logo

రేవంత్‌ ప్రసంగం.. కాంగ్రెస్‌లో ఉత్తేజం

వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్‌ నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌ విజయవంతమైంది.

Published : 08 May 2024 07:22 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.  కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య
వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్‌ నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌ విజయవంతమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భాజపా, భారాసలపై పదునైన విమర్శలు చేశారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రసంగించారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను రెండో రాజధానిగా గుర్తింపు తేవాలంటే కడియం కావ్యను లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

న్యూస్‌టుడే, హనుమకొండ చౌరస్తా, వరంగల్‌ విద్యావిభాగం: కార్నర్‌ మీటింగ్‌ మొదట వరంగల్‌ తూర్పులో నిర్వహించాల్సి ఉండగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో హనుమకొండ చౌరస్తాలో ముందుగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్నర్‌ మీటింగ్‌  1.40 గంటలు ఆలస్యంగా 7.42 గంటలకు మొదలైంది.

హనుమకొండ చౌరస్తా కార్నర్‌ మీటింగ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్యలు స్వాగతం పలికారు. అభిమానులు సీఎం రేవంత్‌పై పూలవర్షం కురిపించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రజాకవి కాళోజీల పేర్లను ప్రస్తావించారు. ఉద్యమాల పురిటి గడ్డ కాకతీయ విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు.  ఇండియా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు ఎర్ర జెండాలతో సభకు వచ్చారు.

మడికొండలో ఘన స్వాగతం

మడికొండ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సాయంత్రం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం గుండా రాత్రి 7.16 గంటలకు మడికొండ చౌరస్తాకు చేరుకోగా.. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు సీఎం వాహనంపై పూలవర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డి వాహనం నుంచి బయటకు వచ్చి శ్రేణులతో కరచాలనం చేసి, అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వివాహ వార్షికోత్సవం కావడంతో పార్టీ శ్రేణులు తెచ్చిన కేకును మండల నాయకులు నర్మెట్ట వెంకటరమణగౌడ్‌, మెట్టుగుట్ట ఛైర్మన్‌ పైడిపాల రఘుచందర్‌ కోసి పంచారు.


పర్యటన ఇలా...

  • రాత్రి 7.42 : కాంగ్రెస్‌ భవన్‌ కూడలి వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌ 
  • 7.44 : మీటింగ్‌ పాయింట్‌ వద్దకు రాక 
  • 7.48 :  వేదికపైకి చేరిక  
  • 7.50 : పార్లమెంట్‌ అభ్యర్థి కడియం కావ్య ప్రసంగం 
  • 7.52 :  సీఎం రేవంత్‌ ప్రసంగం ప్రారంభం 
  • 8.17 : ప్రసంగం ముగింపు 
  • 8.18 : వరంగల్‌కు ఓపెన్‌ టాప్‌ జీపులో నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

    గాడ్సే సిద్ధాంతాలను ఆచరిస్తున్న భాజపా

- మంత్రి సీతక్క

దేశం కోసం పోరాటం చేసిన గాంధీజీ సిద్ధాంతాలను కాంగ్రెస్‌ ఆచరిస్తుంటే.. ఆయన్ను చంపిన గాడ్సే సిద్ధాంతాలను భాజపా ఆచరిస్తోంది. కార్పొరేట్‌ సంస్థల వైపు భాజపా ఉంటే.. కష్టజీవుల వైపు కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీ ఉన్నారు. సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కరించాలంటే మీ అమ్యూలమైన ఓటును కడియం కావ్యకు వేసి గెలిపించండి.


పదేళ్లలో చేయలేని అభివృద్ధి నాలుగు నెలల్లో చేశాం.
- ఎమ్మెల్యే నాయిని

గత పాలకులు పదేళ్ల కాలంలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే చేసింది. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాం. చారిత్రక ఓరుగల్లు నగరంలోని ప్రధాన సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన ఉంది. ఇక్కడ భూగర్భ డ్రైనేజీని తెచ్చే దిశగా కృషి చేస్తున్నాం. కడియం కావ్యను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెప్పించి మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.


ఓరుగల్లుపై సీఎంకు మమకారం..
- అభ్యర్థి కడియం కావ్య

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హనుమకొండకు రావడం చూస్తేనే ఆయనకు ఓరుగల్లుపై ఉన్న మమకారం తెలుస్తోంది. రాజధానికి ధీటుగా నగరాభివృద్ధికి ఇప్పటికే సీఎం కృషి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తనను ఆశీర్వాదిస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పాటుపడతా.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, కుడా ఛైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ నేతలు బత్తిని శ్రీనివాస్‌, ఈవీ శ్రీనివాస్‌, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
- న్యూస్‌టుడే, హనుమకొండ చౌరస్తా, నయీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు