logo

యువతకు ఉపాధి ఆక్వాకు ఊతం

‘వైకాపా అస్తవ్యస్త విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి అన్ని వర్గాలకు విముక్తి కల్పించేలా కూటమి మ్యానిఫెస్టోను ప్రకటించాం.

Published : 08 May 2024 05:53 IST

‘ఈనాడు’తో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ ‌

 ఈనాడు డిజిటల్‌, భీమవరం, నరసాపురం, న్యూస్‌టుడే: ‘వైకాపా అస్తవ్యస్త విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి అన్ని వర్గాలకు విముక్తి కల్పించేలా కూటమి మ్యానిఫెస్టోను ప్రకటించాం. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాం. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా గాడితప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి కూటమి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌కు కేంద్రంలో మోదీ సంకల్ప్‌పత్ర్‌ జతచేసి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. జిల్లాలో ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం’ అని నరసాపురం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆయన ఈనాడు ముఖాముఖీలో మాట్లాడారు.

 జిల్లాలో పంట కాలువల ఆధునికీకరణ, మురుగునీటి పారుదల అభివృద్ధి ద్వారా వరి, ఆక్వా సాగును ముంపు నష్టాల నుంచి రక్షణ కల్పిస్తాం. ఉప్పుటేరులో రెగ్యులేటర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. దీంతో ఉప్పునీటి సమస్య పరిష్కారమవుతుంది. నరసాపురంలోని బియ్యపుతిప్ప వద్ద హార్బర్‌ నిర్మాణం ప్రారంభం కాలేదు. దీనికోసం కేంద్రం సహకారం కోరతా. ప్రభుత్వం తరపున ఆక్వా రైతులకు ఉపయోపడే విధంగా కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా కృషిచేస్తా.  జిల్లా నుంచి ఏటా రూ.18వేల కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయి. టౌన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సుమారు రూ.300 కోట్ల వరకు రావాల్సి ఉంది. వాటి మంజూరుకు కృషిచేస్తా. ఆక్వా రంగానికి పూర్తి చేయూత ఇస్తాం.

 ఎస్సీ పథకాల పునరుద్ధరణ.. ఎస్సీ సబ్‌ప్లాన్‌ అమలుతో పాటు బడ్జెట్లో చేసిన కేటాయింపుల మేరకు ఏటా నిధులు వ్యయం చేస్తాం. గతంలో అమలైన 27 ఎస్సీ పథకాలను పునరుద్ధరిస్తాం. వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పథకాలను 36 వరకు రద్దు చేసింది. వాటన్నింటినీ పునరుద్ధరిస్తాం. కార్పొరేషన్లు పెట్టి ఆర్థికంగా ఆదుకుంటాం.

యాభై ఏళ్లకు పింఛను

సామాజిక పింఛను రూ.4వేలకు పెంచుతాం. లబ్ధిదారు ఇంటి వద్దకే తెచ్చి అందిస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తాం. జిల్లాలో ప్రస్తుతం 2.33 లక్షల మంది పింఛను అందుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను అందించడంతో మరో 30వేల మంది అర్హులుగా చేరే అవకాశం ఉంది. అన్ని వృత్తుల వారికి నిర్దేశించిన పింఛను అందనుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.10 వేల పింఛను అందించనున్నాం. ఇవన్నీ పక్కాగా అమలవుతాయి. ఆంక్షలు లేని సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం.

అన్నదాతకు ఏటా రూ.20వేల ఆర్థికసాయం.. జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్నదాత దారుణంగా నష్టపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం అందిస్తాం. 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు, రాయితీపై సోలార్‌ మోటార్లు ఇచ్చి మిగులు విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తాం. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు గతంలో ఇచ్చిన మాదిరిగా వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు రాయితీపై అందజేస్తాం. కౌలు రైతులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయడంతోపాటు కౌలు కార్డులిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. డ్రిప్‌ సామగ్రి ఇవ్వడంతో పాటు పంటల బీమాను పునరుద్ధరిస్తాం.

ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తాం.. జగన్‌ పాలనలో తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్లెక్కి పోరాటాలు చేయాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలనిచ్చి, ఆనక మాట మార్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండే ఉద్యోగులు కష్టజీవులు. అందరికీ ఒకటో తేదీనే జీతాలు అందిస్తాం. బకాయిలన్నీ చెల్లించి అండగా నిలుస్తాం. విశ్రాంత ఉద్యోగులకు సైతం పింఛన్లు సకాలంలో అందజేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలుచేస్తాం. అవుట్‌్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం.  

యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన..

జిల్లాలో పరిశ్రమలకు అనుగుణంగా మార్కెటింగ్‌, టెక్నాలజీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తాం.  ఏటా 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు   నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందజేస్తాం. కేంద్ర ప్రభుత్వ యువశక్తి కార్యక్రమం ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తాం. నిరుద్యోగ యువతకు రాయితీపై బ్యాంకు, ముద్ర రుణాలను రూ.20 లక్షల వరకు అందిస్తాం. నియోజకవర్గాల వారీగా నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తాం.

మహిళలకు ఉచిత ప్రయాణం

డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిచ్చి  స్వయం ఉపాధి మార్గాలు పొందేలా ప్రణాళిక చేశాం. 18 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు