logo

Mulugu: కాన్పు కోసం వెళితే మూత్రాశయాన్ని కత్తిరించారు..

కాన్పు కోసం గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వైద్యులు మూత్రాశయాన్ని కత్తిరించారు. అది గమనించకుండా రెండ్రోజులు అలాగే ఉంచి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత విషయం బయట పడింది.

Updated : 09 Aug 2023 09:32 IST

ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ బాలింత

ములుగు, న్యూస్‌టుడే: కాన్పు కోసం గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వైద్యులు మూత్రాశయాన్ని కత్తిరించారు. అది గమనించకుండా రెండ్రోజులు అలాగే ఉంచి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత విషయం బయట పడింది. ఈ సంఘటన ములుగులోని జిల్లా ఆసుపత్రిలో జులై 28న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఇంచర్ల గీత జులై 28న ములుగు జిల్లా ఆసుపత్రికి కాన్పు కోసం వెళ్లారు. అదే రోజు సాయంత్రం వైద్యులు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు. అప్పటి వరకు తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి బాలింత కడుపు ఉబ్బడంతో సమస్యను వైద్యులకు వివరించారు. వారు సమస్యను గుర్తించక పట్టించుకోలేదు. రెండ్రోజులు గడిచినా అదే పరిస్థితి నెలకొనడంతో వరంగల్‌ ఎంజీఎంకు సిఫారసు చేశారు. అక్కడి వైద్యులు కూడా సమస్యను గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించింది. లాభం లేదనుకొని ఆమె భర్త సాగర్‌ హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు సమస్యను గుర్తించి మూత్ర సంచికి గాయమై ఇన్‌ఫెక్షన్‌ అయిందని తెలిపారు. ములుగు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన భార్యకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని ఆమె భర్త ములుగు పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.

ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన ములుగు డీఎంహెచ్‌వో: ములుగు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీత ఆరోగ్య పరిస్థితిని మంగళవారం ములుగు డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.అప్పయ్య పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎంహెచ్‌వో ‘న్యూస్‌టుడే’తో తెలిపారు. కాన్పు చేసిన సమయంలో మూత్రాశయానికి గాయమైంది వాస్తవమేనని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు