logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు

ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

Published : 07 May 2024 06:52 IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లనివి 1445..

భూపాలపల్లిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసేందుకు వరుసలో నిల్చొన్న ఉద్యోగులు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు వేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి.

అధికారుల చర్యలు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్ల దరఖాస్తు పత్రాలను నేరుగా సేకరించి జిల్లాలకు పంపించారు. దీంతో ఉద్యోగులు, వివిధ సర్వీసుల వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఈసారి ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ఫారం 12 పత్రాలను సేకరించి ఎపిక్‌ కార్డుతో సహా వివరాలను వైబ్‌సైట్‌లో పొందుపర్చారు. సదరు ఉద్యోగి ఎక్కడ ఓటు వేయడానికి ఎంపిక చేసుకున్నారో ఆ డేటా అంతా ఆన్‌లైన్‌లో కనిపించేలా ఏర్పాట్లు చేశారు.

ఓటు వేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. డిక్లరేషన్‌ సమయంలో ఇబ్బందులు కలగకుండా గెజిటెడ్‌ అధికారులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

నర్సంపేటలో అత్యధికం..

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1445 తిరస్కరణకు గురయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 278 ఉన్నాయి. సరిగా ఓటు వేయకపోవడం, సంతకాలు చేయకపోవడం, తదితర కారణాలతో ఇవి చెల్లకుండా పోయాయి.

ఒకరికే టిక్‌ చేయాలి..

పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేవారికి ఫారం 12 ఇస్తారు. ఇందులో 13ఎ, 13బి, 13సి, 13డి కవర్లు ఉంటాయి. 13ఎ కవర్‌లో డిక్లరేషన్‌ ఫారంపై తప్పకుండా సంతకం చేయాలి. బ్యాలెట్‌ నెంబరు, సీరియల్‌ నెంబరు వేయాలి. 13బి కవర్‌లో బ్యాలెట్‌ పేపర్‌ ఉంటుంది. అభ్యర్థుల పేర్లు, పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి. వాటి ఎదురుగా పెన్నుతో రైట్‌ గుర్తు పెట్టాలి. ఒకరి ఎదురుగా మాత్రమే టిక్‌ పెట్టాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి టిక్‌ చేస్తే తిరస్కరణకు గురవుతుంది. ఏ అభ్యర్థికి లేదా నోటాకు టిక్‌ పెట్టకున్నా తిరస్కరిస్తారు.

  • పూర్తిచేసిన 13ఎ, 13బి కవర్లను 13సి కవర్‌లో పెట్టాలి.  పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి లేదా సంబంధిత అధికారులకు తపాలా ద్వారా పంపించాలి. 13డి కవర్‌లో సూచనలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని