logo

ప్రాణం మీదకొస్తున్నా...

ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం ఎస్సీ కాలనీలో ఇళ్లపై నుంచి 11 కేవీ విద్యుత్తు లైను వెళ్లింది. కొద్ది నెలల కిందట డాబా పైన దుస్తులు ఆరేస్తుండగా ఈర్లపాటి మంగమ్మ విద్యుతాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలైంది.

Published : 01 Jul 2022 03:27 IST

మార్చాలని విన్నవించినా.. పట్టించుకోని యంత్రాంగం

మృత్యుపాశాలుగా మారుతున్న విద్యుత్తు తీగలు

ముదినేపల్లి, భీమడోలు, నిడమర్రు గ్రామీణం, ఉంగుటూరు, న్యూస్‌టుడే

ఏలూరు అశోక్‌నగర్‌ రోడ్డులో భవనం చెంత తీగలు

ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం ఎస్సీ కాలనీలో ఇళ్లపై నుంచి 11 కేవీ విద్యుత్తు లైను వెళ్లింది. కొద్ది నెలల కిందట డాబా పైన దుస్తులు ఆరేస్తుండగా ఈర్లపాటి మంగమ్మ విద్యుతాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలైంది.

జంగారెడ్డిగూడెం మండలం  దేవులపల్లిలో ఇటీవల విద్యుత్తు తీగలు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న అన్నదమ్ములు సజీవదహనం అయ్యారు.

ముదినేపల్లి: అంబేడ్కర్‌ కాలనీలో తీగలు తగలకుండా ఏర్పాటు చేసుకున్న కర్రలు

దశాబ్దాల కిందట వేసిన విద్యుత్తు తీగలు ప్రజలను వణికిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా వాటిని మార్చకపోవడం, కొత్తవాటిని ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్నిచోట్ల ఇళ్లపై నుంచి తీగలు వెళ్లడంతో ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోనని ఆయా ప్రాంతాలవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉంగుటూరు: ఇంటిపై నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్తు లైను

* భీమడోలులోని బీసీ కాలనీ, ఇందిర కాలనీ, అరుంధతీ కాలనీ, పోలసానిపల్లిలోని బీసీ కాలనీ, సూరప్పగూడెం, పూళ్ల, లంక గ్రామాలైన చెట్టున్నపాడు, ఆగడాలలంక తదితర గ్రామాల్లో విద్యుత్తు తీగలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. ఈదురుగాలులు వచ్చినప్పుడు నిప్పురవ్వలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమస్యపై పోలసానిపల్లి బీసీ కాలనీవాసులు ఇటీవల ఆందోళనకు దిగారు.  
ఇళ్ల మధ్య ప్రమాదకరంగా.. ముదినేపల్లి అంబేడ్కర్‌ కాలనీలో రెండు దశాబ్దాల కిందట ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్నారు. అప్పుడు వేసిన విద్యుత్తు స్తంభాలు, తీగలే నేటికీ ఉన్నాయి. ప్రస్తుతం వాటి స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించుకోవాలంటే స్తంభాలు, తీగలు అడ్డు వస్తున్నాయి. దీనిపై గతంలో కాలనీవాసులు ఆందోళన నిర్వహించారు. రెండుసార్లు  కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. అయినా ఫలితం లేదు. స్తంభం మార్చాలంటే రూ.13 వేలు కట్టాలంటూ విద్యుత్తు శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీన్ని ఆనుకుని కొత్తగా ఏర్పడిన కాలనీకి సైతం కనీసం స్తంభాలు సైతం వేయలేదు. దీంతో కర్రలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తు తీగలు లాక్కున్నారు. సుమారు వంద కుటుంబాల వరకు ఈ ప్రాంతంలో నివాసముంటున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని హడలిపోతున్నారు.  

* నిడమర్రు మండలం బువ్వనపల్లి ఎస్సీ కాలనీలో ఇంటి మీద నుంచి చేతికందే ఎత్తులోనే వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా చేసే వైర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నిర్మాణానికి ఇబ్బందులు.. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణానికి విద్యుత్తు తీగలు అడ్డుగా ఉన్నాయి. ఇప్పటికైనా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి తీగలు మార్పు చేయాలి.

-రామస్వామి, స్ధానికుడు, బువ్వనపల్లి ఎస్సీ కాలనీ


అనేకసార్లు మొర పెట్టుకున్నా..

స్తంభాలు తొలగించాలని, విద్యుత్తుతీగలు ప్రమాదకరంగా ఉన్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించాం.  తీగలు ఇంటిపై నుంచి తక్కువ ఎత్తులో వెళుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు.

- మద్దాల శివబాబు, అంబేడ్కర్‌ కాలనీవాసి, ముదినేపల్లి


సమస్య పరిష్కరిస్తాం..

విద్యుత్తు లైన్లు తక్కువ ఎత్తున వేలాడుతుంటే ఆ సమాచారాన్ని ప్రజలు స్థానిక అధికారుల దృష్టికి తీసికెళ్లవచ్చు. సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

- శ్యాంబాబు, ఏపీఈపీడీసీఎల్‌, ఎస్‌ఈ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు