logo

వరంగల్‌ బరిలో కడియం కావ్య..

మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా మాజీ ఎంపీ ప్రొ.అజ్మీరా సీతారాంనాయక్‌, వరంగల్‌ ఎంపీ భారాస అభ్యర్థిగా కడియం కావ్యలను ఖరారు చేస్తూ ఆయా పార్టీల అధిష్ఠానాలు బుధవారం ప్రకటించాయి.

Updated : 14 Mar 2024 06:46 IST

ఈనాడు-వరంగల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే : మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా మాజీ ఎంపీ ప్రొ.అజ్మీరా సీతారాంనాయక్‌, వరంగల్‌ ఎంపీ భారాస అభ్యర్థిగా కడియం కావ్యలను ఖరారు చేస్తూ ఆయా పార్టీల అధిష్ఠానాలు బుధవారం ప్రకటించాయి.


వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి..

కడియం కావ్య (వరంగల్‌)

స్టేషన్‌ఘన్‌పూర్‌ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ముగ్గురు కూతుళ్లు కాగా పెద్ద కుమార్తె కడియం కావ్య ఉస్మానియాలో ఎండీ పాథాలజీ చేసి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. కొన్నేళ్లుగా ‘కడియం ఫౌండేషన్‌’ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాలికలకు హైజీన్‌ కిట్లను పంపిణీ చేశారు. వర్ధన్నపేట సామాజిక వైద్య కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన కావ్య గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి శ్రీహరి రాజకీయ వారసురాలిగా అసెంబ్లీకి భారాస నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుడు శ్రీహరినే పోటీ చేయాలని, భవిష్యత్తులో కావ్యకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి శ్రీహరి విజయానికి కావ్య విశేష కృషి చేశారు. ఈ క్రమంలో ఈ సారి వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావ్యకు అవకాశం దక్కింది. కావ్య భర్త డాక్టర్‌ నజీర్‌, వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


రెండోసారి సీతారాంనాయక్‌ ..

అజ్మీరా సీతారాంనాయక్‌ (మహబూబాబాద్‌)

ఇటీవల భారాస నుంచి భాజపాలో చేరిన ప్రొ.అజ్మీరా సీతారాంనాయక్‌కు మహబూబాబాద్‌ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గిరిజన తండాకు చెందిన ప్రొ.సీతారాంనాయక్‌ 2014లో తెరాస(భారాస) అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఆయన టికెట్‌ కోసం ప్రయత్నించగా పార్టీ నిరాకరిస్తూ మాలోతు కవితకు కేటాయించారు. ఈ సారి కూడా ఆ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇటీవల భాజపాలో చేరారు. భాజపా లోక్‌సభ టికెట్‌ కోసం జాటోతు హుస్సేన్‌నాయక్‌, యాప శీతయ్య ప్రయత్నాలు చేశారు. అయితే కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర, ఎంపీగా పనిచేసిన సీతారాంనాయక్‌ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భాజపా అనూహ్యంగా తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.


ఆ రెండు పార్టీల నుంచి ఎవరో?

వరంగల్‌ లోక్‌సభ బరిలో కాంగ్రెస్‌, భాజపాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఇంకా స్పష్టత రాలేదు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే భాజపా నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పోటీ చేస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. బుధవారం భారాస నేతలు ఆయన్ను హైదరాబాద్‌ తీసుకెళ్లడం.. అక్కడ తాను భారాసలోనే ఉంటానని, పోటీలో ఉండనని ప్రకటించడంతో వరంగల్‌ నుంచి భాజపా అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఇక కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పష్టతనివ్వకపోవడంతో ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరనేది తేలాల్సి ఉంది.


మహబూబాబాద్‌లో ఖరారు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బుధవారం మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ పేరును భాజపా ప్రకటించింది. ఇంతకన్నా ముందే భారాస సిట్టింగ్‌ ఎంపీ కవితకు మరోమారు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్‌ మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్‌కు టికెట్ ఇచ్చింది. మానుకోట నుంచి పోటీలో నిలవనున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఈ స్థానం నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని