logo

జగన్‌ గారడీ..బీఎల్వోలకు బురిడీ!

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్‌ బురిడీ కొట్టించారు.

Published : 10 May 2024 04:07 IST

మూడేళ్లుగా గౌరవ వేతనం ఇవ్వని ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో రూ. 9.61 కోట్ల బకాయిలు

ఎన్నికల విధుల్లో బీఎల్వోలు

పాలకొల్లు, న్యూస్‌టుడే:  18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్‌ బురిడీ కొట్టించారు. మూడేళ్లుగా వారికివ్వాల్సిన గౌరవ వేతనానికి గండి కొట్టారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్నా బీఎల్వోలకు ఇవ్వాల్సిన సొమ్ములపై పెదవి మెదపడం లేదు. చిరుద్యోగులుగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని 3,204 మంది బీఎల్వోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కాళ్లరిగేలా తిరిగి...

ఎన్నికల విధుల్లో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల వేళ ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే వరకు బీఎల్వోలే క్షేత్రస్థాయిలో కీలకం. ఫారం 6, ఫారం 7 సవరణలు మొదలుకుని తుది ఓటర్ల జాబితా తయారయ్యే వరకూ బీఎల్వోలు ఇంటింటికీ కాళ్లరిగేలా తిరగడం అందరికీ తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ ప్రతిచోటా కనిష్ఠంగా 169, గరిష్ఠంగా 286 మంది బీఎల్వోలు విధులు నిర్వర్తిస్తున్నారు.

రూ. 12 వేలు ఇస్తామని...

రెవెన్యూశాఖలో వీఆర్‌ఏలుగా గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్‌ సహాయకులుగా పనిచేసే సిబ్బందిని బీఎల్వోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా పనిచేయడానికి ఏడాదికి రూ.6 వేలు గౌరవ వేతనం, రూ.వెయ్యి భత్యం ఇస్తామని 2022లో ప్రకటించారు. ఎన్నికల ఏడాది సమీపించాక పనిభారం పెరగడంతో గౌరవ వేతనం రూ.12వేలుగా పెంచినట్లు చెప్పారు. నియమావళి అమల్లోకి వచ్చాక కూడా బీఎల్వోలకు కనీసం స్టేషనరీ ఇచ్చిన పాపాన పోలేదు. గత జనవరి నుంచి ఒక్క స్టేషనరీకే రూ.5 వేలు వెచ్చించామని బీఎల్వోలు వాపోతున్నారు. వీటిలో దేనికీ పైసా విడుదల చేయకపోవడం ఆవేదనకు దారితీస్తుంది. మూడేళ్లుగా ఒక్కొక్కరూ పెట్టిన ఖర్చులు కలుపుకొని రూ.30 వేలకు పైబడి రావాలని బీఎల్వోలు చెబుతున్నారు.

కమిషనర్‌ను కలిసినా...

బీఎల్వోల దుస్థితిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను స్వయంగా కలిసి విన్నవించినా స్పందన రాలేదని వీఆర్వోల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ‘న్యూస్‌టుడే’తో వాపోయారు. గౌరవ వేతనాలు విడుదల చేయక ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులను విడుదల చేయక క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియడం లేదన్నారు. మరో రెండు రోజుల్లో జరగబోయే ఎన్నికలకు నిర్వహణ సిబ్బంది ఒకరోజు ముందుగానే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. కానీ ఇంతవరకు వారికి కల్పించే భోజన సదుపాయం గూర్చిగాని పోలింగ్‌ కేంద్రాల దగ్గర వేయాల్సిన షామియానా పందిళ్లు గూర్చిగాని ఎటువంటి ఆదేశాలు ఇప్పటివరకు వెలువడకపోవడం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని