logo

రాబందులే నయం.. పీక్కు తినడమే ఈ నేతల పని!

వైకాపా నేతల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో వసూళ్ల దందా చేస్తూ సామాన్యులను రాబందుల్లా పీక్కుతింటున్నారు.

Updated : 10 May 2024 05:43 IST

వైకాపా నాయకుల  అవినీతి పర్వం
ప్రతి పనికీ దండుకోవడమే

ఈనాడు, భీమవరం: వైకాపా నేతల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో వసూళ్ల దందా చేస్తూ సామాన్యులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. ఓ నేత కొల్లేరును కొల్లగొడితే..మరో నాయకుడు తమ్మిలేరును తోడేస్తున్నారు. ఇంకో ప్రజాప్రతినిధి మట్టి, ఇసుక, కంకర మాయం చేస్తున్నారు. పట్టణంలో ఇల్లు కట్టాలంటే ముందు వారికి కప్పం కట్టాలి. లేఅవుట్‌ వేయాలంటే ముడుపులు ముట్టజెప్పాలి. అర్హులకు జాగా ఇవ్వాలన్నా   దక్షిణ ఇవ్వాలి. ఇలా గత అయిదేళ్లలో గుత్తేదారులు మొదలు, వ్యాపారుల వరకు ఏ వర్గాన్నీ వదలకుండా దండుకున్నారు. అనధికారిక పనులకైతే కమీషన్లు కాదు. వాటాలు తీసుకుంటూ వసూళ్ల రాజ్యాంగం రాశారు.

వసూళ్ల ప్రతాపం

నూజివీడులో ఓ వైకాపా నేత వసూళ్ల పర్వం పరాకాష్ఠకు చేరుకుంది. నియోజకవర్గంలోని ఓ క్వారీలో 27 ఎకరాలకు అనుమతులు తీసుకుని ఏకంగా 230 ఎకరాల్లో తవ్వకాలు చేసుకునేందుకు అన్ని విధాలా సహకరించారు. దీనికి ఆయన నెలకు రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. జగనన్న కాలనీలకు భూముల విషయంలో భారీగా కుంభకోణం చేశారు. ఎకరం రూ.15 లక్షల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులతో ముందుగా ఒప్పందం చేసుకుని ప్రభుత్వానికి మాత్రం రూ.30 లక్షలకు విక్రయించి ఎకరానికి రూ.కోట్లు కొల్లగొట్టారు. నూజివీడు జగనన్న టౌన్‌షిప్‌ భూములను కూడా ఇదే తరహాలో ఎకరం రూ.40 లక్షలకు రైతుల నుంచి బినామీల ద్వారా కొనుగోలు చేయించి రూ.76 లక్షలకు ప్రభుత్వానికి అమ్ముకున్నారు. బలివే, ఎల్లాపురంలో ప్రభుత్వ పనుల పేరుతో అడ్డగోలుగా ఇసుక తరలించి..ట్రాక్టర్‌ రూ.5 వేలు చొప్పున అమ్ముకున్నారు. రూ.2వేలు ట్రాక్టర్లకు ఇచ్చి మిగిలింది వీరి ఖజానాలో వేసుకున్నారు. ఆయనకు ముడుపులిచ్చి ప్రసన్నం చేసుకుంటే ప్లాన్‌ అప్రూవల్‌ కూడా అవసరం లేదు. ఆర్‌ఆర్‌పేటలో ప్రస్తుతం రూ.3.5 కోట్లతో ఇల్లు కడుతున్న నిర్మాణదారు ఆ నేతకు రూ.2లక్షలు సమర్పించుకున్నారు.

కమీషన్లు కొట్టు..పనులు చేపట్టు

తాడేపల్లిగూడెంలో గత అయిదేళ్లుగా వసూళ్ల పర్వం కమీషన్లు కొట్టు అనే నినాదంపై సాగుతోంది. పట్టణంలో ఇల్లు, భవనం, వ్యాపార సమూహం ఏది నిర్మించాలన్నా అధికారుల అనుమతి కంటే ముందు ఆ వైకాపా నేత అనుమతి తీసుకోవాలి. ముడుపులు చెల్లిస్తేగాని పునాదులు పడవు. అక్రమ లేఅవుట్‌ అయితే అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ఎకరానికి రూ.10 లక్షల వరకు తీసుకుంటారు. సక్రమ లేఅవుట్‌ అయితే ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు రూ.2 లక్షల నుంచి 5లక్షల మధ్య వసూలు చేస్తారు. నల్లజర్ల-కోడేరు రహదారి విస్తరణ కోసం 3 వేల చదరపు గజాలకు బాండ్లు జారీ చేశారు. ఆ స్థలం విలువ రూ.18 కోట్లుగా లెక్కగట్టి అందుకు నాలుగు రెట్లు విలువైన బాండ్లు జారీ చేయించారు. ఇలా చేసినందుకు స్థల యజమానుల నుంచి రూ.కోట్లలో కమీషన్‌  తీసుకున్నారు.  బాణసంచా వ్యాపారం చేసుకునేందుకు కూడా ఆ నేతకు వ్యాపారులు భారీగా ముడుపులు ఇచ్చారు. గత అయిదేళ్లుగా ఇలా రూ.కోట్లు దోచుకున్నారు. ఇటీవలే రైస్‌ మిల్లర్లను పిలిచి అందరూ కలిసి ఎన్నికల ప్రచార ఖర్చులకు రూ.కోటి ఇవ్వాలని ఆదేశించగా..అంత ఇచ్చుకోలేమని రూ.25 లక్షలు ముట్టజెప్పారు.

దందాలు..విధ్వంసాలు

దెందులూరులో అయిదేళ్లు సహజ వనరులను విధ్వంసం చేసి కాసులు పండించుకున్నారా అధికార పార్టీ నేత. వందలాది ఎకరాల్లో చెరువులు అక్రమంగా తవ్వించి సాగు చేస్తూ కొల్లేరుకు గర్భశోకం మిగిల్చారు. అధికారులపై అజమాయిషీ చేసి వైకాపా నాయకుల ద్వారా కొత్తగా చెరువులు తవ్వించి ఎకరానికి రూ.30వేల వరకు కమీషన్‌ తీసుకున్నారు.  అయిదేళ్లుగా నియోజకవర్గంలో జూదం, కోడిపందేల నిర్వహణను భుజాన వేసుకుని మోస్తున్నారు. కోడి పందేనికి వెళ్లాలంటే రూ.1000 ప్రవేశ రుసుం పెట్టారు. నిర్వాహకులు రోజుకు రూ.5 లక్షల వరకు మామూళ్లు ముట్టజెబుతారు.

కమీషన్ల మేత వేయాల్సింది

తణుకు నియోజకవర్గాన్ని అయిదేళ్లుగా కమీషన్ల కారుమబ్బు కమ్మేసింది. అవినీతి దందాతో ఈ వైకాపా నేత రూ.కోట్లకు పడగలెత్తారు. జగనన్న కాలనీల్లో అర్హత ఉన్నా స్థలాలు రావాలంటే ఈయనకు కమీషన్ల మేత వేయాల్సిందే. దాదాపు 16 గ్రామాల్లో ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.30వేల చొప్పున వసూలు చేశారు. పట్టణంలో ప్లాన్‌ అప్రూవల్‌ రావాలన్నా ఆయనకు ముడుపు కట్టాల్సిందే. అన్ని సవ్యంగా ఉన్నా యజమాని రూ.2 లక్షల వరకు సమర్పించుకోవాల్సిందే. లోపాలను బట్టి రేటు పెరుగుతుంది. పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీల నుంచి వసూళ్ల దందా సాగిస్తున్నారు. వారి వ్యాపార సంస్థలపై దాడులు చేయించి భయపెట్టి కమీషన్లు వసూలు చేశారు. అవసరం లేని స్థలాలను తన బినామీలతో కొనిపించి ఆ భూములకు టీడీఆర్‌ బాండ్లు మంజూరు చేయించి, పొలాలకు సైతం గజాల లెక్కన పరిహారం వచ్చేలా ఏర్పాటు చేసుకుని పథకం ప్రకారం భారీగా వసూలు చేశారు.

ముడుపుల ప్రసాదం పెట్టాల్సిందే

నరసాపురంలో ఆ వైకాపా నేతకు ముడుపుల ప్రసాదం పెడితేనే పనుల వరం ప్రసాదిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పార్టీ పెద్దల అండతో భారీగా ఇసుక దందా చేశారు. నిత్యం వేలాది ట్రక్కుల ఇసుక సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకున్నారు. పట్టణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఆయనకు కానుకలు ఇవ్వాల్సిందే. లేదంటే శ్లాబు వరకు వచ్చాక అధికారులను పంపి కూల్చేస్తామని భయపెట్టి రాజుగారి కొలువుకు పంపిస్తారు. చిన్న ఇల్లు అయితే రూ.లక్ష, అపార్టుమెంట్‌ అయితే రూ.5లక్షల వరకు వసూలు చేస్తారు. ఏడాది పాటు పంటు నిర్వహణ వేలం లేకుండా చేసి లెక్కాపత్రం లేకుండా సొమ్ము స్వాహా చేశారు. కొవిడ్‌ సమయంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ అన్నదానం ముసుగులో బడా వ్యాపారులు, దుకాణదారులు, ప్రవాసాంధ్రుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేసి సొంత ఖజానాలో వేసుకున్నారు.

అక్రమాల గ్రంథం

భీమవరంలోని వైకాపా నేత రాసిన అవినీతి గ్రంథంలోని అక్రమాల పర్వాలెన్నో ఉన్నాయి. పట్టణంలో వెంచర్‌ వేయాలంటే ఆయనకు ముడుపులు కట్టాల్సిందే. అక్రమ లేఅవుట్‌లో ఎకరానికి 5 సెంట్ల స్థలం, లేదా దాని విలువకు సరితూగే మొత్తాన్ని కానుకగా స్వీకరిస్తారు. ఆయనకు ముడుపులు కట్టాకే పట్టణంలో భవనాలకు అధికారులు ప్లాన్‌ అప్రూవల్‌ ఇస్తారు. లేదంటే అనుమతులు రావు. అనధికారిక నిర్మాణాలైతే కప్పం భారీగా వసూలు చేస్తారు. కొందరు రైతులను భయపెట్టి 70 ఎకరాల భూమిని అనుచరులు, బినామీల ద్వారా కొనిపించి అదే భూమిని రెట్టింపు ధరకు అమ్ముకుని రూ.కోట్లు వెనకేసుకున్నారు. పట్టణాన్ని అనుకుని ఉన్న గ్రామాల్లో అసైన్డ్‌ భూములను ఆక్రమించి బినామీల పేర్లతో అడ్డగోలుగా ఆక్వా చెరువులు తవ్వారు. అక్కడి నుంచి అనుచరుల ద్వారా మట్టి తొలగించి సొమ్ము చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని