logo

అంచనాలు అందడం లేదు..!

ఉమ్మడి వరంగల్‌ వరప్రదాయని దేవాదుల ఎత్తిపోతల పనులు 18 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మరోవైపు ఇప్పటి వరకు రూ.13,445 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం తాజాగా మరోసారి పెరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు

Updated : 27 Sep 2022 04:36 IST

పనులు పూర్తికాక మూడోసారి పెరగనున్న దేవాదుల వ్యయం


ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గోదావరి వద్ద దేవాదుల ఇన్‌టెక్‌వెల్‌

ఈనాడు, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ వరప్రదాయని దేవాదుల ఎత్తిపోతల పనులు 18 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మరోవైపు ఇప్పటి వరకు రూ.13,445 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం తాజాగా మరోసారి పెరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు రూ.14,729 కోట్లకు ప్రతిపాదించి ఆమోదం కోసం ఈఎన్‌సీకి పంపారు.

ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వస్తు సామగ్రి ధరలతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయ్యేకొద్దీ అంచనాలు ఆకాశాన్నంటేలా పెరిగిపోతున్నాయి. దేవాదుల ప్రాజెక్టు 2004లో ప్రారంభించారు. దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదు. అత్యంత కీలకమైన మూడో దశ పనులు ముందుకు సాగడం లేదు. 49 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మాణంలో ప్రస్తుతం లైనింగ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. దీంతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తున్నారు.

* 2020 వరకు భూసేకరణ పనులు కూడా పూర్తి చేసి దేవాదుల ప్రాజెక్టు మూడు దశల్లోని 16 ప్యాకేజీలను పూర్తి చేస్తామని అప్పటి సీఈ వెల్లడించారు. గడువు లోపు పనులు పూర్తి కాలేదు. ఇప్పటికీ రెండు, మూడో దశల్లోని పనులు పూర్తి కావాల్సి ఉంది.

* దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే కరవు ప్రాంతమైన జనగామ జిల్లాకు పుష్కలంగా సాగు నీరు అందుతుంది. ఈ జిల్లాల్లో భూసేకరణ కాకపోవడంతో కాలువ నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది.

144 శాతం అధికం

* ఈ ప్రాజెక్టును తొలుత రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు.

* 2010లో అంచనా వ్యయాన్ని సవరించి రూ.9,427 కోట్లకు పెంచారు.

* రెండోసారి 2019లో రూ.13,445 కోట్లకు సవరించారు.

* తాజాగా మూడోసారి సవరించి రూ.14,729 కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు.

* అంటే ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం ఏకంగా 144 శాతం పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని