logo

కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి జలాలు

పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Published : 07 May 2024 06:44 IST

కొత్తగూడలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌, పార్టీ నాయకులు

కొత్తగూడ, గంగారం, న్యూస్‌టుడే: పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. సోమవారం కొత్తగూడ, గంగారం మండలకేంద్రాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సమావేశంలో ఆమె మాట్లాడారు. పదేళ్ల భారాస కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి నీళ్లు తరలించకుండా అధికారం కోల్పోయిన తర్వాత తెస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే కొత్తగూడకు గోదావరి నీళ్ల తరలింపుపై సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారాస నేతలు చేస్తున్న కుట్రలను విశ్వసించొద్దని కోరారు. రాజ్యాంగం మార్చేందుకు భాజపా కుట్ర పన్నుతోందన్నారు. బలరాంనాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా శ్రమించాలని గంగారంలో కార్యకర్తలు, నేతలను కోరారు. ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ మాట్లాడుతూ ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పోడు భూములకు శాశ్వత పట్టాలిచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన పలువురికి కండువాలను కప్పి ఆహ్వానించారు. అంతకు ముందు గుంజేడు ముసలమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించిన సీతక్క భారీ ద్విచక్రవాహనాల ర్యాలీతో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌ఛార్జి అనిల్‌కుమార్‌, ఎంపీపీ బానోతు విజయ, జడ్పీటీసీ సభ్యురాలు పుష్పలత, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, చల్లా నారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రూప్‌సింగ్‌, మొగిలి, కారోజు రమేశ్‌, నూనావతు రాధాబాయి, వెంకన్న, శ్రీను, సర్పంచులు వెంకటలక్ష్మి, రణధీర్‌, రాజేశ్వర్‌, తదితరులున్నారు. మంత్రి సీతక్క గంగారం మండలంలో తిరుమలగండి, మడగూడెం, గంగారం, కాటినాగారం, పెద్దఎల్లాపురం, పందెం గ్రామాల్లో పర్యటించారు. గంగారం ఎంపీపీ సువర్ణ పాక సరోజన, జడ్పీటీసీ సభ్యురాలు రమ తదితరలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని