logo

మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు

గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అన్నారు.

Published : 26 Apr 2024 04:41 IST

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి

హనుమకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి. చిత్రంలో భాజపా హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌,  వరంగల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, భాజపా సీనియర్‌ నేత గరికపాటి మోహన్‌రావు.

సుబేదారి, న్యూస్‌టుడే: గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అన్నారు. గురువారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీలో పుష్కర్‌.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్నారు. హనుమకొండ చౌరస్తా వద్ద పుష్కర్‌ మాట్లాడుతూ.. దేశంలో మోదీ ప్రభుత్వం పదేళ్లు సుపరిపాలన అందించిందన్నారు. దేశంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మోదీ కృషి చేశారని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్‌ రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఎన్నో వర్గాలకు మేలు చేశారని చెప్పారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం భాజపా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.. మూడోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ దేశంలోని బడుగుబలహీన వర్గాల ప్రజల కోసం కేంద్రం పనిచేసిందన్నారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.. ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ మాట్లాడుతూ తెదేపా, భారాసకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మోదీ బృందంలో తనకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

ఓరుగల్లులో భాజపా భారీ ర్యాలీ

సుబేదారి, న్యూస్‌టుడే: వరంగల్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి అరూరి రమేశ్‌ గురువారం హనుమకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు తన రెండో సెట్‌ నామపత్రాలను దాఖలు చేశారు. వేయిస్తంభాల ఆలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు కొనసాగిన ప్రచారంలో భాజపా అగ్రనేతలు పాల్గొని ప్రసంగించారు. 

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌ ద్వారా మామునూరుకు చేరుకొని అక్కడ నుంచి కాన్వాయి ద్వారా హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం వద్దకు వచ్చారు.  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రోడ్డుకిరువైపులా కాషాయమయమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని