logo

‘మోదీనే దేశానికి పెద్ద దిక్కు’

దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అన్నారు

Published : 08 May 2024 04:33 IST

ములుగులో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు
ములుగు, న్యూస్‌టుడే: దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ గెలుపును కోరుతూ మంగళవారం సాయంత్రం భాజపా ఆధ్వర్యంలో ములుగులో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రారంభానికి ముందే వర్షం ఆరంభమైనప్పటికీ వెనకకు తగ్గకుండా ములుగులోని తిరుమల కళామందిర్‌ నుంచి బస్టాండు వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా గరికపాటి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి మళ్లీ ప్రధాని మోదీనే కావాలని దేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయన్నారు. దేశంలో భాజపా ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. అజ్మీరా సీతారాంనాయక్‌ను ఆశీర్వదించి భాజపా కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీతారాంనాయక్‌ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను. ములుగు ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఆలోచించాలి. నాలాంటి వాళ్లకు అవకాశం కల్పిస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని’ అన్నారు. ఆదివాసి బిడ్డ సీతక్క ఇక్కడ ఉన్నారని, పలుమార్లు ఎమ్మెల్యేగా పని చేస్తున్నారని, ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ములుగులో కేంద్రీయ విద్యాలయం వస్తుందన్నారు. బంజారాల కోసం ఆయన బంజారా భాషలో మాట్లాడి వారిని ఆకట్టుకున్నారు. ర్యాలీలో భాజపా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, పాలసీ రిసెర్చ్‌ రాష్ట్ర కన్వీనర్‌ రాజు నాయక్‌, కన్వీనర్‌ ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు