logo
Published : 28 Jun 2022 06:45 IST

ఫలితమేదైనా సానుకూలంగా జయిద్దాం..!

అమ్మా నాన్నలూ.. పిల్లలపై ఒత్తిడి తేవొద్దు

నేడు వెలువడనున్న ఇంటర్‌ రిజల్ట్‌

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే

సాధ్యం కాదనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే విజయపథంలో వేసే తొలి అడుగు

అపజయం కలిగిందని నిరాశపడకు.. విజయమే అంతం కాదు అపజయం తుదిమెట్టు కాదు

-స్వామి వివేకానంద

ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల అవతున్నాయి.. కరోనా వల్ల పదో తరగతివి రాయకుండా ఇంటర్‌ పరీక్షలు రాయడం ఇదే మొదటిసారి. ఉన్నత విద్యకు పునాది వేసే వీటి కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రయత్నలోపం లేకుండా సమాధానాలు రాసినా ఉత్తీర్ణత కాకపోతే ఎలా అన్న మథనం విద్యార్థుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ‘ఫలితం’ ఎలా ఉన్నా విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అనునయంగా ఉండాలని విద్యార్థి మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఒకకంట కనిపెట్టి ఉండాలని సూచిస్తున్నారు.

మరోసారి అవకాశం ఉంది..

‘‘ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయినా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని అధ్యాపకులు చెబుతున్నారు. మరో నెలరోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని.. అందులో ఉత్తీర్ణులైనా విద్యా సంవత్సరం వృథా కాదని.. ఈమేరకు ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందని చెప్పారు..’’


జనగామలో పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు

తల్లిదండ్రులు ఏం చేయాలంటే..

* విద్యార్థులు ఉదయం నుంచే అన్యమనస్కంగా, బెదురుగా ఉంటారు. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు పరీక్షల ఫలితాల గురించి చర్చలకు తావివ్వకుండా ఉల్లాసంగా ఉండే విధంగా సందర్భోచితంగా సంభాషణలు సాగించాలి. * ఫలితాలలో తేడాలున్నా, అనుకున్న మార్కులు రాకున్నా పెద్దగా పట్టించుకోనవసరం లేదని నచ్చచెప్పాలి. * మెరుగైన మార్కులు సాధించినవారితో పోల్చే ప్రయత్నం చేయొద్ధు తామున్నామని భరోసా కల్పించాలి. * విద్యార్థులను ఒంటరిగా వదిలిపెట్టకుండా వారిని అంటిపెట్టుకుని ఉండాలి. * పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే పదిమందిలో నామోషీ కలుగుతుందని, రేపు నలుగురిలో ఎలా తలెత్తుకుని నడవాలంటూ సూటిపోటిగా మాట్లాడొ ద్దు.. 

విద్యార్థులూ వీటిని మరిచిపోవద్దు..

* ఈ పరీక్షలు జీవితంలో ఒక చిన్నభాగమే అని గమనించాలి.

* పరీక్షలో తప్పిపోతే మరోసారి ప్రయత్నించి విజయం సాధించవచ్చు కానీ జీవితమే శూన్యమైనట్లు అతిగా ఊహించుకుని ఆందోళన పడవద్ధు

* నిన్నమొన్నటి వరకు ఎంత సరదాగా గడిపారో అలాగే ఉండాలి.


అది 2019 సంవత్సరం. చంద్రయాన్‌ 2 ప్రయోగం విఫలం కావడంతో అంతవరకు నిద్రాహారాలు మాని ప్రయోగయజ్ఞంలో మునిగిన ఇస్రో శాస్త్రవేత్తలు విషాదంలో మునిగిపోయారు. జాతికేం సమాధానం చెప్పాలని ఉద్విగ్నంగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో హుందాగా ఇస్రో చీఫ్‌ శివన్‌ను, శాస్త్రవేత్తలను ఓదార్చారు. ప్రయత్నలోపం లేదని ఫలితమే చేదని చెప్పి వారిలో ధైర్యాన్ని నూరిపోశారు.


దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన ఆకవరం సస్యారెడ్డి డిగ్రీ స్థాయిలోనే సివిల్స్‌ సాధించాలనుకున్నారు. ఈ అమ్మాయికేం వస్తుందని పలువురు చెవులు కొరుక్కున్నారు. మొదటి రెండు ప్రయత్నాలు విఫలం కాగానే ఆనాడే చెప్పామని దెప్పిపొడిచారు. వీటిని సవాలుగా తీసుకుని మూడో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 214 ర్యాంకు సాధించి తానేమిటో చాటి చెప్పారు.


సినిమా టికెట్‌ దొరకలేదని భావించాలి

- మైదం ఆజాద్‌ చంద్రశేఖర్‌, విద్యార్థి మనోవైజ్ఞానిక నిపుణుడు

విలువైన జీవితంలో ఇంటర్మీడియెట్‌లో అర్హత సాధించడం ప్రధానమే కానీ అదొక్కటే లక్ష్యం కారాదు. పరీక్షలు తప్పితే మరోసారి ప్రయత్నించవచ్ఛు ఫలితాల రోజు ఇంటిపట్టున కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలి. టీవీలో మానసికోల్లాసం కలిగించే కార్యక్రమాలు వీక్షించాలి.


మానసికంగా సన్నద్ధులను చేస్తున్నాం..

- శ్రీధర్ల ధర్మేంద్ర, ప్రిన్సిపల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కొడకండ్ల

మూడేళ్ల కిందట ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక దృఢత్వం పెంపొందించడానికి నాతో పాటు పలువురు అధ్యాపకులను కౌన్సెలర్లుగా నియమించింది. మేమంతా విద్యార్థులకు నిరంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చాం. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు మానసికంగా బలంగా ఉంటున్నారని గుర్తించాం. ఎలాంటి ఫలితాన్నైనా సానుకూలంగా తీసుకోవాలి.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని