logo

అధిక స్థానాల్లో కాంగ్రెస్‌దే విజయం

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే ఐదు అమలు చేసింది..రైతుబంధు ద్వారా నిధులు జమచేసింది రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీ అన్నారు.

Published : 08 May 2024 04:34 IST

 మహబూబాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమీక్షిస్తున్న ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీ
మహబూబాబాద్‌ న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే ఐదు అమలు చేసింది..రైతుబంధు ద్వారా నిధులు జమచేసింది రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీ అన్నారు. మంగళవారం మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని గ్యారంటీ పథకాలతోపాటు రైతుబంధు సహాయం అందడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల వాతవరణం కనిపిస్తుందని అత్యధిక మెజార్టీతో ఎంపీ స్థానాలు గెలవబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తొలిసారిగా మహబూబాబాద్‌కు వచ్చిన ఆమెను కాంగ్రెస్‌ నేతలు సన్మానించారు.

ఎమ్మెల్యేలతో సమీక్ష..

 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీ మంగవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో వివిధ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఎన్నికల ప్రచారంపై సమీక్షించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరీతో కలిసి మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు మురళీనాయక్‌, రాంచంద్రునాయక్‌, కోరంకనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, డీసీసీ అధ్యక్షుడు జిన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి, ఎన్నికల విజయవకాశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమన్వయంతో పనిచేస్తే అధిక మెజార్టీతో పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యకర్తలు బాగా పనిచేశారని ఈ ఆరు రోజులు కష్టపడితే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు