logo

ఏం మార్చారు.. ఏమార్చారంతే?

‘‘సీఎం మాటలకు... క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం హామీలకే పరిమితమైంది. దెబ్బతిన్న పరికరాలు, శిథిలమైన భవనాలు... సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో వైద్యమంటేనే  గిరిజనులు వెనకడుగు వేస్తున్నారు.’

Published : 08 May 2024 06:02 IST

రూపురేఖలు మారిపోతాయంటూ జగన్‌ ప్రగల్భాలు

పీహెచ్‌సీల్లో లోపించిన వసతులు, సేవలు

 

దేవుని దయ... ప్రజలందరి చల్లనిచూపుతో  ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలన్నీ మారుస్తాం. నాడు-నేడు   కింద కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందేలా చూస్తాం.’
- ముఖ్యమంత్రి జగన్‌ పలికే వంచన మాటలివి.

‘‘సీఎం మాటలకు... క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం హామీలకేపరిమితమైంది. దెబ్బతిన్న పరికరాలు, శిథిలమైన భవనాలు... సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో వైద్యమంటేనే  గిరిజనులు వెనకడుగు వేస్తున్నారు.’

  • వేలేరుపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యానికి నిరీక్షిస్తున్న రోగులు వీరు. రెండేళ్ల కిందట వరదల్లో పీహెచ్‌సీ భవనం ముంపునకు గురికాగా... ప్రస్తుతం బాలుర వసతిగృహంలో సేవలందిస్తున్నారు. ఇక్కడా మౌలిక సదుపాయాల్లేక... వరండాలు, ఇరుకు గదుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షలు చేసేందుకు పరికరాలు లేకపోవడంతో... ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. స్వల్ప జ్వరమొచ్చినా... జంగారెడ్డిగూడెం, ఖమ్మం పట్టణాలకు పరుగులు తీస్తున్నారు.  

   - న్యూస్‌టుడే, వేలేరుపాడు

  • బొర్రంపాలెంలో  పీహెచ్‌సీలో ఓ గది శిథిలావస్థకు చేరిన దృశ్యమిది. గోడలు బీటలు వారగా... పైకప్పు పెచ్చులూడుతోంది. ఈ గదిలోనే శస్త్రచికిత్సలు చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో రెండేళ్ల కిందట రూ.1.50 కోట్లతో ప్రారంభించిన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ఆదిలోనే నిలిచిపోయాయి.

- న్యూస్‌టుడే, టి.నరసాపురం

ఏలూరు జిల్లాలో 60 ప్రాథ]మిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. సింహభాగం పీహెచ్‌సీల్లో సౌకర్యాలలేమి రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక్కడ 63 వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ, అరకొర పరీక్షలు, మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నరాల బలహీనత, మైగ్రేన్‌, గ్యాస్‌ట్రబుల్‌, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఎముకలు, కంటి సమస్యలకు మందులు ఇవ్వడం లేదు. థైరాయిడ్‌, డెంగీ, కిడ్నీ, లివర్‌ ఇన్‌ఫెక్షన్‌, కొలెస్ట్రాల్‌ తదితర వ్యాధులకు కనీసం పరీక్షలు సైతం చేయడం లేదు. మధుమేహం, బీపీ, మలేరియా, టైఫాయిడ్‌, కామెర్లకు మాత్రమే పరీక్షలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రాత్రివేళ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకెళ్లే రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపణలున్నాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.

న్యూస్‌టుడే - ఏలూరు టూటౌన్‌, జంగారెడ్డిగూడెం

  •  జీలుగుమిల్లి పీహెచ్‌సీలో పాడైన బెడ్లు, పరికరాలు, మందుల డబ్బాలను మూలనపడేసిన చిత్రమిది. రోగులకు బెడ్లు సమకూర్చడంలోనూ చేతివాటం ప్రదర్శించి... నాసిరకమైనవి సరఫరా చేశారు. కొన్నాళ్లకే అవికాస్త విరిగిపోయి మూలకు చేరాయి. ఇక్కడి శుద్ధినీటి పరికరాన్ని సైతం పక్కనపెట్టారు.       

- న్యూస్‌టుడే, జీలుగుమిల్లి

  •  వింజరం పీహెచ్‌సీకి మంజూరు చేసిన సీబీపీ  పరికరమిది. రోగుల హిమోగ్లోబిన్‌, ప్లేట్‌లెట్లు, రక్తకణాల వివరాలు సేకరించేందుకు పరికరం కేటాయించగా... ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టు మాత్రం భర్తీ చేయలేదు. ఫలితంగా స్టాఫ్‌నర్సులతోనే ఆయా పరీక్షలు చేయిస్తున్నారు. వారిపై పనిఒత్తిడి పెరిగి.. రోగులకు నాణ్యమైన సేవలందించలేకపోతున్నారు.      

  - న్యూస్‌టుడే, పోలవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు