logo

తస్మాత్‌ జాగ్రత్త

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 07 May 2024 07:05 IST

పొంచి ఉంది వడదెబ్బ..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి..  ప్రచారంలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది తగిన  జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

‘వడదెబ్బ లక్షణాలతో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి బాధితులు వరుస కడుతున్నారు. వీరిలో వృద్ధులు, యువకులు, పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. నిత్యం 10 మంది వరకు ఆసుపత్రిలో చేరుతుండగా.. అందులో సగానిపైగా కోలుకొని ఇంటికి వెళ్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి జగిత్యాల జిల్లా కోరుట్లలో ద్విచక్ర వాహనంపై ఊరూరా తిరుగుతూ దుస్తులు విక్రయిస్తుంటారు. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని కుటుంబ సభ్యులు ఇటీవల వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.

వరంగల్‌ రంగంపేటలో బిఎస్‌కె జువెలర్స్‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

స్వచ్ఛందంగా..

ఎండల తీవ్రతకు ప్రజలు అలసిపోతున్నారు. తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తే వడదెబ్బ నుంచి వారిని కాపాడినవారు అవుతారు..

ఆలోచన బాగు.. ఇలా చేస్తే మేలు

ఎండల నుంచి ఎంతో కొంత ఉపశమనానికి వరంగల్‌ చౌరస్తాలోని ఆటో చోదకులు అందరూ కలిసి తమ అడ్డాలో రూ.5000 వేలతో గ్రీన్‌నెట్‌ ఏర్పాటు చేసుకున్నారు. నగరంలోని సిగ్నల్స్‌ వద్ద, బస్టాండ్‌ వద్ద ఈ తరహా ఏర్పాట్లు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. ఎర్రటి ఎండలో సిగ్నల్స్‌ వద్ద నిరీక్షించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రీన్‌ నెట్స్‌ ఏర్పాటు చేసేవారని, ఇప్పుడు ఎన్నికల కోడ్‌ సాకు చెప్పి తప్పించుకుంటున్నారని వరంగల్‌కు చెందిన చంద్రమౌళి తెలిపారు.

 ఈనాడు, హనుమకొండ

హనుమకొండ కలెక్టరేట్‌ ప్రాంతంలో..

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి..

పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమవడం, ఎండవేడిమికి శరీరంలో మార్పులు రావడం వల్ల వడదెబ్బ బారినపడతారు. మొదట దాహంగా ఉంటుంది. పిల్లలైతే విపరీతంగా ఏడుస్తుంటారు. పెద్దల్లో చికాకు స్వభావం కలిగి ఉంటారు. కళ్లు లోపలికి పోవడం, నోటిలో, నాలుకపై తేమతగ్గడం, తడారిపోవడం, మూత్రం తగ్గడం, అది తీవ్రమైనట్లయితే పిల్లలు షాక్‌లోకి వెళతారు. నాడి తక్కువగా కొట్టుకోవడం, ఫిట్స్‌, కలవరింతలు వస్తాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలి, చెమటపట్టడం ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలు దాటవచ్చు. దీంతో ఒక్కోసారి సొమ్మసిల్లినట్లు స్పృహతప్పడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్తారు.

ఎన్నికల ప్రచారంలో ..

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచార సందడి సాగుతోంది. ప్రభుత్వ అధికారులతోపాటు అన్నివర్గాల ప్రజలు ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినందున ప్రచారంలో పాల్గొనేవారు ఉదయం 10 గంటల్లోపు ముగించుకోవాలి. తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత చేపట్టాలి. తలకు తెల్లనిటోపీ, చెవులలోకి వేడి గాలి వెళ్లకుండా వస్త్రం, రుమాలు కట్టుకోవాలి. గొడుగు ధరిస్తే మంచిది. చల్లటి నీరు కాకుండా సాధారణ నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే

ఇవి తీసుకుంటే మంచిది

వేసవిలో శరీరం నుంచి చెమట రూపంలో నీరంతా డీహైడ్రేషన్‌ అవుతుంది కాబట్టి ద్రవపదార్ధాలు నీరు తరచూ తీసుకోవాలి. ఓరల్‌ డీహైడ్రేషన్‌ సొల్యూషన్‌(ఓఆర్‌ఎస్‌)ను తాగితే మేలు. పెద్దలు ద్రవ ఆహారం సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు తినాలి. పిల్లలకు ఒక్కో విరేచనానికి ఎంతనీరు పోతుందో అంతకంటే ఎక్కువ ఓఆర్‌ఎస్‌ ద్రవాన్ని తాగించాలి. అవసరమైతే బియ్యం, సగ్గుబియ్యంతో తయారుచేసిన గంజి వంటివి, కొద్దిగా ఉప్పుకలిపిన పల్చటి మజ్జిగ, కొబ్బరినీళ్లు, క్యారెట్‌ సూప్‌ వంటివి తాగించాలి. విరేచనాల తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యుడికి చూపించాలి.

 డాక్టర్‌ పవన్‌కుమార్‌, ప్రొఫెసర్‌ జనరల్‌మెడిసిన్‌, ఎంజీఎం ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని