logo

సమస్యల నిలయం.. ప్రయాణ ప్రాంగణం

జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమస్యలకు నిలయంగా మారింది. హైదరాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ ప్రాంతాలకు సెంటర్‌ పాయింట్‌గా ఉంటూ ప్రయాణికులకు ఎన్నో సేవలందిస్తోంది.

Published : 28 Nov 2022 05:04 IST

న్యూస్‌టుడే, జనగామ టౌన్‌: జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమస్యలకు నిలయంగా మారింది. హైదరాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ ప్రాంతాలకు సెంటర్‌ పాయింట్‌గా ఉంటూ ప్రయాణికులకు ఎన్నో సేవలందిస్తోంది. అలాంటి ప్రాంగణాన్ని ప్రస్తుతం సౌకర్యాల లేమి వేధిస్తోంది. జనగామ జిల్లాగా ఆవిర్భవించి ఆరేళ్లైనా.. ఆర్టీసీ పరంగా పురోభివృద్ధి కరవైంది.  జిల్లాలోని 12 మండలాల ప్రజలే కాకుండా హైదరాబాద్‌, వరంగల్‌, సూర్యాపేట, సిద్దిపేట, హుస్నాబాద్‌ తదితర ప్రధాన రూట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో అసౌకర్యాల మధ్యనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

ఒక్కటి కాదు.. అనేకం

జనగామ బస్‌ స్టేషన్‌ను 1977లో నిర్మించారు. తర్వాత 1992 ప్రాంతంలో మరికొన్ని ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 12 ప్లాట్‌ఫారాలు మాత్రమే ఉన్నాయి. పాలకుర్తి, మోత్కూరు రూట్లకు బస్టాండ్‌ ఆవరణలో రేకుల షెడ్డే ప్లాట్‌ఫారంగా ఏర్పాటు చేశారు. బస్టాండ్‌ ఆవరణ మొత్తం సీసీ రహదారి లేకపోవడంతో డిపో ఎదుట, చిన్నగేటు ప్రాంతంలో వర్షాకాలంలో ప్రాంగణం బురదమయంగా మారుతుంది. బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగడం లేదు. కుర్చీల సంఖ్య సరిపోవడం లేదు. పైకప్పు శిథిలమవ్వడంతో మరమ్మతు చేపట్టారు. పదో ప్లాట్‌ఫారం వద్ద ఉన్న మూత్రశాలలు అపరిశుభ్రంగా మారాయి. చిన్నగేటు ప్రాంతం చెత్త డంపింగ్‌ను తలపిస్తోంది.


రాత్రిపూట నిరీక్షణే...

జనగామ పట్టణం అటు హైదరాబాద్‌, ఇటు వరంగల్‌కు మధ్యలో ఉండటంతో దీని శివారు నుంచి బైపాస్‌ రోడ్డు ఉంది. సూపర్‌ఫాస్ట్‌ బస్సులకు ఇక్కడ హాల్టింగ్‌ ఇవ్వడం లేదు. ఫలితంగా రాత్రివేళ తగిన బస్సులు లేక ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. హైదరాబాద్‌, హనుమకొండకు వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ బస్సులు  ఇక్కడ ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

వెల్దండి జ్యోత్స్న, డిపో మేనేజర్‌


బస్టాండ్‌ విస్తరణ వంటి ప్రతిపాదనలైతే ఇప్పటి వరకు లేవు. ప్రాంగణం ఆవరణలో సీసీ రహదారి నిర్మించడానికి చర్యలు చేపడతాం. గత నెలలోనే కొత్తగా రెండు ఫ్యాన్లు బిగించాం. డిపో ఎదుట నుంచి బస్టాండ్‌కు వెళ్లే దారిలో మొరం పోయించాం. ఇక రాత్రివేళల్లో హైదరాబాద్‌, హనుమకొండ రూట్లలో బస్సులు లేవనే విషయంపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటాం.
ఇవీ జిల్లా ప్రజల కోరిక
* జనగామ జిల్లా కేంద్రంలో లోకల్‌ బస్సులు ప్రవేశపెట్టాలి.
* సూపర్‌ఫాస్ట్‌ బస్సుల హాల్టింగ్‌ ఇవ్వాలి.
* పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండ్‌ విస్తరణ చేపట్టాలి.
* డిపోకు కొత్త బస్సులు మంజూరు చేయాలి.
* హైదరాబాద్‌, హనుమకొండకు రాత్రివేళల్లో బస్సులు అందుబాటులో ఉంచాలి.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు