logo

అడుగుపడక.. ఇంకొన్ని నత్తనడక!

ముదినేపల్లి మండలంలోని ఓ సచివాలయానికి వెళ్లిన 104 వైద్యసిబ్బందికి గదులు కేటాయించకపోవడంతో పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో కుర్చీలు వేసుకుని, రాళ్లగుట్టలపైన వైద్యసేవలు అందించారు.

Updated : 10 Jun 2023 04:38 IST

పూర్తికాని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం
ఇరుకు గదులు, అద్దె భవనాల్లోనే సేవలు

ముదినేపల్లి: కొవ్వాడలంకలో    పునాదుల దశలో  వెల్‌నెస్‌ కేంద్ర నిర్మాణం

ముదినేపల్లి, మండవల్లి, ఉంగుటూరు, గణపవరం, న్యూస్‌టుడే:

* ముదినేపల్లి మండలంలోని ఓ సచివాలయానికి వెళ్లిన 104 వైద్యసిబ్బందికి గదులు కేటాయించకపోవడంతో పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో కుర్చీలు వేసుకుని, రాళ్లగుట్టలపైన వైద్యసేవలు అందించారు.

* ఉంగుటూరు మండలం నాచుగుంటలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. దీనికి నెలకు అద్దె కోసం రూ.2 వేలు     చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడ ఇరుకుగా ఉండటంతో వలందించడంలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సచివాలయ పరిధిలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలకు (వెల్‌నెస్‌ కేంద్రాలు) శ్రీకారం చుట్టింది. వంద శాతం ఉపాధి నిధులతో పక్కా భవనాలు నిర్మించ తలపెట్టింది. ఒక్కో భవనానికి రూ.17.50 లక్షలు చొప్పున మంజూరు చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా మంజూరైన వాటిలో  25 శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం. వీటిలో కొన్ని ఇంకా పునాది దశలో ఉండగా.. పలు చోట్ల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గత్యంతరం లేక అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నిర్వహించాల్సి వస్తోంది. ఆయా చోట్ల సరైన వసతుల్లేక సేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంచనా విలువ పెంచినా.. ఒక్కో కేంద్రం నిర్మాణానికి తొలుత రూ.17.50 లక్షలు మంజూరు చేశారు. అయితే నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయాన్ని అదనంగా రూ.3 లక్షలకు పెంచారు. కైకలూరు నియోజకవర్గంలో మొత్తం 72 కేంద్రాలకు 55 భవనాలు మంజూరయ్యాయి. వాటిలో 10 కేంద్రాలే పూర్తయ్యాయి. 25 పునాది దశలో ఉన్నాయి. ఉంగుటూరు పరిధిలో 76 కేంద్రాలకు 58 భవనాలు మంజూరుకాగా, ఏడు మాత్రమే పూర్తయ్యాయి. 21 పునాదులు దాటలేదు.

నారాయణపురంలో వైద్యసేవల కోసం వేచి ఉన్న రోగులు

ముందుకు రాని గుత్తేదారులు

గతేడాది డిసెంబరు నాటికే పనులు పూర్తికావాల్సి ఉంది. ప్రతి నెలా  అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటం, సకాలంలో బిల్లులు రాకపోవటంతో గుత్తేదారులు పనులకు ముందుకు రావటం లేదు. దీంతో చాలా చోట్ల నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. నిర్మాణ సామగ్రి తుప్పు పడుతున్నాయి. ‘గుత్తేదారుల తీరుతో కొన్ని చోట్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని మండవల్లి పంచాయతీరాజ్‌ డీఈ పగడాల సురేశ్‌ తెలిపారు.

కోడూరు సచివాలయంలో ఇరుకుగదిలో 104 సిబ్బంది వైద్య పరికరాలు

నెరవేరని లక్ష్యం

భవనాలు పూర్తయ్యే వరకు గ్రామ సచివాలయాల్లో వైద్య సేవలందించేలా ప్రభుత్వం తాత్కాలికంగా చర్యలు చేపట్టింది. ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వైద్యుల్లో ఒకరిని సచివాలయాల్లో రోజుకొకరు చొప్పున సేవలందించాలని సూచించింది. దీనికి సంబంధించి జాబ్‌చార్ట్‌  సైతం రూపొందించారు. వైద్యుడితో పాటు 104 సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు రోగుల వివరాలు సేకరించి వాటిని నమోదు చేయాలి. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా సంబంధిత ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. ప్రసుత్తం వెల్‌నెస్‌ కేంద్రాలు పూర్తి కాకపోవటంతో ఇరుకు రేకుల షెడ్డులో, 104 వాహనంలోనే సేవలు అందిస్తున్నారు.


పనులు వేగవంతం చేస్తాం..  

ఇప్పటి వరకు పూర్తి చేసిన వాటికి బిల్లులు మంజూరయ్యాయి. పూర్తి కావాల్సిన నిర్మాణాలకు సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. నిధులు మంజూరు కాగానే వేగంగా పనులు చేపడతాం.

అజయ్‌, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ, ఏలూరు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని