logo

మెరుగైన విద్యుత్తు సరఫరాకు చర్యలు

వేసవి ఎండల తాపానికి జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. డిమాండ్‌కు అనుకూలంగా ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో అధికారులు మెరుగైన సరఫరాకు గత నాలుగు నెలలుగా చర్యలు చేపట్టారు.

Updated : 08 May 2024 06:27 IST

మార్చిలో 6.54 మిలియన్‌ యూనిట్ల వినియోగం

కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లిలో 11కేవీ పీడర్‌లో మరమ్మతులు

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: వేసవి ఎండల తాపానికి జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. డిమాండ్‌కు అనుకూలంగా ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో అధికారులు మెరుగైన సరఫరాకు గత నాలుగు నెలలుగా చర్యలు చేపట్టారు. గత మార్చిలో అత్యధిక డిమాండ్‌ నమోదైంది. ఈ మేరకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్తు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షేత్ర స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా గృహ వినియోగం మొదలకుని వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు మెరుగైన సరఫరా అందించడానికి అధిక నిధులు కేటాయించి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతంలో కంటే మెరుగ్గా పనితీరు..

 ఈ ఏడాది జనవరి నుంచి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగా డీటీఆర్‌ల ఏర్పాటు కోసం రూ.3.85 కోట్లు, పీటీఆర్‌ల కోసం రూ.5కోట్లు, వ్యవసాయ కనెక్షన్ల కోసం రూ.5 కోట్లను వెచ్చించారు. గత ఏడాది మార్చిలో 5.06 మిలియన్‌ యూనిట్లు విద్యుత్తు డిమాండ్‌ నమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో జిల్లా వ్యాప్తంగా 6.54 మిలియన్‌ యూనిట్లకు చేరుకోవడం విశేషం. గత ఏడాది వేసవిలో (2022-23) 33కేవీ లైన్లలో 30సార్లు బ్రేక్‌ డౌన్లు నమోదు కాగా, ఈ సారి కేవలం ఐదుసార్లు మాత్రమే బ్రేక్‌డౌన్లు నమోదయ్యాయి. ట్రిప్పింగ్‌లు 27 శాతం తగ్గగా, నియంత్రికల వైఫల్యాలు 1.7 శాతం మేరకు తగ్గించారు. మెరుగైన సరఫరా కోసం 224 అదనపు విద్యుత్తు నియంత్రికలను ఏర్పాటు చేశారు. ఉపకేంద్రాల్లో కొత్తగా 5 అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను, 7 కెపాసిటర్‌ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ఉపకేంద్రాల్లో ఎర్త్‌ఫిట్లను నీటితో తడిపేందుకు బోరు బావులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వ్యవసాయ రంగానికి, అర్హులైన వారికి (గృహజ్యోతి) 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునూ అందిస్తున్నారు.

నిరంతర సమీక్షలు.. క్షేత్ర స్థాయిలో అప్రమత్తం

వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా స్థాయిలోని జనగామ సర్కిల్‌ ఎన్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఈ ఆధ్వర్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్ల వారీగా ఉద్యోగులు, సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిరంతరం అప్రమత్తంగా ఉండేలా సిబ్బందికి సూచిస్తున్నారు. ఇదే సమయంలో జనగామ సర్కిల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌ తన కార్యాలయం నుంచి జిల్లా పరిధిలోని విద్యుత్తు శాఖ డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర ఉద్యోగులతో రెండు రోజులకోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ సమీక్షలు జరుపుతున్నారు.


నాణ్యమైన సరఫరాకు చర్యలు..  
- టి.వేణుమాధవ్‌, ఎన్పీడీసీఎల్‌ జనగామ సర్కిల్‌ ఎస్‌ఈ

జిల్లా వ్యాప్తంగా మెరుగైన విద్యుత్‌ సరఫరాకు అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగు సూచనలు చేస్తున్నాం. అంతరాయాలు చాలా వరకు తగ్గించాం.. డిమాండ్‌కు అనుకూలంగా ఉపకేంద్రాల్లో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, కెపాసిటర్లను ఏర్పాటు చేశాం. ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్తంభాలు, తెగిన వైర్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు లు చేపట్టి, అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు