ముంపు ముంగిట మన్యం!
ఓ గంటపాటు వర్షం కురిస్తే మన్యంలోని వాగులు కాలనాగుల్లా బుసలు కొడుతుంటాయి. గిరిజన పల్లెలు ముంపు ముంగిట్లో చిక్కుకోవాల్సి వస్తోంది.
ముత్తారం-సీతారాంపురం మధ్య వాగుపై వారధి నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతున్న అటవీ సిబ్బంది (పాత చిత్రం)
వెంకటాపురం(ములుగు జిల్లా), న్యూస్‌టుడే: ఓ గంటపాటు వర్షం కురిస్తే మన్యంలోని వాగులు కాలనాగుల్లా బుసలు కొడుతుంటాయి. గిరిజన పల్లెలు ముంపు ముంగిట్లో చిక్కుకోవాల్సి వస్తోంది. జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లో ఏళ్లుగా వెతలు వెంటాడుతున్నా వాగులపై వంతెనలు లేక బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఈ ఏడాది కూడా వారధులు, రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. మళ్లీ ముంపు ముప్పు తప్పేలా లేదని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
* వెంకటాపురం మండలంలోని పెంకవాగు, ముత్తారం వాగు ఉప్పొంగితే తిప్పాపురం, పెంకవాగు, కొత్తగుంపు, కలిపాక, ముత్తారం, సీతారాంపురం గ్రామాలు, కంకలవాగు ఉదృతికి మల్లాపురం, కర్రివానిగుంపునకు రాకపోకలు నిలుస్తాయి. వాజేడు మండలంలోని చాకిరేవువాగు ప్రవాహానికి కోయవీరాపురం, తాడ్వాయి మండలంలోని జంపన్నవాగు ఉదృతికి ఊరట్టం, ఎల్బాకలకు, ఏటూరునాగారం మండలంలోని ఎలశెట్టిపల్లి, కన్నాయిగూడెం మండలంలోని ఐలాపురంవాగు ప్రభావంతో ఐలాపురానికి, గౌరారంవాగు ఉప్పొంగితే మంగపేట మండలం బొమ్మాయిగూడెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఏటా ఆ గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
నిధులున్నా నిష్ఫలం!
* వెంకటాపురం మండలంలోని ముత్తారం సమీప వాగు, పెంకవాగుపై వారధి నిర్మాణాలకు ఎల్‌డబ్ల్యూఈలో భాగంగా రూ.3.80 కోట్లను మంజూరు చేశారు. ర.భశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ప్రక్రియను సైతం పూర్తి చేసి గుత్తేదారులకు అప్పగించారు. తీరా నిర్మాణం చేపట్టేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లగా అటవీశాఖ అభ్యంతరం తెలిసింది. నిర్మాణ ప్రాంతాలు నిషిద్ధ అటవీభాగంలో ఉన్నట్లు పేర్కొనడంతో పనులకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది.
* వాజేడు మండలంలోని కోయవీరాపురం-శ్రీరాంనగర్ మధ్య వాగుపై వారధి నిర్మించేందుకు రూ.1.80 కోట్లు కేటాయించారు. టెండరు ప్రక్రియ సైతం పూర్తైనా అటవీశాఖ అభ్యంతరం తెలపడంతో నిర్మాణానికి మోక్షం లేకుండా పోయింది.
* తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలను అనుసంధానం చేసే ఊరట్టం-ఐలాపురం మధ్య తారుదారి, పలు ప్రాంతాల్లో వాగులపై వారధుల నిర్మాణానికి 2016లో రూ.19 లక్షల నిధులు విడుదల చేశారు. ఆ ప్రాంతం పూర్తిగా అభయారణ్యంలో ఉండటంతో అటవీశాఖ అభ్యంతరం తెలిసింది. అనుమతులకు గాను రాష్ట్ర స్థాయి యంత్రాంగానికి ప్రతిపాదించినా కదలిక లేదు.
రహదారులను ముంచెత్తుతున్న వరద
జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులను సైతం వరద ముంచెత్తుతోంది. గోదావరి ఉగ్రరూపానికి తోడు ఎగపోటు ప్రభావంతో వాజేడు మండలం టేకులగూడెం వద్ద మార్గంపైకి వరద చేరుతోంది. దీంతో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ మధ్య అంతరాష్ట్ర రాకపోకలు స్థంభిస్తున్నాయి. చండ్రుపట్ల-భద్రాచలం ఆర్‌అండ్‌బీ మార్గంలోని వెంకటాపురం మండలం పాత్రాపురం వద్ద బల్లకట్టువారధి, బోదాపురం వద్ద కొండాపురం వారధి, వీరభద్రవరం వద్ద కుక్కతోగువారధి సైతం ముంపునకు గురవుతున్నాయి. ములుగు, వెంకటాపూర్ మండలాల్లోని రామప్ప చెరువు, మేడివాగు ఉద్ధృతికి 163 జాతీయ రహదారిపైకి వరద చేరుతోంది. ఏటా ఈ పరిస్థితి ఉదయిస్తున్నా ఇక్కడ కరకట్టల నిర్మాణం, రహదారుల ఎత్తు పెంపు, వారధుల నిర్మాణాల ప్రక్రియకు మోక్షం కలగడం లేదు.
గతేడాది జులైలో కుండపోతగా కురిసిన వర్షాలకు వెంకటాపురం మండలంలోని పెంకవాగు ఉప్పొంగింది. లో లెవల్ చప్టా నీటి ముంపునకు గురై ఆవలి ప్రాంతంలోని నాలుగు గిరిజన పల్లెలకు రాకపోకలు స్తంభించాయి. నిత్యావసరాలు సైతం అందుబాటులో లేకపోవడంతో కన్నీటి వరదను దాటి సామగ్రిని గ్రామాలకు చేర్చుకునేందుకు గిరిజనం ప్రవాహంపైనే ప్రాణాలను లెక్కచేయకుండా ఇలా సాహసం చేయాల్సి వచ్చింది.
వెంకటాపురం-మల్లాపురం మార్గంలోని కంకలవాగు మోస్తరు వర్షానికి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఇక్కడ వారధి నిర్మాణానికి గాను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం రూ.411 లక్షలతో ప్రతిపాదించింది. రెండు నెలల కిందటనే టెండరు ప్రక్రియ పూర్తైనా అగ్రిమెంట్‌లో జాప్యంతో నిర్మాణంలో కాలాతీతం చోటుచేసుకుంది. ఈ ఏడాది సైతం గిరిజనులకు కష్టాలు తప్పేలా లేవు.
కష్టాలు అరణ్య రోదన.
-బాడిస సత్యం, సర్పంచి తిప్పాపురం, వెంకటాపురం మండలం
ఏళ్లుగా మా కష్టాలు అరణ్య రోదనగానే మిగులుతున్నాయి. వర్షాలు, వరదలతో రోజుల తరబడి ప్రధాన మార్గానికి దూరమవుతున్నాం. పెంకవాగుపై బ్రిడ్జి, తిప్పాపురం-బోదాపురం రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలనే గోడు పట్టించుకునే దిక్కు లేదు. గర్భిణులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రవాహాలు దాటాల్సి వస్తోంది. ఎవరికి చెప్పుకున్నా వెతలు తీరడం లేదు.
ఇబ్బందులు పడుతున్నాం..
- మడకం పాపారావు, మల్లాపురం, వెంకటాపురం మండలం
కంకలవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలుస్తున్నాయి. ఏదైనా అత్యవసరమైతే మండల కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నాం. తారురోడ్డు నిర్మించినా బ్రిడ్జి పనులు నేటికీ చేపట్టలేదు. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు సైతం ఈ ప్రవాహం అడ్డుగా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి వెతలు కష్టాలు తీర్చాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్ అస్త్రను సాధించేది ఎవరు?
-
NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్
-
IndiGo: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఆత్మహత్యాయత్నం..
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్