logo

ప్లాస్టిక్‌ రహిత పర్యాటకం.. కదిలొచ్చిన యువతరం

ప్రజలు కాసేపు హాయిగా సేద దీరేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళతారు. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదం కలుగుతుంది. సాంస్కృతిక రాజధాని ఓరుగల్లులోని అనేక సందర్శనీయ స్థలాల్లో ప్లాస్టిక్‌ మహమ్మారి పాతుకుపోయింది.

Updated : 25 Jan 2023 06:20 IST

‘ఈనాడు’ పిలుపునకు స్పందన
ఈనాడు, వరంగల్‌, ఖిలావరంగల్‌, న్యూస్‌టుడే

చెత్తను స్వచ్ఛ ఆటోలో వేస్తున్న విద్యార్థులు  

ప్రజలు కాసేపు హాయిగా సేద దీరేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళతారు. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదం కలుగుతుంది. సాంస్కృతిక రాజధాని ఓరుగల్లులోని అనేక సందర్శనీయ స్థలాల్లో ప్లాస్టిక్‌ మహమ్మారి పాతుకుపోయింది. పరిసరాలన్నీ వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్‌లోని  ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ రక్కసిని తరిమేసేందుకు  ‘ఈనాడు’ నడుం కట్టింది. మంగళవారం వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల తోడ్పాటుతో పర్యాటక ప్రాంతాల వద్ద  పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరివేసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  కుప్పలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ చెత్తను కవర్లలో నింపి స్వచ్ఛ ఆటోలు, ఇతర మార్గాల ద్వారా డంపింగ్‌ యార్డులకు తరలించారు.

ఖిలా వరంగల్‌ కీర్తితోరణాల వద్ద నినాదాలు చేస్తున్న కార్పొరేటర్‌ సువర్ణ సురేశ్‌,
రంగశాయిపేట ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రేరణ ఫౌండేషన్‌ సభ్యులు

సందర్శనీయ స్థలాల వద్ద వ్యర్థాల ఏరివేత

కాకతీయుల కాలం నాటి ప్రాచీన కట్టడాలున్న వరంగల్‌ కోట ప్రాంతాన్ని తిలకించేందుకు నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. కీర్తి తోరణాల పరిసరాలతోపాటు, పిల్లల పార్కు, ఖుష్‌మహల్‌ తదితర ఆకర్షణల చుట్టూ ప్లాస్టిక్‌ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. రంగశాయిపేట జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులతోపాటు అధ్యాపకులు తరలివచ్చి ఈ వ్యర్థాలను ఏరివేశారు. ప్రేరణ ఫౌండేషన్‌ సహకారంతో బస్తీబడి విద్యార్థులూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోగి సువర్ణ, సురేష్‌  ప్రారంభించారు. విద్యార్థులు మధ్యకోట ఏకశిల చిల్డ్రన్స్‌ పార్క్‌ నుంచి ఖుష్‌మహల్‌ వరకు పరిసరాలు, రోడ్లకు ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి స్వచ్ఛ భారత్‌ ఆటోల్లోకి తరలించారు. అనంతరం విద్యార్థులంతా కలిసి ర్యాలీ చేసి ‘ప్లాస్టిక్‌ను తరిమికొడదాం.. పర్యాటక ప్రాంతాల్ని కాపాడుదాం’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. కోటకు వచ్చిన పాఠశాలల విద్యార్థులకు ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రంగశాయిపేట జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమ సమన్వయకర్త వీరాంజన్‌కుమార్‌, అధ్యాపకుడు యాకయ్య, కేంద్ర పురావస్తుశాఖ ఖిలావరంగల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, సిబ్బంది, ప్రేరణ ఫౌండేషన్‌, బస్తీ బడి వ్యవస్థాపకులు పెండ్లి ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ కోట ప్రాంతంలో వ్యర్థాలను ఏరుతున్న విద్యార్థులు

ఇవెంతో ఆదర్శం..

ఓరుగల్లులో అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటి వద్ద ప్లాస్టిక్‌ నిషేధంపై యంత్రాంగం దృష్టిపెట్టడం లేదు. స్వచ్ఛమైన పాకాల సరస్సు చుట్టూ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
* దేశంలో కొన్ని పర్యాటక ప్రాంతాల వద్ద ప్లాస్టిక్‌ నిషేధం కచ్చితంగా అమలవుతుంది. వాటిని ఆదర్శంగా తీసుకొని మన వద్దా అలాంటి చర్యలు చేపట్టాలి. * సిక్కింలోని సందర్శనీయ స్థలాల వద్ద 1998 నుంచి ప్లాస్టిక్‌ నిషేధం అమలవుతోంది. తాగునీటి సీసాలను కూడా నిషేధించారు. చెక్‌పోస్టులు పెట్టి పర్యాటకుల వద్ద ప్లాస్టిక్‌ లేకుండా తనిఖీలు చేపడతారు. * పుణ్యక్షేత్రాలైన తిరుమల, కేరళలోని శబరిమల లాంటి చోట్ల ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. * కేరళలోని 9 పర్యాటక ప్రాంతాల వద్ద ప్లాస్టిక్‌ నిషేధం అమలవుతోంది. కన్నూరు ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా 2015లో ఖ్యాతిపొందింది. * తమిళనాడులోని హిల్‌స్టేషన్‌ ఊటీ ప్లాస్టిక్‌ నిషేధిత ప్రాంతం. ‘ఆపరేషన్‌ బ్లూ మౌంటేన్‌’ పేరుతో ఇక్కడ చేపట్టిన చర్యలకు స్థానికులు కూడా సహకరించి ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించారు. * హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాల్గా, అసోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న మాజౌలి, నాగాలాండ్‌లోని జుకా వ్యాలీ, చండీగఢ్‌ నగరం లాంటి ఎన్నో దర్శనీయ ప్రాంతాల్లో ఈ మహమ్మారిని తరిమేశారు.

కఠిన చర్యలు అవసరం..

ప్లాస్టిక్‌ను నిషేధించాలంటే ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి. స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగాలు సమన్వయంతో ముందుకుసాగాలి.
పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వ్యర్థాలను బయట పారేయకుండా డస్ట్‌బిన్‌లలో వేసేలా చూడాలి. * కట్టడాల వద్దకు వెళ్లే ముందు సందర్శకులను తనిఖీ చేయాలి. వారి వద్ద ప్లాస్టిక్‌ వస్తువులు లేకుండా చూడాలి. * తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. * సందర్శకులు వస్త్ర సంచులు వాడేలా ఏర్పాట్లు చేయాలి.

మాట్లాడుతున్న ఎఫ్‌ఆర్వో రమేష్‌, పక్కన ప్రిన్సిపల్‌ శేషాచారి

ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి పాకాలకు రక్షణ

ఖానాపురం, న్యూస్‌టుడే: ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాకాలలో ప్లాస్టిక్‌ నిర్మూలన కార్యక్రమాన్ని ‘ఈనాడు ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు నిర్వహించారు. ఎఫ్‌ఆర్వో రమేష్‌, ఖానాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శేషాచారి దీన్ని ప్రారంభించారు. తొమ్మిది సంచుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరారు. కార్యక్రమంలో 31 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్ధులు, ప్రోగ్రాం అధికారి విజయ్‌మోహన్‌, డీఆర్వో మోహన్‌, అధ్యాపకులు సరిత, సారంగపాణి, విజయ్‌, సదానందం, రవి, సంజీవ, రమాదేవి, సంతోష్‌, కృష్ణమూర్తి,  అటవీ సబ్బంది విజయ్‌, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.

చెత్తను సంచిలో వేస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు


ఇది మంచి కార్యక్రమం

- బోగి సువర్ణ సురేశ్‌, కార్పొరేటర్‌, 37వ డివిజన్‌

ఎంత చెప్పినా ప్లాస్టిక్‌ వ్యర్థాలను పర్యాటకులు ఇక్కడ పారవేస్తున్నారు.  ‘ఈనాడు - ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ నిర్వహించడం సంతోషంగా ఉంది. మా బాధ్యతగా ప్లాస్టిక్‌ను వంద శాతం నిర్మూలించేందుకు ప్రయత్నిస్తాం.


పూర్తిగా నిషేధించాలి

- పెండ్లి ఉపేందర్‌రెడ్డి, ప్రేరణ ఫౌండేషన్‌, హనుమకొండ

పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వాలే పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేధించాలి. చెత్త వేసే వారికి చిన్నపాటి జరిమానాలు విధించి మరోసారి ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా పారేయకుండా కట్టడి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని