన్నారు.


అభివృద్ధి చేస్తాం..

నెల్లిమర్ల ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారుస్తాం. మూతపడిన జూట్‌ మిల్లును తెరిపిస్తాం. సీతమ్మ చెరువును అభివృద్ధి చేస్తాం. సూపర్‌-6లో భాగంగా సంక్షేమం అందిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాం. తెదేపా హయాంలో ఎక్కడా దేవాలయాలపై దాడులు జరగలేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌పై ఎవరైనా మాట్లాడితే పోలీసులు గోడలు దూకి వచ్చి మరీ అరెస్టు చేస్తారు. అదే దేవాలయాలపై దాడులు చేస్తే ఏమీ చేయలేకపోయారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో నటిస్తే విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ముందుకొచ్చారు’ అని పేర్కొన్నారు.

జనంతో కిక్కిరిసిన విజయనగరంలో కలెక్టరేట్‌ కూడలి


జెట్టీ సమస్యను పరిష్కరిస్తాం..

చింతపల్లిలో మత్స్యకారులకు జెట్టీ సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరిస్తాం. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూటమి పోరాటం ఆగదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొస్తాం. అధికారంలోకి వస్తే తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేలా బాధ్యత తీసుకుంటా. తూర్పుకాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని కాపులనూ ఓబీసీలో చేర్చుతాం. సాగునీరు సముద్రంలోకి వృథాగా పోకుండా కందివలస గెడ్డతో పాటు చంపావతి, గోస్తనీ నదుల్లో నాలుగు నుంచి ఎనిమిది చెక్‌డ్యాంలను నిర్మిస్తాం’ అని పవన్‌ హామీ ఇచ్చారు.


మొత్తం దోచేశారు..

‘ఉత్తరాంధ్రను బొత్స కుటుంబం దోచేసింది. వారికే ఎమ్మెల్యే, ఎంపీ  టిక్కెట్లు ఇచ్చారు. వారు దోచుకోగా మిగిలింది ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కాజేస్తాడు. ఓ అపార్ట్‌మెంటు కట్టాలన్నా, లేఅవుట్‌ వేయాలన్నా ఆయనకు కప్పం కట్టాలి. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆ నియోజకవర్గంలోని కొండలన్నింటినీ మింగేశాడు. తంగుడుబిల్లిలో పది ఎకరాల కొండను తవ్వేశాడు’ అని ధ్వజమెత్తారు. వారిని ఓడించాలన్నారు.


నేను, పవన్‌ భయపడం

బాబు, పవన్‌ చిరునవ్వులు

నేను, పవన్‌ భయపడమని, వైకాపాను భూస్థాపితం చేసే వరకూ పోరాడుతామన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ ప్రజాకోర్టులో శిక్షిస్తామన్నారు. ఓటుతో ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, లోకం మాధవిని గెలిపించాలని పిలుపునిచ్చారు.


అశోక్‌ హుషారు..

విజయనగరంలో అశోక్‌, అదితి, కలిశెట్టి చిద్విలాసం

విజయనగరం సభలో ముందుగా అదితి గజపతిరాజు, కలిశెట్టి అప్పలనాయుడు, పాలవలస యశస్విని, భాజపా నాయకుడు ఇమంది సుధీర్‌ చేరుకొని ప్రసంగించారు.  చేతులు పైకెత్తి నృత్యం చేయడంతో ప్రజల్లో ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఇదే సమయంలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోకగజపతిరాజు వారితో జత కలిసి ప్రచార పాటలకు నృత్యం చేయడంతో ఉత్సాహం పొంగిపొర్లింది. రాత్రి 8.50 గంటల సమయానికి సభా ప్రాంగణం వద్దకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. ఆ సమయంలో జనాలు ముందుకు రావడంతో పోలీసులు వారిని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.


దశ.. దిశ మార్చుతాం..

ప్రజలకు నమస్కరిస్తున్న అధినేతలు, మాధవి, కలిశెట్టి

‘విజయనగరం వలసకు మారుపేరుగా మారింది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మాకేం కాదు. కానీ యువత, రైతులు, మహిళలకు నష్టం కలుగుతుంది. కళ్ల ముందు తప్పు జరుగుతున్నపుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ వలసలు ఆగాలి. అందుకే పొత్తు ప్రకటించా. మూతపడిన జూట్‌ మిల్లును తెరిపించేలా చేస్తా. నెల్లిమర్ల నియోజకవర్గ దశ.. దిశను మార్చుతాం.’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.


దోపిడీ ఆగలేదు..

కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి జగన్‌ పాలన చేస్తున్నాడని పవన్‌ మండిపడ్డారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. చిన్న అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. దొరికిన వాటిని దొరికినట్లు దోచేశాడు. నది ఏదైనా ఇసుక దోపిడీ ఆగలేదు. భూగర్భ జలాల్లో ఉండే ఫ్లోరైడ్‌ వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ప్రతి మండలానికీ ఒక ఆసుపత్రి రావాలి. నియోజకవర్గంలోని పరిశ్రమల వల్ల కాలుష్యం ఎక్కువైంది. నియంత్రణ కోసం కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేస్తాం’ అని పవన్‌ వెల్లడించారు.


తగ్గిన గాలి..: నేరవార్తా విభాగం: కలెక్టరేట్‌ కూడలిలో జరిగిన సభకు వస్తున్న క్రమంలో చంద్రబాబు ప్రయాణించే కారు వెనుక చక్రంలో గాలి తగ్గడాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే సిబ్బందికి చూపించగా, పంక్చర్‌ అయ్యుంటుందని భావించి మరమ్మతులు చేశారు. ఆసమయంలో అక్కడికి ఎవరినీ రానీయలేదు.


కూటమికి రుణపడి ఉంటా..
- కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ అభ్యర్థి

నేను ఓ సామాన్య కార్యకర్తను. రైతు బిడ్డను. నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. కూటమి నాయకత్వానికి రుణపడి ఉంటా. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఈ సభలను చూస్తుంటే విజయం ఖాయమైంది. చంద్రబాబుకు, పవన్‌కు నా పాదాభివందనాలు.కూటమి నాయకత్వానికి మహిళా శక్తి తోడుగా ఉంది. ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణ కనిపిస్తోంది.


నెల్లిమర్ల పులకించింది..
- లోకం నాగ మాధవి, నెల్లిమర్ల నియోజకవర్గ అభ్యర్థిని

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రాకతో నెల్లిమర్ల పులకించింది.వరుణుడు కరుణించాడు. చిరుజల్లులు కురిపించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో రెండొందలకు పైగా పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. అన్ని మండలాల్లో తాగునీరు, సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటా.


ఓటు చీలకూడదు..
- కర్రోతు బంగార్రాజు, తెదేపా నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెదేపా, జనసేన అధినేతలు ఓటు చీలిపోకూడదని ఎన్నో త్యాగాలు చేసి కూటమిని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే నెల్లిమర్ల నియోజకవర్గం టికెట్ ఆశించిన నేను, రాష్ట్ర ప్రయోజనాల కోసం టికెట్న్‌ు త్యాగం చేశా. అందులో తప్పేమైనా ఉందా. మనమంతా ఐకమత్యంతో పనిచేసి లోకం నాగ మాధవిని గెలిపించాలి.


చంద్రబాబుతోనే మార్పు సాధ్యం..
- అదితి గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిని

రాష్ట్రంలో అభివృద్ధి లేదు. చంద్రబాబుతోనే మార్పు సాధ్యం. అవినీతి ఆరోపణలు లేని అశోక్‌ గజపతిరాజు ఆశీస్సులతో బరిలోకి దిగుతున్నా. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం. ప్రతి  ఒక్కరూ కూటమికి మద్దతుగా నిలవాలి.


గద్దెదించాల్సిన తరుణమిదే..
- రెడ్డి పావని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భాజపా

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ఈ ఐదేళ్లలో ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. గద్దె దించాల్సిన సమయం వచ్చింది. ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.


ఇంటికి పంపించాలి..
- పాలవలస యశస్వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన

ఎవరో వచ్చి సిద్ధం.. సిద్ధం.. అంటున్నారు. వారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధం కావాలి. జైలుకి పంపించడానికి సిద్ధం కావాలి. కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవడానికి సిద్ధం కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని