logo

ముమ్మరంగా కంటి వెలుగు శిబిరాలు

జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. వంద రోజుల పాటు జరిగే ఈ శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Published : 02 Feb 2023 05:38 IST

నేత్ర పరీక్షలు చేస్తున్న వైద్యసిబ్బంది

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. వంద రోజుల పాటు జరిగే ఈ శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. గతనెల 19 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వైద్యపరీక్షలు ప్రారంభం కాగా మంగళవారం నాటికి 31 వేల మందికి నేత్ర పరీక్షలు చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల్లో జరుగుతున్న శిబిరాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా పంచాయతీ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి.

సగటున 148 మందికి పరీక్షలు

శిబిరాల్లో రోజుకు సగటున 148 మందికి నేత్ర పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువ మందికే నేత్రపరీక్షలు ఇప్పటివరకు జిల్లాలో జరిగాయి. కలెక్టర్‌ శివలింగయ్య సూచనలను అధికారులు పాటించడం వల్లే కాస్త వేగంగానే పరీక్షలు జరిగాయని నివేదికలు చెప్తున్నాయి.

అందుబాటులో అద్దాలు

జిల్లాలో 33వేల కంటి అద్దాలు నిల్వ ఉండగా మంగళవారం నాటికి 5400 మందికి పంపిణీ చేశారు. దగ్గరి చూపులేని వారికి వెంట వెంటనే అద్దాలు అందిస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్న వారికి, దూరం, దగ్గర రెండు చూపులు సరిగా లేనివారికి కంటి అద్దాలను తెప్పించడానికి ఆర్డర్‌ చేస్తున్నారు. ఒక్కోక్కరికి ఒక్కో రకమైన దృష్టిలోపం ఉంటుంది. శిబిరాల్లో వైద్య సిబ్బంది సూచించిన సైట్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదుచేస్తున్నారు. దాని ప్రకారంగా అద్దాలు తెప్పించనున్నారు. పక్షం రోజుల్లో అద్దాలు వస్తాయని, రాగానే ఫొన్‌ చేస్తామని శిబిరంలో సిబ్బంది చెప్తున్నారు. శస్త్ర చికిత్సలకు అవసరమైన వారి జాబితాను తయారు చేస్తున్నారు. వీరికి వరంగల్‌ ప్రభుత్వ నేత్ర వైద్యశాల, హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నేత్ర శస్త్రచికిత్సలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమం వంద పనిదినాల్లో కొనసాగుతుంది.

ఎప్పటికప్పుడు నివేదికలు

జిల్లా కేంద్రంలో రెండు శిబిరాలను ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా మొత్తం 30 వార్డుల్లో శిబిరాలను దశలవారీగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని మండలాల పరిధిలో పీహెచ్‌సీల వారీగా గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను కొనసాగిస్తున్నారు. వైద్య శిబిరాల నిర్వహణ, వైద్య సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, భోజన ఏర్పాట్లను జిల్లా పంచాయతీ శాఖ చూసుకుంటోంది. వైద్య పరీక్షల నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి, పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులు ప్రతి రోజూ నేత్ర పరీక్షల తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో కార్యక్రమ నివేదికను ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయికి పంపించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఇబ్బందులు లేకుండా చర్యలు
-డాక్టర్‌ మహేందర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

జిల్లా వ్యాప్తంగా 26 బృందాలతో నేత్ర పరీక్షలు చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం. శిబిరాలను సందర్శిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నాం. ప్రతి రోజూ శిబిరాల్లో లక్ష్యం కంటే ఎక్కువగానే పరీక్షలు నిర్వహించాము. ప్రజలకు ఏమైన సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని